శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గర్భిణులలో మధుమేహ నివారణ భారతదేశ భవిష్యత్తరానికి ఎంతో కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
10 MAR 2023 2:09PM by PIB Hyderabad
గర్భిణులలో మధుమేహ నివారణ దేశ భవిష్యత్తరానికి ఎంతో కీలకమని కేంద్ర మంత్రి, దేశంలో ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు కూడా అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన ‘డిప్సి’ (భారతదేశంలో గర్భస్థ దశ మధుమేహంపై అధ్యయన బృందం) వార్షిక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశంలో టైప్-2 మధుమేహం ఇప్పటికే సాంక్రమిక వ్యాధి స్థాయికి చేరిందని ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. ప్రపంచ మధుమేహ రాజధానిగా అప్రతిష్టను మూటగట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల నడుమ గర్భిణులకు మధుమేహం రాకుండా సమర్థంగా నిరోధిస్తే తప్ప అనువంశికంగా వ్యాపించి, భవిష్యత్తరాలపై దుష్ప్రభావం చూపే టైప్-2 మధుమేహ శృంఖలాన్ని ఛేదించడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు.
గర్భస్థ దశ మధుమేహం (జిడిఎం) బారినపడే మహిళలు తమ సంతానానికి.. అందునా చిన్న వయసు నుంచే టైప్-2 మధుమేహం సంక్రమింపజేసే ముప్పు అధికంగా ఉంటుందన్న వాస్తవం మనకు తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ జితేంద్ర సింగ్ ‘డిప్సి’ వ్యవస్థాపక సభ్యులు మాత్రమేగాక గర్భస్థ దశలో మధుమేహ చికిత్సపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మార్గదర్శకాలను రూపొందించిన బృందంలోనూ సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గర్భస్థ దశ మధుమేహ నివారణ అంశంపై తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ వి.శేషయ్యను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. గర్భిణులలో ప్రతి ఒక్కరికీ రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకునే ‘స్పాట్ టెస్ట్’ నిర్వహించాలని దాదాపు అర్ధ శతాబ్దం కిందటే డాక్టర్ వి.శేషయ్య ఆయన బృందం సిఫారసు చేసిందని ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. తదనుగుణంగా ఇదే బృందం రూపొందించిన “సింగిల్ ప్రొసీజర్ టెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ” పద్ధతి భవిష్యత్ పరిస్థితుల నిర్వహణకు ఎంతో విశ్వసనీయమైనదిగా నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని తెలిపారు.
గర్భిణులలో మధుమేహాన్ని ఆరంభంలోనే నివారించే అంశంపై డాక్టర్ వి.శేషయ్య ఇప్పుడు నిశితంగా దృష్టి సారించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ కృషి విజయవంతమైతే భారతదేశంలో మధుమేహ మహమ్మారి నియంత్రణ సులభసాధ్యం కావడమేగాక భవిష్యత్తరం ఆరోగ్యం-శ్రేయస్సుకు భరోసా ఇస్తుందని చెప్పారు. భారతదేశం ప్రపంచ వేదికపై అగ్రాసనం అలంకరించాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అమృత కాలం’గా అభివర్ణించిన రాబోయే 25 ఏళ్లలో యువశక్తి, వారి ఉత్పాదకత చాలా కీలకమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆ మేరకు నేటి నవజాత శిశువులే రేపటి యువతరమని, 2047నాటికి ఉజ్వల భారతం నిర్మాణాన్ని నిర్దేశించేది వారేనని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల గర్భస్థ దశ మధుమేహాన్ని ఆదిలోనే నిరోధించే కృషిలో నిమగ్నమైన డాక్టర్ వి.శేషయ్యకు, ఆయనకు మద్దతిస్తున్న వైద్యలోకానికి మొత్తంగా దేశానికే మనం రుణపడి ఉంటామని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా “డిజిటల్ హెల్త్ మిషన్”ను ప్రస్తావించడాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు వ్యాధి నివారక ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో భాగంగా భారతదేశం తొలి ‘డిఎన్‌ఎ’ టీకాను తయారుచేయడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అంతేగాక ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత పర్యవేక్షణ, ప్రోత్సాహంతో ప్రపంచంలోని ఇతర దేశాలకూ భారత్ టీకాలు అందించిందని తెలిపారు. గర్భస్థ దశలో మధుమేహ నివారణకు డాక్టర్ వి.శేషయ్య చేపట్టిన ప్రాజెక్టు ప్రభుత్వ అనుసరిస్తున్న వ్యాధి నివారక ఆరోగ్య సంరక్షణ ప్రాథమ్యానికి అనుగుణంగా ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.
*****
(Release ID: 1905832)
Visitor Counter : 172