వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వినియోగదారు ఫిర్యాదులలో దాదాపుమూడోవంతు బీమా రంగంపైనే వినియోగదారువ్యవహారాల విభాగం (డిఒసిఎ) కార్యదర్శి వెల్లడి


2022 ప్రథమార్థంతో పోలిస్తే ఫిర్యాదుల పరిష్కారం ద్వితీయార్థంలో రెట్టింపు;సరళమైన భాషలో..పారదర్శకంగా రూపొందించడం ద్వారాబీమా పాలసీలను మరింత మెరుగుపరచాలి:కేంద్ర ప్రభుత్వం

Posted On: 08 FEB 2023 7:30PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా 2022 ఏప్రిల్‌-జూలై మధ్య కాలంతో పోలిస్తే ఆగస్టు-నవంబరు కాలంలో వినియోగదారు కోర్టులలోని కేసుల పరిష్కారం రెండింతలు పెరిగింది. వినియోగదారు వ్యవహారాల విభాగం (డిఒసిఎ) తీసుకున్న అనేక చురుకైన చర్యలే ఇందుకు కారణమని ఆ విభాగం కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఇవాళ వినియోగదారు-బీమా రంగాలపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వినియోగదారు కమిషన్‌ వద్ద 5,78,061 కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 1,61,134 బీమా రంగానికి సంబంధించినవేనని వెల్లడించారు.

బీమా రంగంలో కేసులు ప్రయాణ, జీవిత, గృహ, కారు, సముద్ర, అగ్ని, పంట, వైద్య బీమాల కింద వివిధ రకాలుగా వర్గీకరించబడినట్లు ఆయన పేర్కొన్నారు. వీటన్నిటికీ సంబంధించి వైద్య బీమా, జీవిత బీమా విభాగాల క్లెయిమ్‌లలోనే అధికశాతం ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో క్లెయిమ్‌ల తిరస్కరణకుగల ప్రధాన కారణాలపై సమావేశం చర్చించింది. అవేమిటంటే- (i) బీమా ఒప్పందంలో అస్పష్టత… అంటే- సాంకేతిక పరిభాష, సంక్లిష్ట పద ప్రయోగం; (ii) వినియోగదారు అర్హత, అప్పటికేగల వ్యాధుల కారణంగా తిరస్కృతి; (iii) నిబంధనలపై మధ్యవర్తిత్వ సంస్థ గోప్యత; (iv) (మునుపటి వ్యాధులు కాకుండా) అర్హత; (v) పథకంతో ముడిపడిన పంటల బీమా నిబంధనలు.

ఈ నేపథ్యంలో వివిధ వినియోగదారు కమిషన్ల వద్ద పెద్దసంఖ్యలోగల పెండింగ్‌ బీమా కేసుల పరిష్కారం దిశగా ఆయా భాగస్వాములతో సంప్రదింపుల సౌలభ్యం కల్పిస్తూ ‘డిఒసిఎ’ ప్రస్తుత రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. జాతీయ వినియోగదారు వివాద పరిష్కార కమిషన్‌ సభ్యులుసహా జార్ఖండ్, గుజరాత్ రాష్ట్ర కమిషన్ల అధ్యక్షులు; హిసార్, రాయగఢ్, జబల్పూర్, ఘజియాబాద్ జిల్లాల కమిషన్ల అధ్యక్షులు; జమ్ముకశ్మీర్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర కమిషన్ల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. బీమా కేసుల పరిష్కారంలో కమిషన్లకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలపై ఈ సందర్భంగా వారు లోతుగా చర్చించారు.

బీమా పాలసీలను సరళంగా, స్థానిక భాషలో, మినహాయింపులు-చేర్పులను స్పష్టంగా వివరిస్తూ మరింత పారదర్శకంగా రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే సమాచార సాంకేతికత వినియోగం, మధ్యవర్తిత్వ నిర్వహణ యంత్రాంగ ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు. కేసుల బహుళదశ విచారణ ఉండరాదని, అంబుడ్స్‌ మన్ ద్వారా కేసుల పరిష్కార అధికార పరిధి పెంచాలని, వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించే విధంగా బీమా ఒప్పందం నిబంధనల గురించి స్పష్టంగా తెలియజేయాలని సూచనలు వచ్చాయి. సంస్థ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం, మినహాయింపు నియమాలుసహా షరతులు-నిబంధనలను చదవదగిన పరిమాణంలోగల అక్షరాలతో ముద్రించాలని, పాలసీ పరిభాషలో లోతైన సాంకేతిక పదప్రయోగం ఉండరాదని సూచనలు వచ్చాయి. కాగా, న్యాయ సలహా అవసరం, బీమా రంగం-పంటల బీమాపై అవగాహన కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక రైతు సమస్యల పరిష్కార పోర్టల్‌ను రూపొందించింది. రైతులు దీనిద్వారా తమ ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. మొత్తంమీద బీమా పాలసీల నిబంధనలు-షరతులను నిజాయితీగా, చట్టబద్ధంగా వెల్లడించడంలోని ప్రాధాన్యాన్ని సమావేశం నొక్కిచెప్పింది.

బీమా కంపెనీల ప్రతినిధులు కొన్ని పరిమితులకు కట్టుబడాల్సి రావడం, సముచిత నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడం గురించి సమావేశం వివరంగా చర్చించింది. ఈ సదస్సులో ఆర్థిక సేవల విభాగం, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బీమా నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ), కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌ మన్‌ పరిధిలోని బీమా అంబుడ్స్‌ మెన్, వివిధ స్వచ్ఛంద వినియోగదారు సంస్థల సభ్యులు, 22 ప్రధాన బీమా కంపెనీల సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే 35 జిల్లా వినియోగదారు కమిషన్‌లు, 5 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయంద్వారా పాలుపంచుకున్నాయి. వినియోగదారు కమిషన్లలో బీమా కేసుల పెరుగుదలకు కారణాల అన్వేషణ, వాటి విచారణలో కమిషన్లకు ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ సామరస్యపూర్వక పరిష్కార సాధన ముఖ్యోద్దేశంగా ఈ భాగస్వామ్య వ్యవస్థల సంప్రదింపు సమావేశం నిర్వహించబడింది.

వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణతోపాటు వినియోగదారుల రక్షణ చట్టం-2019 నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా కమిషన్లలో పెండింగ్‌ కేసులు తగ్గించడానికి వినియోగదారు వ్యవహారాల విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ మేరకు పలుమార్లు అనేక కార్యక్రమాల ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 12.11.2022న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్, 2022 డిసెంబర్ 16నాటి “వినియోగదారు మధ్యవర్తిత్వ పరిష్కారం” ద్వారా పెండింగ్‌ కేసుల పరిష్కారంలో రాష్ట్ర/జిల్లా వినియోగదారు కమిషన్లు విజయవంతమయ్యాయి. దీంతో పరస్పర అంగీకారంద్వారా వివాదాలకు సత్వర పరిష్కారం లభించగలదనే ఆశాభావం ఇనుమడించింది.

 

*****



(Release ID: 1897602) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Kannada