ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం

Posted On: 29 MAR 2023 6:23PM by PIB Hyderabad

భారత్ అధ్యక్షతన మౌలిక సదుపాయాలపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం విశాఖపట్నంలో 2023 మార్చి 29న విజయవంతంగా ముగిసింది. భారతదేశం, ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలకు చెందిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధ్యక్షతన రెండు రోజుల పాటు వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. జీ-20 లో సభ్యత్వం కలిగి ఉన్న 14 దేశాలు, 8 ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థలకు చెందిన 57 మంది ప్రతినిధులు సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు,  

మౌలిక సదుపాయాల పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను ఒక ఆస్తిగా పరిగణించి అభివృద్ధి చేయడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో వినూత్న విధానాల్లో పెట్టుబడులు ఆకర్షించడం లాంటి వివిధ అంశాలు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో చర్చకు వచ్చాయి. 

2023 మౌలిక రంగం కార్యాచరణ ప్రణాళికలో భవిష్యత్తు నగరాల అభివృద్ధికి నిధులు సమీకరించడం, కార్యాచరణలో పొందుపరిచిన ఇతర ప్రాధాన్యతా అంశాలపై వర్కింగ్ గ్రూప్ చర్చించింది. 

ఏడాది కాలంలో అమలు చేయ తలపెట్టిన ప్రధాన అంశంగా గుర్తించిన ' భవిష్యత్తు నగరాల అభివృద్ధి- సుస్థిర, సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి సాధన' అనే అంశంపై సమావేశంలో ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి చర్చలు జరిపారు. నగరాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమీకరించడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం లాంటి అంశాలను ప్రతినిధులు చర్చించారు. 

భవిష్యత్తు నగరాల అభివృద్ధి చేయడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఎదురవుతున్న నిధుల సమస్య పరిష్కారానికి మౌలిక సదుపాయాల రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు వచ్చేలా చూసేందుకు అమలు చేయాల్సిన వినూత్న విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న ప్రాజెక్టులలో నాణ్యతా మౌలిక పెట్టుబడి (క్యూఐఐ) విధానాన్ని అమలు చేయడానికి గల అవకాశాలు లాంటి ముఖ్యమైన అంశాలపై ప్రతినిధులు చర్చలు జరిపారు.పెట్టుబడుల కల్పనకు జరుగుతున్న నిధుల సమాచారాన్ని పూర్తిగా క్రోడీకరించి ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచే అంశంపై కూడా సమావేశం సవివరంగా చర్చలు జరిపింది. 

ప్రధాన సమావేశానికి సమాంతరంగా మౌలిక సదుపాయాల సంబంధిత అంశాలను చర్చించడానికి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ సహకారంతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మౌలిక రంగానికి సంబంధించిన వివిధ అంశాలు, సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటి అంశాలపై 13 మంది అంతర్జాతీయ నిపుణులు చర్చలు జరిపారు. సమావేశానికి యుఎన్ డి ఫై, ఓఈసీడీ , ఐఎంఎఫ్, ఏబిడి, ఈబిఆర్డి లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యత, ఖర్చు చేయాల్సిన నిధులపై మెక్సికోకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ జియోగ్రఫీ, యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ కు చెందిన ప్రతినిధులు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. 

ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంస్కృతిక చరిత్ర తెలియజేసి, ఆంధ్ర రుచులు అందించడానికి 'రాత్రి భోజ్ పర్ సంవాద్ ( విందు ద్వారా చర్చలు)' ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో ప్రతినిధుల కోసం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో యోగ, ధ్యానం, సాత్విక ఆహారాన్ని ప్రతినిధులకు పరిచయం చేశారు.  

రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాత మార్చి 30న ప్రతినిధుల కోసం సామర్థ్య అభివృద్ధి వర్క్ షాప్ జరుగుతుంది. వర్క్ షాప్ లో కొరియా, సింగపూర్ దేశాలకు చెందిన నిపుణులు పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం అమలు చేయాల్సిన ఉత్తమ విధానాలపై ప్రసంగిస్తారు. ' భవిష్యత్తు నగరాల అభివృద్ధి- సుస్థిర, సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి సాధన' కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవసరమైన సామర్థ్య నిర్మాణం అంశంపై వర్క్ షాప్ దృష్టి సారిస్తుంది. 

జీ-20 సమావేశాల నిర్వహణకు ముందు ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు జరిగాయి. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల్లో నమూనా జీ-20 సదస్సు, జీ-20 మారథాన్ నిర్వహించారు. ' నగరాల్లో ప్రైవేట్ ఆర్థిక వనరుల సమీకరణ' అనే అంశంపై ఆర్థిక వ్యవహారాల శాఖ, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మార్చి 22,23 తేదీల్లో రెండు రోజుల ప్రాంతీయ వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ లో మున్సిపల్ కమిషనర్లు,మేయర్లు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరి లకు చెందిన దాదాపు 70 ప్రతినిధులు హాజరయ్యారు. 

వినూత్న ఆలోచనలు , సమిష్టి కృషితో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేలా చూడాలన్న లక్ష్యంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ జీ-20 మౌలిక సదుపాయాల రంగం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 

 

***


(Release ID: 1912184) Visitor Counter : 308


Read this release in: English