|
హోం మంత్రిత్వ శాఖ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌర సత్కారం కింద వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన శ్రీ కమలేష్ డి.పటేల్ (ఆధ్యాత్మిక రంగం)కు పద్మభూషణ్ పురస్కారం అందజేశారు.
అదేవిధంగా డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్-ఇంజనీరింగ్), డాక్టర్ హనుమంతరావు పసుపులేటి (వైద్య రంగం), డాక్టర్ బండి రామకృష్ణా రెడ్డి (విద్య-సాహిత్యం)లకు పద్మశీ అవార్డు ప్రదానం చేశారు.
प्रविष्टि तिथि:
22 MAR 2023 8:28PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ ఇక్కడ నిర్వహించిన పౌర సత్కార కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన అవార్డు విజేతలకు పురస్కార ప్రదానం చేశారు. ఈ మేరకు తెలంగాణకు చెందిన శ్రీ కమలేష్ డి.పటేల్ (ఆధ్యాత్మిక రంగం)కు పద్మభూషణ్ పురస్కారం అందజేశారు. అలాగే డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్-ఇంజనీరింగ్), డాక్టర్ హనుమంతరావు పసుపులేటి (వైద్య రంగం), డాక్టర్ బండి రామకృష్ణా రెడ్డి (విద్య-సాహిత్యం)లకు పద్మశీ పురస్కారం ప్రదానం చేశారు.
పురస్కార గ్రహీతల జీవిత విశేషాలు.. ఆయా రంగాల్లో వారి కృషిపై సంగ్రహావలోకనం:
- శ్రీ కమలేష్ డి.పటేల్‌కు ఆధ్యాత్మిక రంగంలో సేవలకుగాను పద్మభూషణ్‌పురస్కార ప్రదానం.
శ్రీ కమలేష్ డి.పటేల్
- శ్రీ కమలేష్ డి.పటేల్ ‘దాజీ’గా సుప్రసిద్ధులు... ‘హార్ట్’ఫుల్’నెస్’ ఉద్యమ వ్యవస్థాపకులైన ఆయన, శ్రీ రామచంద్ర మిషన్ 3వ అధ్యక్షుడుగానూ, సహజమార్గ ధ్యానం విధానం గురు పరంపరలో 4వ గురువుగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవారికి ఈ విధానం కింద ‘ప్రాణాహుతి’ పేరిట ప్రత్యేక పద్ధతిలో శిక్షణ ఇస్తారు. ఈ విధానాన్ని నేడు ప్రపంచంలోని 160కిపైగా దేశాల్లో కోట్లాదిమంది అనుసరిస్తున్నారు.
- గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతంలో 1956 సెప్టెంబరు 28న శ్రీ పటేల్ జన్మించారు. చిరు ప్రాయంలోనే ఆయన శాస్త్ర విజ్ఞానంతోపాటు ఆధ్యాత్మికతపైనా ఆసక్తి ప్రదర్శించారు. ఆయన బి.ఫామ్‌తోపాటు 1980లో ఎం.ఫామ్ (ఆనర్స్) కూడా పూర్తిచేశారు. కళాశాల విద్యాభ్యాసం చేస్తుండగానే 1976 సెప్టెంబరులో సహజమార్గ ధ్యానం విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం 1977లో ఆధ్యాత్మిక మార్గదర్శి బాబూజీ మహారాజ్‌ను కలుసుకున్నారు. కళాశాల చదువు పూర్తయ్యాక ఆయన అమెరికాలోని న్యూయార్క్ నగరం చేరుకున్నారు. తన విద్యార్హతకు న్యాయం చేస్తూ అక్కడ విజయవంతమైన ఫార్మసీ శృంఖలాన్ని ఆయన నిర్మించారు. మరో్వైపు ధ్యానంపై తన ఆసక్తిని కొనసాగిస్తూ ‘హార్ట్’ఫుల్’నెస్’ ఉద్యమంలో మరింత చురుకైన పాత్ర పోషించారు.
- ఆ క్రమంలోనే 2014 డిసెంబరు 20న శ్రీ పటేల్ ‘హార్ట్’ఫుల్’నెస్’ ఉద్యమ ఆధ్యాత్మిక అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. సైన్స్-ఆధ్యాత్మిక విద్యార్థిగా ఈ రెండింటినీ వీలైనంత ఎక్కువ మందికి చేరువు చేసేలా నిరంతర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిణామం ఆన్‌లైన్ ధ్యానం తరగతులు నిర్వహించే స్థాయికి.. అంటే- ‘హార్ట్’ఫుల్’నెస్’ అనువర్తనం (యాప్) రూపకల్పనకు దారితీసింది. ఇది అన్వేషకులను ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోగల శిక్షకుడితోనైనా అనుసంధానించగలదు. ఈ క్రమంలో భారత్‌సహా వివిధ దేశాల్లోని అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ధ్యాన ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. అలాగే ధ్యాన కేంద్రాలు-ఆశ్రమాలు, పాఠశాలలు-కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు-ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులు, సాయుధ దళాలు తదితర అన్ని స్థాయులలోనూ సాధారణ ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. అంతేకాకుండా ఆయన ‘కన్హా శాంతి వనం’ ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం మాత్రమేగాక ‘హార్ట్’ఫుల్’నెస్’ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయ నిలయంగా మారింది. ఆయన ఇప్పుడు ‘హార్ట్’ఫుల్’నెస్’ యోగా అకాడమీ, ‘హార్ట్’ఫుల్’నెస్’ వృక్ష పరిరక్షణ కేంద్రం, ‘హార్ట్’ఫుల్’నెస్’ శ్రేయో కేంద్రం తదితరాలను కూడా ప్రారంభించారు. కేంద్ర/రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, రైతులు-భాగస్వాముల సహకారంతో ప్రపంచవ్యాప్త హరిత విస్తరణ విప్లవానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయన రచించిన మూడు పుస్తకాలు- “ది ‘హార్ట్’ఫుల్’నెస్’ వే; డిజైనింగ్ డెస్టినీ, ది విస్డమ్ బ్రిడ్జ్” ప్రపంచవ్యాప్తంగా విశేష పాఠకాదరణ పొందాయి.
- శ్రీ పటేల్‌కు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2018లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అలాగే 2020లో ప్రియదర్శిని అకాడమీ ‘రామకృష్ణ బజాజ్ మెమోరియల్ గ్లోబల్ అవార్డు’తో ఆయనను సత్కరించింది. మరోవైపు వివిధ వాణిజ్య ప్రచురణకర్తలు, సంస్థలు “భారతదేశపు అత్యంత ప్రశంసాపాత్రుడైన నాయకుడు, నిశ్శబ్ద విప్లవ మార్గదర్శి” వంటి సత్కారాలను అందుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో నడిచే కన్హా శాంతివనం మూడేళ్ల నుంచీ “ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, హరిత హారం పురస్కారాలతోపాటు ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్లాటినం అవార్డులు అందుకుంది.
*****
- డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తాకు శాస్త్రవిజ్ఞాన-ఇంజనీరింగ్ రంగంలో సేవలకుగాను పద్మశ్రీ పురస్కార ప్రదానం.
డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా
- డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా వనరుల కొరతతో అల్లాడే ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా దేశాల్లో జలసాగు (ఆక్వాకల్చర్) ద్వారా ఆహార-పౌష్టిక భద్రతను మెరుగుపరచడంలో 60 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు నీలి విప్లవ రూపశిల్పిగా ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసిద్ధుడయ్యారు. తక్కువ వ్యయంతో సరళరీతిలో చేపల పెంపకం సాంకేతికతను గుప్తా రూపొందించారు. దీనిద్వారా వర్ధమాన దేశాల్లో గ్రామీణ మహిళలు, భూమిలేని పేదల ఆర్థిక ప్రగతిపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.
- డాక్టర్ గుప్తా 1939 ఆగస్టు 17న జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎస్సీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. అటుపై కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ (పిహెచ్.డి.) సాధించారు. అనంతరం 1970లో ఆయన వినూత్న పరిశోధన సత్ఫలితాలివ్వడంతో జలసాగులో రెట్టింపు దిగుబడి రాగా, ‘నీలి విప్లవం’ ఆవిష్కారానికి పునాది పడింది.
- డాక్టర్ గుప్తా 30 ఏళ్లకుపైగా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా-పసిఫిక్ (యుఎన్—స్కాప్), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ (ఎఫ్‌ఏఒ-యుఎన్), వరల్డ్ ఫిష్ సెంటర్ (సిజిఐఎఆర్) వంటి సంస్థలుసహా ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా దేశాల్లోని వివిధ సంస్థలతో సంయుక్తంగా మత్స్య నిపుణుడు/సలహాదారుగా పనిచేశారు. తద్వారా దాదాపు 20 దేశాలలో కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణలో పాలుపంచుకున్నారు. ఈ దేశాలన్నింటిలోనూ ఆయన కృషి ఫలితంగా లక్షలాది గ్రామీణ పేదల ఆదాయం, ఆహార భద్రత పెరగడమే కాకుండా గ్రామీణ మహిళల సాధికారత సాకారమైంది.
- డాక్టర్ గుప్తా ఎఫ్‌ఏఒ-యుఎన్; డిఎఎన్‌ఐడిఎ; ఎయుఎస్‌ఎఐడి; యుఎస్‌ఎఐడి; ప్రపంచబ్యాంకు; ఆసియా అభివృద్ధి బ్యాంకు; కామన్వెల్త్ సెక్రటేరియట్, లండన్; నెదర్లాండ్స్ వ్యవసాయ పరిశోధన కేంద్రం; మెకాంగ్ రివర్ కమిషన్; వరల్డ్ ఫిష్ సెంటర్ (సిజిఐఎఆర్), మలేషియా తదితర అనేక అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. ప్రపంచ ఆహార భద్రతపై ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీలో సభ్యుడుగా పనిచేశారు. అలాగే లోగడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సాంకేతిక సలహాదారుగా వ్యవహరించారు.
- నిరుపేద కుటుంబాల ఆహార అవసరాలు తీర్చడంతోపాటు వారి సముద్ధరణకు, ఆహార-పౌష్టిక భద్రతకు తోడ్పడటంలో ఆయన అసాధారణ విజయాలు సాధించారు. వీటికి గుర్తింపుగా డాక్టర్ గుప్తా అనేక పురస్కరాలు, సత్కారాలు అందుకున్నారు. వీటిలో ఆహార-వ్యవసాయ రంగాల్లో నోబెల్‌గా పరిగణించే “వరల్డ్ ఫుడ్ ప్రైజ్” (2005) అత్యంత ప్రముఖమైనది. అలాగే 2015లో దక్షిణకొరియాలో్ని ‘సన్‌హక్ పీస్ ప్రైజ్ ఫౌండేషన్’ ప్రవేశపెట్టిన ‘సన్‌హక్ శాంతి బహుమతి’ తొట్టతొలుత ఆయనకే దక్కింది. మానవ జాతి ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభాన్ని పరిష్కరించి పేదలలో ఆశాభావం నింపినందుకు గుర్తింపుగా అందించే ఈ బహుమతిని ‘నోబెల్ శాంతి బహుమతి’కి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. వీటితోపాటు ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ‘ట్రిలియన్ మిలియన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును డాక్టర్ గుప్తా అందుకున్నారు. అలాగే ‘న్యూట్రాస్యూటికల్, హెల్త్ ఫుడ్ ఇండస్ట్రీస్ నుంచి ‘న్యూట్రా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’; మలేషియాలోని ఆసియన్ ఫిషరీస్ సొసైటీ నుంచి స్వర్ణ పతకం; అమెరికాలోని వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ నుంచి గౌరవ జీవిత సభ్యత్వ పురస్కారం; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అవార్డు; భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నుంచి అవుట్‌స్టాండిగ్ టీమ్ రీసెర్చ్ అవార్డు వంటివి ఆయనను వరించాయి. ఇక జి.బి.పంత్ వ్యవసాయ-సాంకేతిక విశ్వవిద్యాలయం, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ నుంచి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (డి.ఎస్‌సి) పట్టాలను అందుకున్నారు.
*****
- డాక్టర్ హనుమంతరావు పసుపులేటికి వైద్య రంగంలో పద్మశ్రీ పురస్కార ప్రదానం.
డాక్టర్ హనుమంతరావు పసుపులేటి
- డాక్టర్ హనుమంతరావు పసుపులేటి పిల్లల వైద్య నిపుణులు. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ‘స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్’ వ్యవస్థాపక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
- డాక్టర్ పసుపులేటి 1945 సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని వైద్యుల కుటుంబంలో జన్మించారు. ఆయన 1975లో పీడియాట్రిక్స్ (పిల్లల వైద్యం)లో్ ఎం.డి. కోర్సు పూర్తిచేసి, ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే, ఈ రోజువారీ వృత్తిపరమైన బాధ్యతల్లో సంతృప్తి కనిపించకపోవడంతో దివ్యాంగులకు సేవకు అంకితం కావాలనే సంకల్పాన్ని సాకారం చేయదలిచారు. ఆ మేరకు లాభదాయక వృత్తిని వదిలి, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా తిరస్కరించారు. ఆ తర్వాత బొంబాయికి వెళ్లి ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్’లో పునరావాస వైద్యంలో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతేకాకుండా పునరావాస మనస్తత్వశాస్త్రంలో పిహెచ్.డి. కూడా పూర్తిచేశారు.
- అనంతరం డాక్టర్ పసుపులేటి తన గ్యారేజీలో 1977లో బుద్ధిమాంద్యంగల చిన్నారుల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. అలాగే తన క్లినిక్‌లో కొంత భాగాన్ని కేటాయించి ఐదుగురు పిల్లలు, ఇద్దరు ప్రత్యేక ఉపాధ్యాయులతో “ప్రత్యేక సంరక్షణ అవసరమైన బాలల కోసం హైదరాబాద్ ప్రత్యేక పాఠశాల”ను ప్రారంభించారు. ఈ పాఠశాల సేవలు విస్తరించడంతో దీని పేరును “స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్”గా మార్చారు. ఆ తర్వాత 1986లో బధిరుల కోసం పాఠశాలతోపాటు ప్రత్యేక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకున్న బధిరులలో 745 మంది ప్రభుత్వ రంగంలో, 672 మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తుండటం విశేషం.
- పునరావాస సేవలను అందించడంలో సుశిక్షిత మానవ వనరుల కొరతను గుర్తించిన డాక్టర్ పసుపులేటి 1986లో ప్రత్యేక విద్యలో రెండు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టగా ఇది 30 శిక్షణ కార్యక్రమాలకు విస్తరించింది. తదనుగుణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్‌సిఐ, కేంద్ర ప్రభుత్వాల అనుబంధంతో ప్రత్యేక విద్యలో ‘డిప్లొమా, యుజి, పిజి, పోస్ట్ పిజి’ కోర్సులతోపాటు ఆడియాలజీ, క్లినికల్ సైకాలజీలో డాక్టరేట్‌సహా మొత్తం 8071 మంది నిపుణులను ఈ సంస్థ తయారు చేసింది.
- దూరదృష్టిగల డాక్టర్ పసుపులేటి ఒక ఉద్యమం తరహాలో అన్నిరకాల వికలాంగులకు, అన్ని వయసులవారికి ఒకే కప్పుకింద అన్నిరకాల నిపుణులతో ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు 46 ఏళ్ల వ్యవధిలో 85.75 లక్షల మంది వికలాంగుల జీవితాల్లో ఆయన వెలుగు నింపారు. పాఠశాలలు, మురికివాడలు, గ్రామీణ-పట్టణ ప్రాంతాలు, కళాశాలలు, ప్రైవేట్-ప్రభుత్వ కార్యాలయాలలో స్క్రీనింగ్ కార్యక్రమాల నిర్వహణ ద్వారా సమాజంలోని నిరాదరణకు గురైన వర్గాలను చేరదీయడంలో ఆయన అవిరళ కృషి చేశారు. ఈ క్రమంలో ‘స్వీకార్’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సంచార వైద్యకేంద్రాలు, స్వచ్ఛంద క్లినిక్‌లను ప్రారంభించారు. మరోవైపు కడప, గుంటూరు, తాండూరులలో మూడు ప్రాంగణాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు.
- డాక్టర్ పసుపులేటి తాను నిర్వహించే స్వీకార్ సంస్థలో 105 మంది దివ్యాంగులకు, సామాజిక కేంద్రాల్లో 640 మంది దివ్యాంగులను నియమించారు. ఈ కృషికి గుర్తింపుగా 1994లో భారత రాష్ట్రపతి ద్వారా ఆయన పురస్కారం పొందారు. “ఆక్సిజన్ బ్యాంక్, సీనియర్ సిటిజన్ల శరణాలయం, మత్తు విముక్తి కేంద్రం, కృత్రిమ అవయవ కేంద్రం, ద్వారా పేదలకు సేవలందించారు. వయోజన మానసిక వికలాంగుల సమగ్ర గ్రామీణ పునరావాస కేంద్రం, వికలాంగుల కోసం రాష్ట్ర సమాచార కేంద్రం, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ డెవలప్‌మెంటల్ డిలేస్, ఆటిజం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్, లెర్నింగ్ డిసేబిలిటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ ఇల్” సహా ప్రత్యేక విద్య, సంభాషణ చికిత్స, ఆడియాలజీ, క్లినికల్ సైకాలజీ కోర్సులలో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి శిక్షణ ఇస్తున్నారు.
- డాక్టర్ పసుపులేటి 1995లో డాక్టర్ బి.సి.రాయ్ అవార్డు అందుకున్నారు. అలాగే భారత రాష్ట్రపతి నుంచి 5 సార్లు జాతీయ అవార్డులు కూడా స్వీకరించారు. ఇక ప్రైవేట్ సంస్థలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మొత్తం 56 పురస్కారాలతోపాటు 9 అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.
*****
- డాక్టర్ బండి రామకృష్ణా రెడ్డికి విద్య-సాహిత్య రంగంలో పద్మశ్రీ పురస్కార ప్రదానం.
డాక్టర్ బండి రామకృష్ణా రెడ్డి
- డాక్టర్ బండి రామకృష్ణా రెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా, పి.ఎస్.విశ్వవిద్యాలయాల్లో భాషాశాస్త్ర మాజీ ప్రొఫెసర్; అలాగే కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక రిజిస్ట్రారుగా, ద్రవిడ భాషాశాస్త్ర సంఘంతో సన్నిహిత సంబంధాలతోపాటు 37వ అధ్యక్షుడుగా పనిచేసిన ప్రముఖ భాషావేత్త.
- డాక్టర్ రెడ్డి 1942 ఆగస్టు 12న జన్మించారు. పాఠశాల విద్య నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ దాకా తిరుపతిలోనే విద్యాభ్యాసం చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి 1972లో హిందీ భాష-సాహిత్యంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేశారు. అనంతరం భాషా శాస్త్రంలో డాక్టరేట్ కోసం కామన్వెల్త్ విశ్వవిద్యాలయాల సంఘం నుంచి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ స్కాలర్‌షిప్ పొందారు. పుణెలోని దక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆయనకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ పట్టా ప్రదానం చేసింది.
- డాక్టర్ రెడ్డి మాతృభాష తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడసహా అనేక ఇతర ద్రావిడ, గిరిజన భాషలు మాట్లాడగలరు. ఆయన 1970-72లో మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సిఐఎల్)లో పనిచేశారు. ఆ సమయంలో యునెస్కో ప్రకటించిన కచ్చితంగా అంతరించేపోయే భాషల జాబితాలో ఒకటైన ‘కువి’ భాష పునరుద్ధరణ దిశగా అనేక క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించారు.
- ఆ కృషిలో భాగంగా జాతీయ, ప్రాంతీయ సదస్సులు, సమావేశాలను డాక్టర్ రెడ్డి నిర్వహించారు. తద్వారా చాలామంది పండితులు ఇందులో పాల్గొని తమ ఆలోచనలను వ్యక్తీకరించే వీలు కలిగింది. గిరిజన భాషల నుంచి సేకరించిన సమాచార సేకరణపై, దాన్ని విశ్లేషించే మార్గాలపై ఆయన ఆసక్తి కనబరిచారు. తద్వారా దాన్ని క్రమబద్ధీకరించి కొత్త దృక్పథాలు/ఆలోచనా విధానాల అమలుకు కృషి చేశారు. ఆ మేరకు గిరిజన భాషల సమాచారంపై ఆయన వివరణ-విశ్లేషణ-వ్యాఖ్యానం అనేకమంది పండితులు ఆ భాషలపై పనిచేయడానికి స్ఫూర్తినిచ్చాయి.
- కువి భాష మాట్లాడేవారితో డాక్టర్ రెడ్డి నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి కార్యక్రమ సమాచారం 1974లో ‘కువి’ ఉచ్చారణ రీడర్‌గా వెలువడింది. అలాగే ఒడియా-ఆంగ్లం సమన్వయంతో కువి జానపద సాహిత్యం వచ్చింది. ఇదే కాకుండా అంతరించే స్థితిలోగలది యునెస్కో ప్రకటించిన మరో భాష ‘మందా’పైనా డాక్టర్ రెడ్డి ఆసక్తి చూపారు. అటుపైన 2009లో మందా-ఆంగ్ల నిఘంటువు, మందా-మౌఖిక సాహిత్యాన్ని ప్రచురించారు. ఒడిషాలోని రాయగడ జిల్లాలో మాట్లాడే ‘ఇండి/ఆ స్పోకెన్’ అనే మరో స్వతంత్ర ద్రావిడ భాషను గుర్తించారు. చెన్నైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తమిళ్ స్టడీస్ ప్రచురించిన ద్రావిడ భాషలలో (2003) సంపాదకీయ అటెంప్ట్ అగ్రిమెంట్‌కు ఆయన మార్గదర్శకత్వం వహించారు.
- డాక్టర్ రెడ్డి 1978-81 మధ్య ‘భాషాశాస్త్రంపై ఉస్మానియా పేపర్’ 4 నుంచి 7 వరకు నాలుగు సంపుటాలకు సంపాదకత్వం వహించారు. కువి-మూల-ఆంగ్ల (త్రిభాషా) నిఘంటువును 1995లో వెలువరించారు. అలాగే 2001లో ద్రావిడ జానపద, గిరిజన జానపద గాథలకూ ఆయన సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
****
(रिलीज़ आईडी: 1910986)
|