ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఎ.ఎం.ఆర్. ఒక నిశ్శబ్ద, అదృశ్య మహమ్మారి!


ప్రపంచ అత్యున్నత స్థాయి సదస్సులో

కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రసంగం

సమస్య పరిష్కారానికి జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయి రాజకీయ మద్దతును అవసరమని ఉద్బోధ

Posted On: 24 NOV 2022 4:36PM by PIB Hyderabad

    "యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎం.ఎం.ఆర్.) అనేది నిశ్శబ్దంగా దెబ్బతీసే, అదృశ్య మహమ్మారి, ఇతర సాధారణ ప్రజారోగ్య ప్రాధాన్యతా కార్యక్రమాలతో దీన్ని అధిగమించడం సాధ్యం కాదు" అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. ఎం.ఎం.ఆర్. మహమ్మారి బెడదపై ఈరోజు జరిగిన 3వ అత్యున్నత స్థాయి ప్రపంచ సదస్సుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ప్లీనరీ ప్యానెల్ భేటీలో ఆమె ప్రసంగించారు. ఒమన్‌లోని మస్కట్‌లో ఏర్పాటు  చేసిన ఈ సదస్సులో 15కుపైగా దేశాలకు చెందిన 22మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ.ఎం.ఆర్.పై బహుళ భాగస్వామ్య వర్గాల ప్రమేయంతో కూడిన ఒక వేదికను నాలుగు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు ప్రారంభించాయి. 

Image

   ఎ.ఎం.ఆర్. మహమ్మారి ప్రాబల్యం, దాని తదుపరి ప్రాణాంతక ప్రభావాలను గురించి కేంద్రమంత్రి తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఆరోగ్యానికి ప్రపంచస్థాయిలో ఎదురైన ముప్పుగా ఎ.ఎం.ఆర్.ను ఇప్పటికే గుర్తించినట్టు ఆమె చెప్పారు. ఎ.ఎం.ఆర్. మహమ్మారితో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక, రాజకీయ పర్యవసానాలు ఎదురవుతున్నాయని అన్నారు. 

  ఎ.ఎం.ఆర్. నిరోధంపై దృష్టి సారించినందుకు ఐక్యరాజ్యసమితి (యు.ఎన్.) సర్వప్రతినిధి సభకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.కు), సభ్యదేశాలకు కేంద్రమంత్రి డాక్టర్ పవార్  అభినందనలు తెలిపారు. "ఎ.ఎం.ఆర్. సమస్యకు యు.ఎన్. సర్వప్రతినిధి సభ, డబ్ల్యు.హెచ్.ఒ., సభ్యదేశాలు ప్రాధాన్యతనివ్వడం హృదయపూర్వకంగా సంతృప్తిని కలిస్తోంది." అని అన్నారు. మహమ్మారి సమస్య పరిష్కారానికి సమైక్యంగా జరుగుతున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితికి అనుబంధించిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ.), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.), ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.ఒ.ఎ.హెచ్.), ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఇ.పి.) ద్వారా జరుగుతున్న సమగ్ర కృషిని ఆమె అభినందించారు.

Image

     ఎ.ఎం.ఆర్. మహమ్మారిపై పోరు సాగించడానికి భారతదేశం తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి వివరించారు. ఎ.ఎం.ఆర్. బెడద నిర్మూలనకు, సమస్య పరిష్కరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. 2016లో ఎ.ఎం.ఆర్.పై ఒక సదస్సును భారతప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిందని చెప్పారు. ఆరోగ్యరక్షణకు చేపట్టిన జాతీయ ఎజెండాలో ఎ.ఎం.ఆర్. మహమ్మారిని ఎదుర్కొనే కార్యక్రమాన్ని కూడా చేర్చినట్టు తెలిపారు. అవగాహనా కల్పన, సామర్థ్యాల పెంపుదల, ప్రయోగశాలల బలోపేతం, నిఘా, వైరస్ వ్యాప్తి నిరోధం, నియంత్రణ, యాంటీమైక్రోబయల్ స్టీవార్డ్‌షిప్, కొత్త ఔషధాల రూపకల్పనపై పరిశోధనలు, వ్యాధినిర్ధారణ, ఆవిష్కరణల ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఆమె ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. అత్యున్నత స్థాయిలో రాజకీయ సంకల్పంతో, మద్దతుతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

 

Image

   ఎ.ఎం.ఆర్. నిరోధం లక్ష్యంగా 2011లో జైపూర్ డిక్లరేషన్‌పై సంతకం చేసిన 11 సభ్య దేశాల ఆరోగ్య మంత్రుల సహకారాన్ని కేంద్రమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.  ఎ.ఎం.ఆర్. మహమ్మారి నియంత్రణ కోసం చేపట్టే ఆరోగ్య విధానం పట్ల వారి నిబద్ధతను, రాజకీయ మద్దతును ఇది సూచిస్తోందన్నారు.

  ఎ.ఎం.ఆర్.పై న్యూఢిల్లీలో ప్రపంపస్థాయి సదస్సును ప్రారంభించిన ఊపుతోనే, 2024లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో జరగబోయే అత్యున్నత స్థాయి సమావేశాన్ని సమీకృతం చేయడానికి కృషిచేయాలని డాక్టర్ పవార్ సూచించారు. అన్ని స్థాయిలలో రాజకీయ మద్దతును బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

   మస్కట్ సదస్సుకు డబ్ల్యు.హెచ్‌.ఒ. డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ.) డైరెక్టర్ జనరల్ క్యు.యు. డోంగ్యు, ఒమన్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ అల్ సబ్తీ, ఒమన్ వ్యవసాయ, మత్స్య సంపద- నీటి వనరుల శాఖ మంత్రి సౌద్ అల్ హబ్సీ, నెదర్లాండ్స్ ఆరోగ్య, సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఎర్నెస్ట్ కైపర్స్, తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

**** 



(Release ID: 1878685) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Marathi , Hindi