సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఓటర్లలో అవగాహన కోసం కళాశాల విద్యార్థుల వీధినాటక ప్రదర్శన


సహకారం అందించిన కేంద్రీయ కమ్యూనికేషన్ల బ్యూరో..
కళాశాలలకు తెలంగాణ సీఈవో కార్యాలయం సత్కారం

Posted On: 17 MAR 2023 6:42PM by PIB Hyderabad

   ‘క్రమానుగత ఓటరు అవగాహన-ఎన్నికల భాగస్వామ్యం’ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్-స్వీప్‌) కింద ఎన్నికల సంఘం చేపట్టిన కార్యకలాపాల్లో భాగంగా వీధి నాటకాలు ప్రదర్శించిన అధికారులు-కళాశాలల విద్యార్థులను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధానాధికారి (సీఈవో) సత్కరించారు. దేశవ్యాప్తంగా ఓటర్లకు అవగాహన కల్పనతోపాటు వారు క్రమం తప్పకుండా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమిది.

   ఈ సందర్భంగా సీఈవో శ్రీ వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ- ప్రత్యేక సంక్షిప్త సమీక్ష (ఎస్‌ఎస్‌ఆర్‌) సందర్భంగా వివిధ కార్యాలయాల సహకారంతో ‘స్వీప్‌’ కింద చేపట్టిన సమాచార ప్రదాన కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు. దీంతో తాజా ఓటరు నమోదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయని ఆయన వెల్లడించారు. ఈ దిశగా వినూత్న మార్గాల్లో పట్టణ ఓటర్లకు చేరువయ్యేందుకు సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్రీయ కమ్యూనికేషన్ల బ్యూరో (సిబిసి) ఎంతగానో కృషి చేసిందన్నారు. ఇందులో భాగంగా ‘సిబిసి’ చేపట్టిన ప్రయోగాత్మక వీధినాటక ప్రక్రియ విజయవంతమైందని, ఇకపై పట్టణ కేంద్రాల్లో ఈ నమూనాను విస్తృతంగా చేపడతామని ఆయన తెలిపారు.

   కేంద్రీయ కమ్యూనికేషన్ల బ్యూరో అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీమతి శ్రుతి పాటిల్‌ మాట్లాడుతూ- వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన దిశగా ‘సిబిసి’ ఇప్పటికే అనేక సంప్రదాయ కళారూపాలను సమర్థంగా వినియోగిస్తున్నదని పేర్కొన్నారు. ఇదే తరహా సంయుక్త కృషిని రాష్ట్రంలోనూ అమలు చేయగల ఒక ఉత్తమ కార్యాచరణగా రూపొందించవచ్చునని ఆమె సూచించారు. ‘సిబిసి’ పరిధిలోగల సంగీత-నాటక విభాగంలోని కళాకారులు ఈ వీధి నాటకాన్ని రచించారని, నగరంలోని వివిధ కళాశాలలకు వెళ్లి 10 మంది విద్యార్థుల వంతున ఐదు బృందాలను ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చారని వివరించారు. అనంతరం ఈ విద్యార్థి బృందాలు హైదరాబాద్‌ నగరంలోని గోల్కొండ కోట, ట్యాంక్‌ బండ్‌, ఇందిరాపార్క్‌, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో ఈ వీధి నాటకాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ నాటక ప్రదర్శనకు విశేష ప్రజాదరణ లభించిందని తెలిపారు.

   ఈ సత్కార కార్యక్రమంలో సంయుక్త సీఈవో ఎస్.రవికిరణ్, ఆల్‌ ఇండియా రేడియో న్యూస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రాహుల్ గౌలికర్ సహా కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

*****




(Release ID: 1908283) Visitor Counter : 104


Read this release in: English