ఆర్థిక మంత్రిత్వ శాఖ

దక్షిణార్ధ గోళంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కోసం ఆర్థిక సార్వజనీనత.. విజ్ఞాన-అనుభవ ఆదానప్రదానంపై హైదరాబాద్‌లో నిర్వహించిన జి-20 ప్రపంచ భాగస్వామ్య కార్యక్రమం (జీపీఎఫ్‌ఐ) 2వ సదస్సు సమాప్తం


జీపీఎఫ్‌ఐ దీర్ఘకాలిక సహాధ్యక్షతకు భారత్‌, ఇటలీల ఎంపికపై ప్రకటన;
డిజిటల్‌ ఆర్థిక సార్వజనీనత.. ‘ఎస్‌ఎంఇ ఫైనాన్స్‌’ కీలక సేవలకు మార్గ ప్రణాళిక ఖరారు

Posted On: 07 MAR 2023 4:28PM by PIB Hyderabad

   భారత జి-20 అధ్యక్షత పరిధిలో దక్షిణార్ధ గోళంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కోసం “ఆర్థిక సార్వజనీనత, విజ్ఞాన-అనుభవ ఆదానప్రదానంపై జి-20 ప్రపంచ భాగస్వామ్య కార్యక్రమం (జీపీఎఫ్‌ఐ) 2వ సదస్సు నేడు హైదరాబాద్‌లో సమాప్తమైంది. ఈ మేరకు  2023 మార్చి 6-7 తేదీల్లో జరిగిన ఈ సదస్సును జి-20కి అధ్యక్షతతోపాటు ‘జీపీఎఫ్‌ఐ’ సహాధ్యక్షత హోదాలో భారత్‌ నిర్వహించింది. జి-20 కూటమి దేశాలతోపాటు ‘జీపీఎఫ్‌ఐ’ని అమలు చేసే భాగస్వామ్య దేశాలు, అనుబంధ భాగస్వాములు, ఆర్థిక మంత్రిత్వశాఖలు, అంతర్జాతీయ సంస్థలు, కేంద్రీయ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు.

  • ఈ సమావేశంలో ‘జీపీఎఫ్‌ఐ’ కొత్త దీర్ఘకాలిక సహాధ్యక్ష బాధ్యతలకు భారత్‌, ఇటలీలను ఎంపికకు సభ్యదేశాలు ఏకగ్రీవక ఆమోదం తెలపడంతో ఆ మేరకు ప్రకటన వెలువరించబడింది. కొత్త సహాధ్యక్ష బాధ్యతలలో ఈ రెండు దేశాలు మూడేళ్లపాటు కొనసాగనుండగా వీటి పదవీ కాలం 2024 నుంచి ప్రారంభమవుతుంది.
  • ఈ సమావేశంలో డిజిటల్‌ ఆర్థిక సార్వజనీనత, ‘ఎస్‌ఎంఇ ఫైనాన్స్‌’సహా ఈ ఏడాది అందించాల్సిన కీలక సేవలకు సంబంధించి చర్చల అనంతరం అంగీకారం కుదిరింది. మరోవైపు ‘జీపీఎఫ్‌ఐ’ ఆర్థిక సార్వజనీనత కార్యాచరణ ప్రణాళిక-2023 (ఎఫ్‌ఐఏపీ) రూపకల్పన లక్ష్యంగా ప్రత్యేక వర్క్‌షాప్ కూడా నిర్వహించబడింది. జి-20 కింద 2024-26 మధ్య కాలానికిగాను ఆర్థిక సార్వజనీనత కృషికి ఈ ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది.
  • ‘జీపీఎఫ్‌ఐ’ సమావేశానికి అనుబంధంగా జి-20 కూటమి దేశాలతోపాటు జి-20యేతర దేశాల్లో చెల్లింపులు-బట్వాడా లావాదేవీలకు సంబంధించి 2023 మార్చి 6న ఒక చర్చాగోష్ఠి కూడా నిర్వహించబడింది. ఇందులో భాగంగా ఆర్థిక సార్వజనీనత, ప్రతిరోధకత, ఉత్పాదకత ప్రయోజనాలు, సమ్మిళిత వృద్ధి తదితరాల్లో చెల్లింపు వ్యవస్థలకు సంబంధించి డిజిటల్ ఆవిష్కరణల వినియోగంపై నిపుణుల బృందం చర్చించింది. ఈ చర్చావేదికకు ‘బెటర్‌ దాన్‌ క్యాష్‌ అలయెన్స్‌’ సంస్థ ఎండీ డాక్టర్‌ రూత్‌ గూడ్విన్‌ గ్రోయెన్‌ సంధానకర్తగా వ్యవహరించగా- శ్రీ పెడ్రో డి వాస్కాన్సెలోస్‌ (సీనియర్‌ టెక్నికల్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఫెసిలిటీ ఫర్‌ రెమిటెన్సెస్‌ మేనేజర్‌, ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌-ఐఎఫ్‌ఎడి); శ్రీమతి హర్షా రోడ్రిగ్స్‌ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ రీజినల్‌ క్లయింట్‌ సర్వీసెస్‌, విమెన్స్‌ వరల్డ్‌ బ్యాంకింగ్‌); శ్రీ సుధాంశు ప్రసాద్‌ (జనరల్‌ మేనేజర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఆర్‌బిఐ); డాక్టర్‌ రాల్ఫ్‌ ఒయినీ ఎంబౌనా (డైరెక్టర్‌ ఆఫ్‌ డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ అండ్‌ సర్వీసెస్‌, స్మార్ట్‌ ఆఫ్రికా) తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఆర్థిక సార్వజనీనత, ప్రతిరోధకత, ఉత్పాదకత ప్రయోజనాలు, సమ్మిళిత వృద్ధి వగైరాలను ముందుకు తీసుకెళ్లే బలమైన చెల్లింపు వ్యవస్థ రూపకల్పనపై అనుభవాల కలబోత, అభిప్రాయ వెల్లడి, అవగాహన దిశగా ఫలవంతమైన చర్చలకు ఈ చర్చాగోష్ఠి వేదికగా నిలిచింది.
  • ‘జీపీఎఫ్‌ఐ’కి ముందుగా దక్షిణార్ధ గోళంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కోసం ఆర్థిక సార్వజనీనత.. విజ్ఞాన-అనుభవ ఆదానప్రదానంపై 2023 మార్చి 4-6 తేదీల్లో ఒక కార్యక్రమం   నిర్వహించబడింది. జి-20 అధ్యక్ష బాధ్యతకు ఇతివృత్తమైన “ఒకే భూగోళం-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” సూత్రం ప్రాతిపదికగా దక్షిణార్ధ గోళ దేశాలతో ఈ చర్చా కార్యక్రమం జరిగింది. జి-20 ఇండియా ముఖ్య సమన్వయకర్త శ్రీ హర్షవర్ధన్ ష్రింగ్లా; ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య-పరిశ్రమల శాఖ (ఇన్‌చార్జి), సమాచార సాంకేతిక విభాగం ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్‌ సహా జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములకు చెందిన నిపుణులు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • ఆర్థిక సార్వజనీనత పురోగమన వేగం పెంచడంలో ‘డీపీఐ’ ఆధారిత డిజిటల్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థ పాత్రపై సదస్సులో పాల్గొన్నవారికి అవగాహన కల్పన లక్ష్యంగా ‘డీపీఐ’ల వినియోగం ద్వారా ఆర్థిక సార్వజనీనత దిశగా సాధించిన పరివర్తన అనుభవాలను “ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా”సహా భారతదేశ నిపుణులు అందరితోనూ పంచుకున్నారు.
  • బంగ్లాదేశ్, భూటాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా, జోర్డాన్, మలావి, మాల్దీవ్స్‌, నేపాల్, ఒమన్, ఫిలిప్పీన్స్, పోలాండ్, సెనెగల్, సియెర్రా లియోన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం దేశాల ఆర్థిక మంత్రిత్వశాఖలు, కేంద్రీయ బ్యాంకుల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అలాగే “ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా (ఎఎఫ్‌సిఎఫ్‌టిఎ), అరబ్ మానిటరీ ఫండ్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, గేట్స్ ఫౌండేషన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ కరీబియన్ స్టేట్స్, స్మార్ట్ ఆఫ్రికా” వంటి వివిధ ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు కూడా చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.
  • ఆర్థిక సార్వజనీనతను ముందుకు తీసుకెళ్లడంలో ‘ఇఎంఇ’ల ప్రాథమ్యాలు, ఆలోచనలకు సంబంధించి ఆదానప్రదాన కార్యక్రమంలో కీలక విధానాలను ప్రతినిధులు పరస్పరం మార్పిడి చేసుకున్నారు. జి-20 అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా ప్రపంచవ్యాప్త ఆర్థిక సార్వజనీనతను ముందుండి నడిపించేందుకు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల గళాన్ని జి-20 వేదికద్వారా గట్టిగా వినిపించేందుకు భారత్‌ కట్టుబడి ఉంది. ఈ దిశగా ‘ఇఎంఇ’ల విజయవంతమైన కార్యక్రమాలు, వాటికి ఎదురైన సవాళ్లు-అభివృద్ధి అవసరాలు వంటి అనుభవాలు జి-20కి ఉపయుక్తం కాగలవు. ఆ మేరకు ఏడాది కాలంలో ఇతర కీలక కార్యాచరణల అమలుతోపాటు 2024-26 మధ్య కాలానికిగాను ఆర్థిక సార్వజనీనత కార్యాచరణ ప్రణాళిక (ఎఫ్‌ఐఎపి) రూపకల్పన కృషికీ అవి దోహదం చేస్తాయి.

 

*****



(Release ID: 1904918) Visitor Counter : 167


Read this release in: English