ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ రేపు జరపనున్న 'డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్'ను ప్రారంభించనున్న శ్రీ అశ్విని వైష్ణవ్
డిజిటల్ చెల్లింపులు సాధించిన విజయాలు, జీ20 కో-బ్రాండెడ్ క్యూఆర్ కోడ్ & కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ, డిజిటల్ చెల్లింపుల సందేశ యాత్ర, డిజీధన్ పురస్కారాల ప్రదానం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణలు
Posted On:
08 FEB 2023 6:14PM by PIB Hyderabad
రేపు న్యూదిల్లీలో జరగనున్న 'డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్', సమగ్ర ప్రచార ప్రణాళికను ప్రారంభించే కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గౌరవ అతిథిగా పాల్గొంటారు. శాఖ కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
పౌరులకు డిజిటల్ సాధికారత కల్పించాలన్న తన దృక్పథం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరచూ చెబుతుంటారు. ఇది, డిజిటల్ ప్రభావం దిశగా భారతదేశం మారుతున్న సమయం. తన సామర్థ్యాన్ని గ్రహించి, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత రంగంలో ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి భారత్ ముందున్న సమయం ఇది. యూపీఐ వంటి సాంకేతికతలు మొత్తం చెల్లింపుల వ్యవస్థను మార్చాయి, ప్రపంచంలోనే అత్యధిక వాస్తవ-సమయ డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సాధించాయి. మొత్తం లావాదేవీల్లో డిజిటల్ లావాదేవీల వాట 40 శాతానికి చేరింది. ఈ ఘనతను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటల్లో చెప్పాలంటే - 'భారతదేశం తన ఆవిష్కరణల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.'
భారతదేశం 'స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్'ను జరుపుకుంటోంది, ఇప్పుడు 'జీ20 అధ్యక్ష' స్థానంలో ఉంది. ఈ సందర్భంగా, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ పౌరులందరికీ సులభమైన, అనుకూలమైన డిజిటల్ చెల్లింపు విధానాల అందుబాటును మెరుగుపరడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, కఠిన భౌగోళిక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు ఈ వ్యవస్థలోకి చేర్చడంపై దృష్టి సారించింది. ఇందుకోసం, దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, అన్ని వర్గాల సహకారంతో, 2023 ఫిబ్రవరి 9 నుంచి 2023 అక్టోబర్ 9 వరకు "డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్" పేరిట దేశవ్యాప్తంగా ఒక భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా, జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (డీఈడబ్ల్యూజీ) ఆతిథ్య నగరాలైన హైదరాబాద్, పుణె, బెంగళూరు, లఖ్‌నవూపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ కార్యక్రమంలో జరిగే జీ20 కో-బ్రాండెడ్ క్యూఆర్ కోడ్ & కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణలు, డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ నాయకత్వం దిశగా భారతదేశ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి. డిజిటల్ చెల్లింపులను సరళంగా మార్చేలా వివిధ బ్యాంకు సేవలను కూడా ప్రారంభిస్తారు. వివిధ డిజిటల్ చెల్లింపుల విధానాలపై పౌరులకు అవగాహన కల్పించడంతో పాటు డిజిటల్ చెల్లింపుల భద్రత గురించి కూడా వివరించే లక్ష్యంతో 'డిజిటల్ చెల్లింపుల సందేశ యాత్ర'ను జెండా ఊపి ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులకు డిజీధన్ పురస్కారాలను అందిస్తారు.
డిజిటల్ చెల్లింపులు ఆర్థిక కార్యకలాపాలను ఎలా పెంచుతున్నాయి, దేశంలోని చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, సామాన్య ప్రజలను ఎలా శక్తిమంతం చేస్తున్నాయో కూడా ఈ కార్యక్రమంలో వివరిస్తారు. మిగిలిన కేంద్ర మంత్రిత్వ శాఖల క్రియాశీల భాగస్వామ్యంతో, డిజిటల్ చెల్లింపులను మొత్తం కేంద్ర ప్రభుత్వ నిజమైన స్ఫూర్తిగా నిరూపించడానికి డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్ ఒక అవకాశంగా ఉంటుంది.
భారతదేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడం & సాంకేతికత - సమాచార రంగంలో స్వావలంబనను సృష్టించడం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ విస్తృత లక్ష్యం. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్ (2023 ఫిబ్రవరి 9 నుంచి అక్టోబర్ 9 వరకు) నిర్వహిస్తోంది. భారతదేశ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు పురస్కారాల ప్రదానం, డిజిటల్ చెల్లింపుల సందేశ యాత్ర'ను జెండా ఊపి ప్రారంభించడం, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు & గ్రూప్ కోఆర్డినేటర్ ముగింపు ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సాంకేతికతతో సామాన్యులకు సాధికారత కల్పించాలన్న ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడానికి మార్గం సుగమం చేసే ఆవిష్కరణల సంస్క్రతి, వ్యవస్థాపకత, డిజిటల్ వ్యవస్థల గొప్ప వేడుక ఈ కార్యక్రమం.
***
(Release ID: 1897598)
Visitor Counter : 198