సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ‘వార్తాలాప్’ పేరిట ఒకరోజు మీడియా వర్క్‌షాప్ నిర్వహించిన పీఐబీ
“ఆన్‌లైన్ భద్రత కోసం మనం సైబర్ శుభ్రత పాటించాలి: జగదీష్ బాబు”;
“మీడియా ద్వారా ప్రజలకు సమాచారమిచ్చే మార్గాన్వేషణకే ‘వార్తాలాప్’: శ్రుతి పాటిల్”
Posted On:
17 MAR 2023 6:13PM by PIB Hyderabad
సమాచార ప్రదానం కోసం ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల సురక్షిత వినియోగంపై పాత్రికేయులకు మెలకువలతోపాటు అవగాహన కల్పన లక్ష్యంగా పత్రికా సమాచార సంస్థ (పిఐబి) హైదరాబాద్‌లో ‘వార్తాలాప్’ పేరిట ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కార్యాచరణ బృంద ఇతివృత్తం ‘స్టే సేఫ్ ఆన్‌లైన్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వర్క్’షాప్ నిర్వహణకు ‘సి-డాక్’ సహకారం అందించింది. ఈ సందర్భంగా అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ కీలకోపన్యాసమిస్తూ- “మీడియా-ప్రభుత్వం మధ్య సంబంధాల బలోపేతం” ఈ ‘వార్తాలాప్’ ప్రధాన ధ్యేయమని వివరించారు. మీడియా ద్వారా ప్రజలకు సమాచారం చేరవేసే మార్గాన్వేషణ కోసమే ఈ వర్క్‌షాప్ నిర్వహణ ఉద్దేశమని ఆమె తెలిపారు. సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలకు చేరాలంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాకు ముందుగా వాటిగురించి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (ఐఎస్‌ఇఎ) ప్రాజెక్ట్ మేనేజర్లు శ్రీ ఎం.జగదీష్ బాబు, శ్రీ తయ్యబ్ నౌషాద్ ప్రధానాంశంపై వక్తలుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీష్ బాబు మాట్లాడుతూ- సైబర్ ప్రపంచ వ్యవహారాల్లో అనూహ్య, అదృశ్య ముప్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌లో తాము సురక్షితమని ఏ ఒక్కరూ భావించే వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. మన కార్యకలాపాలపై డేగకళ్లతో పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి, సైబర్ పరిశుభ్రత పాటించడం అవశ్యమన్నారు. ‘సమాచార చౌర్యానికి సంబంధించిన ప్రతి 100 ఉదంతాల్లో 95 మానవ తప్పిదాల వల్లనే సంభవిస్తాయి’ అని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ, మొబైల్ వాడకందారులలో కేవలం 49 శాతం మాత్రమే ‘యాంటీ వైరస్’ యాప్ వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
12RF.jpeg)
సైబర్ ముప్పు పొంచి ఉన్నందున వ్యక్తిగత సమాచార భద్రత, చౌర్యం నివారణ కోసం మొబైల్ వాడకందారులు ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫొన్లలో ‘యాంటీవైరస్’ ఉపయోగించాలని శ్రీ తయ్యబ్ నౌషాద్ తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సైబర్ భద్రత అంశాలతోపాటు వ్యక్తిగత సమాచార భద్రతపై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించాల్సిందిగా పాత్రికేయులకు ఆయన సూచించారు.

‘వార్తాలాప్’లో సాంకేతిక అంశాలపై గోష్ఠుల తర్వాత ముఖాముఖి ప్రశ్న-జవాబుల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సైబర్ భద్రతపై పాత్రికేయుల సందేహాలకు నిపుణులు సమాధానాలిచ్చారు. ఈ వర్క్’షాప్ నిర్వహణపై పాత్రికేయులు ‘పిఐబి’కి కృతజ్ఞతలు తెలపడంతోపాటు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు కాగలవని ఆశాభావం వెలిబుచ్చారు.

ఈ కార్యక్రమంలో ‘పిఐబి’, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ శ్రీ వి.బాలకృష్ణ స్వాగతోపన్యాసం చేశారు. వివిధ మీడియా సంస్థల నుంచి 60 మందికిపైగా పాత్రికేయులు ఈ వర్క్’షాప్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రామాణిక సమాచారంతో పాత్రికేయులకు సాధికారత కల్పించి, వారు ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించేలా చూడటం లక్ష్యంగా సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యూహం మేరకు ఈ వర్క్’షాప్ నిర్వహించబడింది.
*****
(Release ID: 1908098)
Visitor Counter : 149