హోం మంత్రిత్వ శాఖ
ఈనెల 11న జాతీయ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్
పరేడ్ లో పాల్గొనున్న 37 మంది మహిళా అధికారులతో సహా 195 మంది ఐపిఎస్ అధికారులు
ముఖ్య అతిధిగా హాజరు కానున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
Posted On:
10 FEB 2023 8:03AM by PIB Hyderabad
ఇండియన్ పోలీస్ సర్వీస్ ( ఐపిఎస్) 74 ఆర్ఆర్ బ్యాచ్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ను 2023 ఫిబ్రవరి 11న నిర్వహించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ సిద్దమయింది.
ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీ ఏ.ఎస్.రాజన్ పరేడ్ వివరాలు వెల్లడించారు. దీక్షాత్ పరేడ్‌ల మొత్తం 195 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొంటారని తెలిపారు. భూటాన్ కు చెందిన ఆరుగురు అధికారులు,మాల్దీవుల నుంచి ఎనిమిది మంది, నేపాల్ నుంచి ఐదుగురు, మారిషస్ పోలీసుల నుంచి 10 మంది అకాడమీలో శిక్షణ పూర్తి చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిధిగా పాల్గొని కవాతును సమీక్షిస్తారు.
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను అకాడమీ డైరెక్టర్ శ్రీ ఏ.ఎస్.రాజన్ అభినందించారు. మొత్తం 105 వారాల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.105 వారాల శిక్షణలో 15 వారాల ఫౌండేషన్ కోర్సు శిక్షణ, 50-వారాల ఫేజ్-I బేసిక్ కోర్స్ శిక్షణ పొందారని అన్నారు. దీని తర్వాత 30 వారాల డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చామన్నారు. డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ శిక్షణ సంబంధిత క్యాడర్/రాష్ట్రాల్లో జరిగిందని వివరించిన శ్రీ ఏ.ఎస్.రాజన్ 2వ దశ బేసిక్ కోర్సును సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో నిర్వహించామన్నారు.
భారతదేశంలో పోలీసు అధికారులు నిర్వర్తించాల్సిన విధులను దృష్టిలో ఉంచుకుని శిక్షణ కార్యక్రమాలు రూపొందించామని శ్రీ రాజన్ తెలిపారు. విధి నిర్వహణలో అధికారులు అవలంభించాల్సిన వైఖరి కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ శిక్షణా కార్యక్రమం జరిగిందన్నారు. సానుభూతితో భాదితుల కేంద్రీకృత వైఖరి అవలంబించాలని ఆయన సూచించారు. దీనివల్ల అధికారులు వృత్తిలో మరింత రాణించడానికి వీలవుతుందన్నారు.
ఇండోర్, అవుట్ డోర్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ, ప్రత్యేక చట్టాలు, ఫోరెన్సిక్స్ ఇన్ఫర్మేషన్,,కమ్యూనికేషన్ టెక్నాలజీ, మానవ హక్కులు, యోగా, ఆయుధం లేకుండా పోరాడడం మొదలైన అంశాల్లో శిక్షణ ఇచ్చామని శ్రీ రాజన్ తెలిపారు. శిక్షణలో పొందిన అనుభవంతో అధికారులు తమ విధులను సమర్ధంగా, అంకితభావంతో నిర్వర్తించగలుగుతారని అన్నారు. 37 మంది మహిళా అధికారులు దీక్షాత్ పరేడ్‌లో పాల్గొంటారని, శిక్షణ పొందిన వారిలో
23 శాతం మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు.
పరేడ్‌కు కేరళ కేడర్‌కు చెందిన శ్రీ షహన్షా కెఎస్, ఐపిఎస్ (పి) నాయకత్వం వహిస్తారు. 74 ఆర్ఆర్ మొదటి దశ శిక్షణ కార్యక్రమంలో శ్రీ షహన్షా ప్రథమ స్థానంలో నిలిచారని శ్రీ రాజన్ చెప్పారు. నల్సార్ తో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు మొదటిసారిగా పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ స్వీకరిస్తారని అన్నారు. విదేశాలకు చెందిన అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత డిప్లొమా సర్టిఫికెట్ పొందుతారని శ్రీ రాజన్ తెలిపారు.
***
(Release ID: 1897842)
Visitor Counter : 168