వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో రేపటి నుంచి మూడు రోజుల మెగా వ్యవసాయ మేళ, ప్రదర్శనను నిర్వహిస్తున్న - కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తోమర్ అధ్యక్షత వహించనున్న ప్రారంభ వేడుకలను ముఖ్యమంత్రి శ్రీ చౌహాన్ ప్రారంభించడంతో పాటు, ఈ సందర్భంగా 103 అమృత్ సరోవరాలను జాతికి అంకితం చేయనున్నారు


వేలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు; సంజీవని కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారు; గుజరాత్ గవర్నర్ శ్రీ దేవవ్రత్ నవంబర్, 12వ తేదీన ఈ మేళాను సందర్శించనున్నారు

Posted On: 10 NOV 2022 7:21PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో పాటు జిల్లా పరిపాలన విభాగం సహకారంతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరెనా లో నిర్వహిస్తున్న మూడు రోజుల మెగా వ్యవసాయ మేళా మరియు ప్రదర్శనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు ప్రారంభించనున్నారు.  స్థానిక పార్లమెంటు సభ్యుడు, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.  చంబల్-గ్వాలియర్ మండలానికి చెందిన సుమారు 35 వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  రైతులకు మార్గదర్శనం చేసేందుకు, ప్రతిరోజూ వివిధ ముఖ్యమైన అంశాలపై 12 వేర్వేరు సదస్సులతో పాటు 4 బృంద సదస్సులు కూడా జరుగుతాయి. ఈ సదస్సుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యవసాయ నిపుణులు సమాచారం, ప్రదర్శనలు ఇస్తారు.  ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి 103 అమృత్ సరోవరాలను ప్రారంభించడంతో పాటు, సంజీవని కేంద్రాలకు శంకుస్థాపన చేస్తారు.  వీటితో పాటు స్టేడియంలో 10 కోట్ల రూపాయలతో ఇండోర్, ఔట్‌ డోర్ సౌకర్యాలకు కూడా, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.  గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ రెండవ రోజు ఈ జాతరను సందర్శిస్తారు.  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  కాగా, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి;  మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కమల్ పటేల్;  నర్మదా లోయ అభివృద్ధి, ఉద్యానవనాలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి శ్రీ భరత్ సింగ్ కుష్వా ప్రభృతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 

 

 

శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,  గ్వాలియర్-చంబల్ ప్రాంతాన్ని ఆధునికంగా, వ్యవసాయంలో అగ్రగామిగా మార్చడానికి ఈ వ్యవసాయ మేళా మరియు ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ మండల కేంద్రాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, కార్మికులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొన్న రైతులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఈ మేళా ప్రత్యేకత ఏంటంటే - నూతన సాంకేతికత, ఆధునిక వ్యవసాయాన్ని అవలంబించాలనే ఆసక్తి ఉన్న రైతులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  రైతులు ఈ కార్యక్రమం నుండి నేర్చుకుని తమ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవడానికి వీలుగా, కొత్త వ్యవసాయ సాంకేతికత, అధునాతన వ్యవసాయ యంత్రాల వినియోగం, స్వీకరించడం పై శిక్షణ ఇవ్వబడుతుంది.

ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వ్యవసాయ ప్రదర్శనలో రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి స్టాల్స్‌ ద్వారా సమాచారాన్ని అందజేయడంతో పాటు ప్రయివేటు రంగంలో వ్యవసాయానికి చెందిన వివిధ ఇన్‌ పుట్‌ ల సరఫరాకు సంబంధించిన కంపెనీలు / సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని, శ్రీ తోమర్ తెలియజేశారు.  ఎగ్జిబిషన్‌ లో రైతులకు తాజా సమాచారం అందించేందుకు 132 స్టాళ్లను ఏర్పాటు చేశారు.  అనేక వ్యవసాయ పనిముట్లు, పురుగుమందులు ప్రదర్శించబడతాయి. ఇవి వ్యవసాయ ఖర్చులను తగ్గించడంలో సహాయపడతాయి.  ప్రగతిశీల రైతుల విజయగాథలను కూడా ఈ కార్యక్రమంలో తెలుసుకోవచ్చు. 

ఈ మేళా సందర్భంగా రైతులకు రెండు  సదస్సుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు శ్రీ తోమర్ తెలియజేశారు.  సహజ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత; సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టడం; ఆవాల అధిక దిగుబడి రకాలను ఉపయోగించి, ఉత్పాదకత పెంచడం; వ్యవసాయంలో భూమి ఆరోగ్య కార్డులు; భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యత;  పంటల బీమా ప్రాముఖ్యత;  ఉద్యానవనాల సాగు కింద మెరుగైన రకాల కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల సాగు; విత్తనోత్పత్తి; మెరుగైన రకాల తృణ ధాన్యాల ఉత్పత్తి, వినియోగం; విలువ పెంపు;  ఉపాధి కల్పన; మెరుగైన పశుపోషణ;  పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య సంపద, జంతు వ్యాధుల నివారణ వంటి అంశాలపై మూడు రోజులూ ఉదయం సెషన్లలో రైతులకు బృంద సదస్సులు నిర్వహించబడతాయి.

మధ్యాహ్నం సెషన్లలో, రైతులకు పంటల వైవిధ్యం; నానో యూరియా యొక్క ప్రాముఖ్యత; డ్రోన్లతో చల్లడం; జామ ఉత్పత్తి లో అధునాతన సాంకేతికత; ప్రాసెసింగ్- మార్కెటింగ్, కాంట్రాక్టు పద్ధతిలో  బంగాళదుంప సాగు; తేనెటీగల పెంపకం, తేనె ప్రాసెసింగ్, మార్కెటింగ్; పుట్టగొడుగుల ఉత్పత్తిలో అధునాతన పద్ధతులు; వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం; రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక బృందాల ఏర్పాటు ప్రక్రియ; పాల ఉత్పత్తి పెరుగుదల, మేలు జాతి అభివృద్ధి  వంటి ముఖ్యమైన వ్యవసాయ అంశాలపై చిన్న సమూహాలలో శిక్షణ ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమం ద్వారా చంబల్-గ్వాలియర్ జోన్‌ లో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుంది.  ఎంతో ప్రయోజనకరమైన ఈ కార్యక్రమంలో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలని, ఈ ప్రాంతంలోని అన్ని సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులకు కేంద్ర మంత్రి శ్రీ తోమర్ విజ్ఞప్తి చేశారు.  పెద్ద సంఖ్యలో ఉన్న చిన్న రైతులకు సౌకర్యాలు, ప్రయోజనాలు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.  ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

 

 

*****



(Release ID: 1875079) Visitor Counter : 124


Read this release in: English , Urdu