శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ఐక్యరాజ్యసమితి రెండవ ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ప్రారంభం
సంక్షోభ సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు అంతర్జాతీయ సమాజం సంస్థాగత విధానాన్ని అనుసరించాలని పిలుపు ఇచ్చిన ప్రధానమంత్రి
“ఏ ఒక్కరూ వెనుకబడి ఉండకూడదన్న విధానాన్ని భారతదేశం అనుసరిస్తుంది ; సాంకేతికత లక్ష్యం మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరి కలయిక అనేది సాంకేతికత లక్ష్యం : ప్రధానమంత్రి మోదీ
సాంకేతికత మరియు ప్రతిభ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయి.. ప్రధానమంత్రి
భారతదేశ భౌగోళిక ఆర్థిక వ్యవస్థ (జియోస్పేషియల్ ఎకానమీ) 2025 నాటికి 12.8% వృద్ధి రేటుతో రూ. 63,000 కోట్లు దాటుతుందని మరియు 10 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని అంచనా
"వ్యర్థాల నుంచి సంపద సృష్టి, అడవులు, పట్టణ ప్రణాళిక, రోడ్డు మ్యాపింగ్ వంటి అనేక రకాల రంగాల్లో భారతదేశంలో 250 కి మించి అంకుర సంస్థలు పనిచేస్తూ జియోస్పేషియల్ టెక్నాలజీ అప్లికేషన్‌ల ప్రాధాన్యత తెలియజేస్తున్నాయి ": డాక్టర్ జితేంద్ర సింగ్
5 రోజుల పాటు జరిగే కాంగ్రెస్‌లో పాల్గొంటున్న దాదాపు 120 దేశాలకు చెందిన 2000 మంది ప్రతినిధులు 700 మంది అంతర్జాతీయ ప్రతినిధులు
Posted On:
11 OCT 2022 1:26PM by PIB Hyderabad
రెండవ ఐక్యరాజ్య సమితి ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (UNWGIC 2022) ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే సదస్సుకు శాస్త్ర సాంకేతిక విభాగం, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆతిధ్యం ఇస్తున్నాయి. గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌పై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ సదస్సును నిర్వహిస్తుంది.
' ఏ ఒక్కరూ వెనుకబడకుండా జియోఆధారిత గ్లోబల్ విలేజ్ అభివృద్ధి ' అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్యసమితి రెండవ ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ను నిర్వహిస్తున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, పర్యవేక్షణ అంశాల్లో సమీకృత జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మౌలిక సదుపాయాల కల్పన, జ్ఞాన సేవల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా సదస్సు నిర్వహిస్తున్నారు. సమాజ శ్రేయస్సు పర్యావరణ మరియు వాతావరణ సవాళ్ల పరిష్కారం, డిజిటల్ మార్పు, సాంకేతిక అభివృద్ధిని కార్యరూపంలోకి తేవడం, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంశాలపై కూడా కాంగ్రెస్ దృష్టి సారిస్తుంది.
వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి రెండవ ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సమావేశాలను ప్రారంభించారు. " సంక్షోభ సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు అంతర్జాతీయ సమాజం సంస్థాగత విధానాన్ని అఅనుసరించాల్సిన అవసరం ఉంది" అని ప్రధానమంత్రి అన్నారు. “ఏ ఒక్కరూ వెనుకబడి ఉండకూడదన్న విధానాన్ని భారతదేశం అనుసరిస్తుంది" అని వివరించిన ప్రధానమంత్రి స్వమిత్ర, పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్, జామ్ ట్రినిటీ లాంటి పథకాల అమలులో జియోస్పేషియల్ సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామని అన్నారు. "సాంకేతికత మరియు ప్రతిభ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. సాంకేతికత లక్ష్యం మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరి కలయిక అనేది సాంకేతికత లక్ష్యం. యువ దేశమైన భారతదేశం అపారమైన ప్రతిభా శక్తిని కలిగి ఉంది" అని ప్రధానమంత్రి వివరించారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే అంశంలో ప్రతిభ రెండో కీలక అంశంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు పనిచేస్తున్న దేశాల జాబితాలో భారతదేశం చేరిందని అన్నారు. భారతదేశ యువ ప్రతిభకు నిదర్శనంగా 2021 నుంచి యునికార్న్ సంస్థల సంఖ్య రెట్టింపు అయ్యిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సమాజంలో అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించాలి అన్న లక్ష్యంతో దేశంలో అంత్యోదయ నినాదంతో పనిచేస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. అమెరికా మొత్తం జనాభాకు మించి 450 మిలియన్ మందిని బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చామని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. ఫ్రాన్స్ దేశ జనాభా కి రెట్టింపు సంఖ్యలో 135 మిలియన్ ప్రజలకు బీమా సౌకర్యం కల్పించామని అన్నారు. 110 మిలియన్ కుటుంబాలకు పారిశుధ్య సౌకర్యాలు, 60 మిలియన్ పైగా కుటుంబాలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. 'ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు చేరాలి' అన్నది తమ ప్రభుత్వ నినాదం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు, జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానం లో ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. సుస్థిర పట్టణ అభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాల నివారణ, సహాయ చర్యల అమలు, వాతావరణంలో వస్తున్న మార్పులు, అడవుల నిర్వహణ, జల వనరుల నిర్వహణ, ఎడారి ప్రాంతాలు ఏర్పడకుండా చూడడం, ఆహార భద్రత కల్పన లాంటి అంశాల్లో జియోస్పేషియల్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపి, అభివృద్ధి సాధనకు సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు. భారతదేశంలో భౌగోళిక ఆర్థిక వ్యవస్థ (జియోస్పేషియల్ ఎకానమీ) 2025 నాటికి 12.8% వృద్ధి రేటుతో రూ. 63,000 కోట్లు దాటుతుందని అన్నారు. ఈ రంగం 10 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. జియోస్పేషియల్ ఇంక్యుబేటర్ ను డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. సాంకేతికత ఆధారంగా ఏర్పాటవుతున్న అంకుర సంస్థలు జియోస్పేషియల్ ఇంక్యుబేటర్ వల్ల ప్రయోజనం పొందుతాయని అన్నారు.
సోలార్ కాలిక్యులేటర్, భూనిధి పోర్టల్ మరియు నేషనల్ టోపోనిమి డేటాబేస్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. ‘ఐజిఐఎఫ్‌తో ఏకీభవించడంలో భారతదేశ అనుభవం’పై ఒక నివేదికను కూడా విడుదల చేశారు.
సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ అట్లాస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ (NATMO), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో ), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వంటి జాతీయ సంస్థలు అనేక జిఐఎస్ ఆధారిత పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేసారు. వ్యర్థ వనరుల నిర్వహణ, అటవీ, పట్టణ ప్రణాళిక మొదలైన అనేక రంగాలలో ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయని మంత్రి తెలిపారు. జియోస్పేషియల్ రంగంలో అమలు చేస్తున్న చర్యలు దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా భారతీయ కంపెనీలు అంతర్జాతీయ మ్యాపింగ్ రంగంలో పోటీ పడేందుకు వీలవుతుందని అన్నారు. "ఆత్మనిర్భర్ భారత్" లేదా "స్వయం సమృద్ధి భారతదేశం" కలను పూర్తిగా సాకారం చేసే అంశంలో జియోస్పేషియల్ రంగం తన వంతు సహకారం అందిస్తున్నదని అన్నారు.
మ్యాప్‌లోని 21 డేటా లేయర్‌లను ఉపయోగించి 45 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మ్యాప్ చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనివల్ల పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు నీటి వనరులు, అడవులు, నివాస ప్రాంతాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మ్యాపింగ్ మరియు డిజిటలైజేషన్ పథకం కింద దాదాపు 2.6 లక్షల గ్రామ పంచాయతీల సర్వేను మంత్రిత్వ శాఖ పూర్తి చేసిందని ఆయన చెప్పారు. జియోస్పేషియల్ వల్ల భారతదేశంలో ప్రతి అంగుళం భూమిని మ్యాపింగ్ చేయవచ్చునని అన్నారు. దీనివల్ల భూ సంస్కరణలు పటిష్టంగా అమలు జరుగుతాయని అన్నారు.
భారత జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ బలంగా, వైవిధ్యంగా ఉందని అంతరిక్ష శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ సోమనాథ్ అన్నారు. దేశ అవసరాలు మరియు డిమాండ్లకు అనుగుణంగా వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. భౌగోళిక మరియు అనుబంధ విధానాలు మరియు అమలులో భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రణాళికలు అమలు చేస్తున్నదని వివరించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల జియోస్పేషియల్ రంగంలో సమూల మార్పులు తెచ్చిందని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అన్నారు. వివిధ ఆర్థిక రంగాలలో సాంకేతిక అంశాల వినియోగం పెరిగిందని పేర్కొన్నారు.
అంతకుముందు మాట్లాడిన యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ యూఎన్-జిజిఐఎం డైరెక్టర్ స్టీవన్ ష్వాన్ ఫెస్ట్ జియోస్పేషియల్ ని సంఘీభావం మరియు పరిష్కారాల వేదికగా వర్ణించారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ-జనరల్ ఆంటోనియోగుటెర్రెస్ సదస్సుకు పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. బెల్జియం యూఎన్ -జిజిఐఎం సహ అధ్యక్షుడు ఇంగ్రిడ్ వాండెన్‌బెర్ఘే మాట్లాడుతూ స్థానిక మరియు ప్రపంచ సవాళ్ల పరిష్కారం కోసం జిజిఐఎం కీలక అంశాలపై దృష్టి సారించి పనిచేస్తున్నదని వివరించారు. మనం చేసే ప్రతి పనిని మనం నివసించే ప్రాంతం నిర్ధారిస్తుందని అన్నారు. మెరుగైన జ్ఞానం, భాగస్వామ్యం, అవగాహన మరియు 2030 SDG లను సాధించడానికి మరియు భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవనోపాధిని అందించే అంశంలో గణాంకాలు సమాచార మార్పిడి కీలకంగా ఉంటాయని అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఎస్ఎస్ టీపీ డివిజన్, సీడ్ సలహాదారు డాక్టర్. దేబప్రియ దత్తా కార్యక్రమ అనుసంధానకర్తగా వ్యవహరించారు. శాస్త్ర సాంకేతిక శాఖ సైంటిస్ట్ ఈ , డాక్టర్. శుభా పాండే వందన సమర్పణ చేశారు.
****
(Release ID: 1866835)
Visitor Counter : 222