ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం
2022 31 డిసెంబర్ వరకు 17.27 లక్షల మంది రోగులు డయాలసిస్ సేవలు పొందారు
దేశంలో 1350 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు
Posted On:
03 FEB 2023 5:06PM by PIB Hyderabad
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికి, 2016-17లో ప్రారంభమైన ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం (పీఎంఎన్‌డీపీ) ద్వారా దేశంలోని జిల్లా ఆసుపత్రుల్లో ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు.
పీఎంఎన్‌డీపీ కింద హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ సేవల అమలు కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్‌ఎం) మద్దతుగా నిలుస్తోంది. 2022 డిసెంబర్ 31 వరకు మొత్తం 17.27 లక్షల మంది రోగులు డయాలసిస్ సేవలు పొందారు.
2022 డిసెంబర్ 31 నాటికి, మొత్తం 36 రాష్ట్రాలు/యూటీల్లోని 641 జిల్లాల్లో ఉన్న 1350 డయాలసిస్ కేంద్రాల్లోని 8,871 హీమోడయాలసిస్ యంత్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలైంది. దేశంలోని జిల్లాల్లో పీఎంఎన్‌డీపీ పరిధిని విస్తరించేందుకు రాష్ట్రాలు/యూటీలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పీఎంఎన్‌డీపీ కింద దేశంలో 1350 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దేశంలో ఏర్పాటైన హీమోడయాలసిస్ కేంద్రాల జిల్లాల వారీ వివరాలను https://nhsrcindia.org/pradhan-mantri-national-dialysis-program లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక నేషన్-ఒక డయాలసిస్ కార్యక్రమం కింద ఈ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో, నేషనల్ పీఎంఎన్‌డీపీ పోర్టల్‌ను 2022 మే 5న ప్రారంభించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాత (ఏబీహెచ్‌ఏ) ఐడీని ఉపయోగించి డయాలసిస్ కోసం రోగులు పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ పోర్టర్ అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం తెలిపారు.
****
(Release ID: 1896502)