ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

న్యూ ఢిల్లీలో 2023 నవంబర్ 3-5 మధ్య వరల్డ్ ఫుడ్ ఇండియా-2023


నేడు ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా -2023 వెబ్ సైట్, ప్రచార సామగ్రి, వీడియో ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు శ్రీ పశుపతి కుమార్ పరాస్, శ్రీ ప్రహ్లాద సింగ్ పటేల్

చిరుధాన్యాలు, నవకల్పన, సుస్థిర హరిత ఆహారం, శ్వేత విప్లవం, ఎగుమతుల కేంద్రంగా భారత్, టెక్నాలజీ, డిజిటైజేషన్ మీద దృష్టి సారింపు ఈ సదస్సు కీలకాంశాలు

Posted On: 10 MAR 2023 6:48PM by PIB Hyderabad

వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 రెండో విడత సదస్సును  2023  నవంబర్ 3-5 మధ్య భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్వహించబోతోంది.  దీని ప్రారంభ కార్యక్రమం ఈ రోజు న్యూఢిల్లీ నేషనల్  మీడియా సెంటర్ లో జరిగింది.  ఈ సందర్భంగా కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ పశుపతి కుమార్ పరాస్, జలాశక్తి శాఖా మంత్రి శ్రీ ప్రహ్లాద సింగ్ పటేల్ వెబ్ సైట్ ను, ప్రచార సామగ్రిని, వీడియోను ఆవిష్కరించారు.

మంత్రి శ్రీ పశుపతి కుమార్ పరాస్ ఈ ఏర్పాట్ల కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుటూ, భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని, అనేక పెట్టుబడి అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అందులోనూ ఆహార శుద్ధి రంగంలో అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు.  ఈ సదస్సుల్లో ఐదు కీలకమైన అంశాలున్నాయని చెబుతూ, చిరుధాన్యాలు, నవకల్పన, సుస్థిర హరిత ఆహారం, శ్వేత విప్లవం, ఎగుమతుల కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దటం, టెక్నాలజీ, డిజిటైజేషన్ మీద దృష్టి సారింపు ను ప్రస్తావించారు.

ఈ మూడు రోజుల సదస్సు సందర్భంగా ప్రపంచం నలుమూలలనుంచీ ఆహార శుద్ధి పరిశ్రమ ప్రముఖులు వచ్చి తమ బలాన్ని అక్కడ ప్రదర్శిస్తారని మంత్రి శ్రీ పరాస్ చెప్పారు. పరిశ్రమ వృత్తినిపుణుల సమావేశాలు, ఎగ్జిబిషన్లు, ప్రత్యేకమైన ఆహార అనుభూతినిచ్చే ఫుడ్ స్ట్రీట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడే అనేక ఒప్పందాలు, కాంట్రాక్టులు కూడా కుదుర్చుకుంటారు. ఈ సదస్సు సందర్భంగా భారత్ లో పెట్టుబడులకు అవకాశాలు, మౌలికసదుపాయాల అందుబాటు,  పెట్టుబడులు పెట్టేవారికి అందే ప్రయోజనాలు తెలియజేబుతారు.

2017 లో జరిగిన వరల్డ్  ఫుడ్ ఇండియా సదస్సు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీన్ని కీలకమైన అంతర్జాతీయ సదస్సుగా చేపట్టటానికి అన్ని  ఏర్పాట్లూ చేస్తోందని శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ చెప్పారు. ప్రపంచ ఆహార అవసరాలను సైతం తీర్చగలుగుతుండటం భారతదేశానికి గర్వకారణమని, దీనివలన  భారత ఆహారశుద్ధి పరిశ్రమ కూడా మరింత ఎదుగుతుందన్నారు. అదే విధంగా ఉత్పాదకతతో అనుసంధానమైన ప్రోత్సాహకాల వంటి ప్రభుత్వ చొరవల వలన ఆహార శుద్ధి పరిశ్రమకు మార్కెటింగ్, బ్రాండింగ్ లాంటివి కూడా మెరుగవుతాయన్నారు. నాణ్యతా కొలమాణాలను ప్రామాణీకరించటం ప్రభుత్వానికి గర్వకారణమని అభివర్ణించారు.

ఆహార శుద్ధి పరిశ్రమలో నవకల్పనలు ప్రపంచంలోప మనల్ని విశిష్ట స్థానంలో ఉంచుతున్నాయని శ్రీ పటేల్ చెప్పారు. దీనివలన భారతదేశం ప్రపంచంలో  అత్యంత  బలమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతుందన్నారు. డిజిటైజేషన్ వలన నాణ్యతా కొలమానాలు స్వయం సహాయక బృందాల స్థాయిలో కూడా అమలు చేయగలుగుతున్నామని, ఆ విధంగా ఈ రంగంలో పోటీ తత్వం పెంచగలుగుతున్నామని చెప్పారు.

ఆహార శుద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి అనితా పర్వీన్ మాట్లాడుతూ, ఈ సదస్సులో సంబంధిత భాగస్వాములందరూ పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ మంత్రిత్వశాఖ చేపడుతున్న అత్యంత కీలకమైన వరల్డ్ ఫుడ్ ఇండియా-2023 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆహార సంస్థలన్నీటికీ ఒక విశిష్ఠ వేదిక అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.  భారతదేశాన్ని ఒక ఎగుమతి కేంద్రంగా మార్చే క్రమంలో ఆహారశుద్ధి, అనుబంధ రంగాలు  చాలా ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయన్నారు. విలువ జోడింపు, ప్రాసెసింగ్ యంత్ర సామగ్రి, పాకేజింగ్ టెక్నాలజీ  తదితర అంశాల మీద ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. చిరు ధాన్యాలు-శ్రీ అన్న – భారతదేశపు అద్భుత ఆహారం ఈ సదస్సుకు మూలస్తంభమని , నూర్పిడి  అనంతర ప్రక్రియలో నిల్వ, శీతల గిడ్డంగులు, రవాణా వంటి శాఖలలో అనేక అవకాశాలున్నాయని గుర్తు చేశారు. అదే విధంగా సేంద్రీయ ఉత్పత్తలకూ డిమాండ్ ఉందని చెప్పారు. ఆహార శుద్ధి పరిశ్రమలో భారతదేశంలో ఉన్న అవకాశాలను ప్రదర్శించటమే ఈ కార్యక్రమంలో ప్రముఖంగా కనిపిస్తుందన్నారు.

ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హర్ష వి అగర్వాల్, ఫిక్కీ సెక్రెటరీ జనరల్ శ్రీ శైలేష్ కె పాఠక్ ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి తీసుకున్న చర్యలను వివరించారు. పరస్పరం సహకారం కోరుకునే వ్యాపారుల సమావేశాలకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో సదస్సు నిర్వహిస్తున్నందున వరల్డ్ ఫుడ్ ఇండియా లో సేంద్రీయ ఉత్పత్తులకు, ఆహార పదార్థాలకు  ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అర్థమవుతోంది. ఈ కార్యక్రమానికి వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

 

                                        

****



(Release ID: 1905829) Visitor Counter : 154


Read this release in: English , Hindi