హోం మంత్రిత్వ శాఖ

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌర సత్కారం కింద వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), శ్రీ చింతలపాటి వెంకటపతి రాజు,


శ్రీ కోట సచ్చిదానందశాస్త్రి (కళారంగం)లకు పద్మశ్రీ పురస్కారం అందజేశారు. అలాగే విద్య-సాహిత్య రంగాల్లో ప్రొఫెసర్‌ ప్రకాష్‌ చంద్ర సూద్‌కు పద్మశీ అవార్డు ప్రదానం చేశారు.

Posted On: 22 MAR 2023 8:41PM by PIB Hyderabad

   భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ ఇక్కడ నిర్వహించిన పౌర పురస్కార ప్రదాన కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన అవార్డు విజేతలకు పురస్కారం అందజేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), శ్రీ చింతలపాటి వెంకటపతి రాజు, శ్రీ కోట సచ్చిదానందశాస్త్రి (కళారంగం) ఆమె చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అలాగే విద్య-సాహిత్య రంగాల్లో విశేష కృషికిగాను ప్రొఫెసర్ ప్రకాష్ చంద్రసూద్‌కు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు.

పురస్కార గ్రహీతల జీవిత విశేషాలు.. ఆయా రంగాల్లో వారి కృషిపై సంగ్రహావలోకనం:

  1. డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ సామాజిక సేవలో పద్మశ్రీ పురస్కా ప్రదానం.

   డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ ప్రముఖ సంఘ సేవకులు. ఆయన ‘సంకురాత్రి ఫౌండేషన్‌’ నిర్వాహక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే మంజరి సంకురాత్రి స్మారక ఫౌండేషన్‌ అధ్యక్షులుగా, శారదా విద్యాలయం కరెస్పాండెంట్‌గా, శ్రీ కిరణ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆప్తాల్మాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

   డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ 1943 నవంబరు 20వ తేదీన జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి జంతుశాస్త్రం (జువాలజీ)లో ఎం.ఎస్‌సి., కెనడాలోని మెమోరియల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూఫౌండ్‌ల్యాండ్‌ నుంచి బయాలజీలో ఎం.ఎస్‌., ఎడ్మాంటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆల్బెర్టా నుంచి పిహచ్‌.డి., పట్టాలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన కెనడాలోనే 13 సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేశారు. అనంతరం భారతదేశంలో మానవతా దృక్పథంతో సేవలందించడం కోసం 1988లో మాతృభూమికి చేరుకున్నారు.

   ఐర్లాండ్‌ తీరంలో 1985 జూన్‌ 23న ఎయిరిండియా విమానం-182 పేలిపోయిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తన సతీమణి, ఇద్దరు పిల్లల స్మారకార్థం ‘సంకురాత్రి ఫౌండేషన్‌’ ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదలు, అణగారిన వర్గాల జీవన నాణ్యత మెరుగు లక్ష్యంగా ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ దిశగా కాకినాడలో కొన్ని సుస్థిర ప్రగతి పథకాలకు డాక్టర్‌ సంకురాత్రి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ, బాలల విద్య, నాణ్యమైన కంటి సంరక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సహాయ చర్యలు చేపట్టడం వంటి కార్యకలాపాల కోసం 1988 నుంచి ఆయన కాకినాడలో ఉంటున్నారు. ఇప్పటిదాకా ఆయన 5,000 మంది గ్రామీణ విద్యార్థులకు చదువుసంధ్యలు చెప్పించారు. అలాగే 37 లక్షల మందికిపైగా ప్రజలకు కంటి సంరక్షణ సేవలు అందించారు. అంతేకాకుండా 3,25,000 కంటి శస్త్రచికిత్సలు కూడా చేశారు.

   డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ నిస్వార్థ మానవతా సేవలకు తగిన గుర్తింపుతోపాటు అనేక పురస్కారాలు లభించాయి. ఈ మేరకు 2005లో “ఎ రే ఆఫ్‌ లైట్‌” పేరిట ఓ గంట నిడివితో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రాన్ని కెనడా ప్రసార సంస్థ ప్రసారం చేసింది; అనంతరం 2008లో ‘ఈటీవీ-2’ చానల్‌ ఆయన జీవిత విశేషాలపై ‘మార్గదర్శి’ కార్యక్రమం ప్రసారం చేసింది. అలాగే ‘మా టీవీ’ 2011లో “వెలుగు-వెలిగించు” కార్యక్రమం ప్రసారం చేసింది. మరోవైపు విశిష్ట సేవలందించిన ఆయనను ఎన్నో పురస్కారాలు వరించాయి. ఆ మేరకు ‘సిఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌’ 2008లో “సీఎన్‌ఎన్‌ హీరో” అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయుడు ఆయనే కావడం గమనార్హం. కెనడాలోని ఎడ్మాంటన్‌లో 1998లో నిర్వహించిన ‘వరల్డ్‌ వలంటీర్‌ కాన్ఫరెన్స్‌’లో పాల్గొనేందుకు ఆయనను ఆహ్వానించారు. కెనడాకు గర్వకారణంగా నిలిచేలా తమతమ రంగాల్లో విశేష కృషిచేసిన ఆరుగురిలో ఒకరుగా 2009లో ఆయన గుర్తింపు పొందారు. అటుపైన మానవాళికి చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా కెనడాలోని అంటేరియో ప్రభుత్వం 2010లో ‘ధ్రువీకరణ పత్రం’ అందజేసింది. కెనడాలోని మెమోరియల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూఫౌండ్‌ల్యాండ్‌ 2012లో “డాక్టర్‌ ఆఫ్‌ లాస్‌” పట్టాతో ఆయనను సత్కరించింది. ఇక 2013లో ఇండో-కెనెడా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారు “హ్యుమానిటేరియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌” పురస్కారం ప్రదానం చేశారు. అణగారిన వర్గాలకు అంకితభావం, కరుణతో సౌలభ్య-సమాన నేత్ర వైద్య సేవలందించినందుకుగాను 2016లో  కెనడా ఆప్తాల్మాజికల్‌ సొసైటీ ఆయనను “అవుట్‌స్టాండింగ్‌ హ్యుమానిటేరియన్‌ సర్వీస్‌” పురస్కారంతో గౌరవించింది.

   భారతదేశంలోనూ డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ పలు సత్కారాలు అందుకున్నారు. ఈ మేరకు 2002, 2003 సంవత్సరాల్లో గరిష్ఠ సంఖ్యలో కేటరాక్ట్‌ శస్త్రచికిత్సలు చేసినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘అత్యుత్తమ స్వచ్ఛంద సంస్థ’ పురస్కారం ప్రదానం చేసింది. రోటరీ ఇంటర్నేషనల్‌ సంస్థ 2004లో “సర్వీస్‌ అబౌ సెల్ఫ్‌ అవార్డ్‌” అందజేసింది. ఆ తర్వాత 2012లో ‘అసోచామ్‌’ నుంచి “సోషల్‌ ఇన్నొవేషన్‌ ఎక్సలెన్స్‌ అవార్డు'’, 2013లో ‘సీఎన్‌ఎన్‌ - ఐబీఎన్‌’ నుంచి “సీనియర్‌ సిటిజెన్‌” అవార్డు అందుకున్నారు. అనంతరం 2019లో భారత ఉప-రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేతులమీదుగా “పేదలు-అణగారిన వర్గాలకు అందించిన సేవలపై గుర్తింపు పత్రం” స్వీకరించారు.

*****

  1. శ్రీ చింతలపాటి వెంకటపతి రాజుకు కళారంగంలో పద్మశ్రీ పురస్కార ప్రదానం

   శ్రీ చింతలపాటి వెంకటపతి రాజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనకాపల్లి పరిధిలోగల ఏటికొప్పాక గ్రామ వాస్తవ్యువ్యులు. క్షేత్రస్థాయి ఆవిష్కర్త అయిన ఆయన, ఏటికొప్పాక బొమ్మల తయారీ సంప్రదాయ పరిరక్షణకు ప్రశంసనీయంగా కృషి చేస్తున్నారు.

   విజయనగరం జిల్లాలోని జొన్నవలసలో 1963 మే 14న శ్రీ రాజు జన్మించారు. విశాఖపట్నం, విజయనగరంలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం చేసిన ఆయన 1979లో ఎస్‌ఎస్‌సి (పదో తరగతి) పూర్తిచేశారు. శ్రీ రాజు వివిధ రకాల సమకాలీన లక్కపూత చెక్కబొమ్మలకు రూపకల్పన చేశారు. ఈ బొమ్మలకు క్రమేణా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోనూ సముచిత ఆదరణ లభిస్తోంది. ఆయన వృక్ష వనరులతో సీసం రహిత, ప్రకృతి సహజ రంగుల తయారీకి ఎంతగానో కృషి చేశారు. వృక్షాల బెరడు, కాండం, ఆకులు, పండ్లు, విత్తనాలు వగైరాలతో రకరకాల ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ఈ కృషి ఫలితంగా ముదురు ఎరుపు, నీలిరంగు సహా విస్తృత శ్రేణిలో రంగులు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు స్థానికంగా కూరగాయలతో రంగుల తయారీ సంప్రదాయాన్ని పటిష్ఠం చేసే వ్యూహం అనుసరించారు. ఉత్పత్తుల ఉజ్వల శ్రేణిని పెంచగల కొత్త ఉపకరణాలు, పద్ధతులు సాంకేతికతలను అభివృద్ధి చేశారు. ఈ సంప్రదాయక పద్ధతితో హానిరహిత, సహజ రంగులతో కొయ్య ఉత్పత్తులు, బొమ్మల తయారీకి కొత్త భాష్యం చెప్పారు. దక్షిణ భారతంలోని ఏటికొప్పాకలో క్రమంగా అంతరిస్తున్న హస్తకళా సమాజ నైపుణ్యానికి జీవంపోసి. కొత్త గుర్తింపు సాధించిపెట్టారు.

   శ్రీ రాజు కృషికి నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) చేయూతనందించి స్థానికం నుంచి స్వగళం విస్తృతికి దోహదపడింది. ఇందులోభాగంగా మూలధన అవసరాలు తీర్చడానికి ‘మైక్రో వెంచర్ ఇన్నొవేషన్ ఫండ్ (ఎంవిఐఎఫ్)’ నుంచి ఆర్థిక తోడ్పాటు అందించింది. అలాగే ఈ ఆవిష్కర్త ప్రాంగణంలో సామాజిక ప్రయోగశాల ఏర్పాటుకు మద్దతిచ్చింది. ఈ విధంగా ఉన్నచోటనే ఉత్పత్తికి మెరుగుదిద్దేలా పరిశోధన-అభివృద్ధి సౌలభ్యం కల్పించింది. ఆ ఉత్పత్తుల ఔచిత్యాన్ని బలపరుస్తూ వినూత్న ఉత్పత్తుల విస్తృతితోపాటు అత్యంత ఆసక్తికర రీతిలో తయారీకి ప్రోత్సహించింది. ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టపడే రీతిలో బొమ్మలు రూపుదిద్దుకుంటున్నాయి. ఏటికొప్పాక కొయ్య లక్క బొమ్మలు బాగా గుండ్రంగా ఉండటమేగాక సహజ రంగులతో తయారవుతాయి. తద్వారా ముఖ్యంగా పిల్లలకు ఈ బొమ్మలు ఎంతో సురక్షితమైనవిగా రూపొందుతాయి. ఈ అంశం దృష్ట్యానే ఆయన తమ సంప్రదాయ కళారూపాన్ని అంటిపెట్టుకుని, అభివృద్ధి చేస్తూ వచ్చారు. దాంతోపాటు తోటి హస్తకళాకారులను కూడా తన కృషిలో భాగం చేశారు. స్వగ్రామంలో.. స్థానికంగానే వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఏటికొప్పాక బొమ్మలపై ఆయన చేసిన కృషిని... అంటే- కొయ్యబొమ్మల ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో గతవైభవ పునరుద్ధరణకు శ్రీ రాజు శ్రమించిన తీరును గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన 68వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఎంతగానో కొనియాడారు.

   భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం 2002లో శ్రీ రాజును ఎన్ఐఎఫ్ 2వ ద్వైవార్షిక “నేషనల్ గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్‌ ట్రెడిషనల్‌ నాలెడ్జ్‌”తో సత్కరించారు.  ‘ఇంటచ్’ విశాఖ విభాగం 2009లో ఆయనను “జీవనసాఫల్య పురస్కారం”తో సత్కరించింది. అటుపైన 2018లో రాష్ట్రపతి భవన్ నిర్వహించిన ‘ఇన్నొవేషన్ స్కాలర్-ఇన్-రెసిడెన్స్ ప్రోగ్రాం’ 5వ బృందంలో భాగస్వామి కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. అనంతరం 2019లో తెలంగాణలోని ‘క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ శ్రీ రాజును “జీవనసాఫల్య పురస్కారం”తో గౌరవించింది. వార్షిక ‘ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ (ఫైన్)లో కూడా ఆయన పాల్గొన్నారు. ఇది క్షేత్రస్థాయి ఆవిష్కర్తలతోపాటు వారి ఆవిష్కరణల ఘనతను ప్రదర్శించడానికి అతిపెద్ద వేదిక. రాష్ట్రపతి భవన్‌ ఆధ్వర్యంలో ‘ఎన్‌ఐఎఫ్, డిఎస్‌టి’ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

*****

  1. కళారంగంలో శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రికి పద్మశ్రీ పురస్కారం

   శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి ప్రముఖ హరికథా కళాకారుడు. హరికథాగాన కళలో ఏడు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్న ఆయన ఈ కళారూపానికి ప్రాచుర్యం కల్పించడంలో తనవంతుగా అవిరళ కృషిచేశారు.

   ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామంలో 1934 ఆగస్టు 12న శ్రీ శాస్త్రి జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన, 12 ఏళ్ల పసి ప్రాయంలోనే.. అంటే- 1946లో హరికథా కళాకారుడుగా అరంగేట్రం చేసి, నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఈ కళను అక్కపెద్ది రామకృష్ణయ్యతోపాటు ఇంకొందరు గురువుల నుంచి ఆయన అభ్యసించారు. ఆనాటి ప్రసిద్ధ హరికథా కళకారులైన శ్రీ పండితారాధ్యుల సాంబముర్తి (ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకుడు శ్రీ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం తండ్రి) ఆయనకు స్ఫూర్తిదాత. ఆ ప్రేరణతోనే ఆయనకు తననొక నమూనాగా మలచుకున్నారు. తన గురువు ముసునూరి సూర్యనారాయణ దాస్‌ (కీర్తిశేషులు) నుంచి మహాభారతాన్ని ఔపోసన పట్టారు.

   అనంతరం 20వ శతాబద్దం 60 దశకం నుంచి 90వ దశకం దాకా, 21వ శతాబ్దం తొలి సంవత్సరాల్లో శ్రీ శాస్త్రి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌సహా ఇతర రాష్ట్రాల్లోనూ, ఇంగ్లాండ్‌, మారిషస్‌ వంటి విదేశాల్లో కూడా విస్తృతంగా ప్రదర్శనలిచ్చారు. శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు, శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతులు, శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసు తదితర దిగ్గజాల రచనలను హరికథా గానంలో ఉపయోగించుకున్నారు. త్యాగరాజు, పురందర దాసు, రామదాసు, అన్నమయ్య, క్షేత్రయ్య, సదాశివ బ్రహ్మేంద్ర సహా అనేక మంది వాగ్గేయకారుల కృతులను కూడా ఆలపించేవారు. అలాగే శ్రీశ్రీ, జాషువా, ఆత్రేయ, ఆరుద్ర, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి మరెందరో ఆధునిక కవుల రచనలను కూడా తన గానం సందర్భంగా ఉటంకించేవారు. తన కళారూపం ద్వారా సామాన్యులలో నైతిక విలువను పాదుకొల్పేందుకు శ్రీ సచ్చిదానంద శాస్త్రి కృషి చేశారు. హరికథా గమనంలో సన్నివేశం, సందర్భాన్ని బట్టి ఆయా పాత్రలను ప్రేక్షకుల కళ్లకు కట్టేలా అభినయించేవారు. శ్రీ శాస్త్రి తన సుదీర్ఘ కళాజీవితంలో 15,000కుపైగా ప్రదర్శనలిచ్చారు. కేవలం కథాగానం చేయడంగాక ఆయా పాత్రల స్వరూప-స్వభావాలపై లోతుగా పరిశోధించి, అధ్యయనం చేసేవారు. తదనుగుణంగా కథ చెప్పే సమయంలో ఆయా పాత్రల స్వభావాలను, భావోద్వేగాలను, సంభాషణలను, ఆలోచనలను, చేతలను తన హావభావాలలో ప్రత్యక్షంగా చూపగలిగేవారు. ఆలిండియా రేడియో ఆయనను ‘ఎ’ గ్రేడ్‌తో అగ్రశ్రేణి కళాకారుడుగా గుర్తించింది.

   అలనాటి ముఖ్యమంత్రులు శ్రీ ఎన్.టి.రామారావు, శ్రీ ఎన్‌.జనార్దన రెడ్డి, శ్రీ నారా చంద్ర బాబు నాయుడు చేతులమీదుగా శ్రీ శాస్త్రి సత్కారం పొందారు. అలాగే డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు (పద్మ విభూషణ్‌ గ్రహీత), శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు (పద్మశ్రీ విజేత), శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ (పద్మశ్రీ గ్రహీత), శ్రీ సి.నారాయణరెడ్డి, డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీ తుర్లపాటి కుటుంబరావు తదితర ప్రముఖుల నుంచి కూడా ఆయన సత్కారాలు పొందారు. అలాగే “కథాగాన కళా కోవిద”, “విశ్వకళా ప్రపూర్ణ”, “హరికథా చక్రవర్తి” వంటి బిరుదులతో సత్కరించబడ్డారు. అంతేకాకుండా 2018 సంవత్సరానికిగాను సంగీత-నాటక అకాడమీ అవార్డు కూడా పొందారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఆయనకు “హంస పురస్కారం” ప్రదానం చేసింది.

*****

  1. విద్య-సాహిత్య రంగంలో ప్రొఫెసర్‌ ప్రకాష్‌ చంద్ర సూద్‌కు పద్మశ్రీ పురస్కారం

   ప్రొఫెసర్ ప్రకాష్ చంద్ర సూద్ ప్రముఖ అణు శాస్త్రవేత్త, పరిశోధకుడు. ఆయన కార్యకలాపాలకు ఇక్కడితో పరిమితం కాలేదు... విద్యాపరంగానే కాకుండా జాతీయ ప్రగతి సంబంధిత విస్తృత సంస్థాగత నిర్మాణం వైపు కూడ ఆయన కృషి విస్తరించింది.

   ప్రొఫెసర్‌ సూద్‌ 1928 అక్టోబరు 1న జన్మించారు. ఆయన జలంధర్‌ (పంజాబ్‌)లోని ‘డిఎవి’ విద్యా సంస్థల్లో తొలిదశ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత 1952లో పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్‌సి (ఆనర్స్‌) పట్టా పుచ్చుకున్నారు. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో మూడేళ్లపాటు అధ్యాపక బాధ్యతలు నిర్వర్తించాక అమెరికా వెళ్లి, 1958లో జనవరిలో... రెండేళ్ల మూడు నెలల రికార్డు సమయంలో ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌.డి., పూర్తిచేశారు. అక్కడినుంచి స్వదేశం వచ్చి ‘బార్క్‌’ (బిఎఆర్‌సి)లో్ కొంతకాలం (1968-69) పనిచేశారు. ఆ తర్వాత బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో్ 29 సంవత్సరాల సుదీర్ఘ కాలం విశిష్ట అధ్యాపకుడుగా, విద్యా నిర్వాహకుడు, కొత్త సౌకర్యాల రూపకర్తగా సేవలందించి, పదవీ విరమణ అనంతరం ఇప్పుడు పుట్టపర్తిలోని ‘ఎస్‌ఎస్‌ఎస్‌ఐహెచ్‌ఎల్‌’లో గౌరవ ఆచార్యుడుగా పనిచేస్తున్నారు.

   అణు పరిశోధకుడిగా ప్రొఫెసర్ సూద్‌ ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, వేదికలపై 320 ప్రచురణలు, పత్రాలద్వారా తన అన్వేషణల ఫలితాలను నివేదించారు. పరిశోధనలకు ప్రచారకర్తగా ఆయన వ్యక్తిగతంగా భారతదేశంలోని 67 విశ్వవిద్యాలయాలు, పరిశోధన ప్రయోగశాలలతోపాటు 12 దేశాల్లోని 62 సంస్థలతో అనుసంధానితమయ్యారు.

   సంస్థల రూపకర్తగా ప్రొఫెసర్‌ సూద్‌ దేశంలోని జాతీయ ప్రాధాన్యంగల రెండు సంస్థలు.. కోల్‌కతాలోని ‘డిఎఇ సైక్లోట్రాన్‌ సెంటర్‌ (విఇసిసి), న్యూఢిల్లీలోని యూజీసీ ప్రాయోజిత తొట్టతొలి అంతర-విశ్వవిద్యాలయ అణువిజ్ఞాన కేంద్రం (ఎన్‌ఎస్‌సి.. తర్వాత ‘ఐయుఎసి'గా మార్చబడింది)తో సన్నిహితంగా ముడిపడి ఉన్నారు. ఈ మేరకు సదరు సంస్థలకు ప్రణాళిక స్థాయి నుంచి ప్రారంభోత్సవ స్థాయిదాకా ఆయన కీలకపాత్ర పోషించారు. అటుపైన 70వ దశకం తొలినాళ్లలో తొట్టతొలి ‘వాన్‌ డి గ్రాఫ్‌ యాక్సిలరేటర్‌ ఆధారిత అణు పరిశోధన ప్రయోగశాలను ‘బిహెచ్‌యు’లో ఏర్పాటు చేశారు. అలాగే 70వ దశకం మధ్యకాలంలో అక్కడే పలు సవాళ్లను ఎదుర్కొని మొట్టమొదటి కంప్యూటర్‌ కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పో్షించడమేగాక కొంతకాలం పాటు (1978-83) దానికి వ్యవస్థాపక డైరెక్టరుగానూ  పనిచేశారు. అలాగే శాస్త్రవిజ్ఞాన విభాగాల డీన్‌గా, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా 1985-87 మధ్య పనిచేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌ను శాశ్వత పాఠ్యాంశంగా పరిచయం చేశారు. ఉపన్యాస పర్యటనల కోసం రాయల్ సొసైటీ, యుకె, జపాన్ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్ (జెఎస్పిఎస్) తదితర సంస్థలు ఆయనను ఆహ్వానిస్తుంటాయి. మరోవైపు అమెరికా, కెనడా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, నేపాల్‌ సహా పలు దేశాల్లో వివిధ విద్యా కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానాలు అందుతుంటాయి.

   ప్రొఫెసర్ సూద్ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆయన 1978 నుంచి  నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎఫ్‌ఎన్‌ఎఎస్‌సి)లో సభ్యత్వం కలిగి ఉన్నారు. అలాగే యూజీసీ జాతీయ సభ్యుడు (1983-85), సందర్శక సభ్యుడు (1989-1992), వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ ఫిజికల్ సొసైటీ (1985-87), ఇండియన్‌ ఫిజికల్‌ సొసైటీ ఉపాధ్యక్షుడుగా (1985-87), ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ (1979-81) ఉపాధ్యక్షుడుగా కొనసాగారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో ‘యునెస్కో-ఐఎఇఎ’ ప్రాయోజిత ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియాట్రికల్‌ ఫిజిక్స్ (ఐసిటిపి) ఆయనను 6 ఏళ్ల కాలానికిగాను సీనియర్ అసోసియేట్‌గా ఎంపిక చేసింది. అలాగే (1975-84 మధ్య) సంయుక్త పరిశోధనలకుగాను అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌-యుఎస్‌ఎ), పురస్కారం, ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డులను కూడా ఆయన అందుకున్నారు.

*****



(Release ID: 1910988) Visitor Counter : 97


Read this release in: English