వ్యవసాయ మంత్రిత్వ శాఖ
దేశంలోని ప్రతి వ్యక్తి యొక్క వికాసం, అభివృద్ధే ప్రధానమంత్రి లక్ష్యం : కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే
గార్లదిన్నె మండలంలోని ముకుందాపురం గ్రామంవద్దనున్న ఎర్రగుంట ఎమ్ఐ ట్యాంక్ లో అమృత్ సరోవర్ పథకం కింద పూడికతీత పనులను ప్రారంభించిన మంత్రి
Posted On:
16 JUN 2022 7:02PM by PIB Hyderabad
అనంతపురం, జూన్ 16, 2022
దేశంలోని ప్రతి వ్యక్తి యొక్క వికాసం, అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే పేర్కొన్నారు. గురువారం గార్లదిన్నె మండలంలోని ముకుందాపురం గ్రామంవద్దనున్న ఎర్రగుంట ఎమ్ఐ ట్యాంక్ లో అమృత్ సరోవర్ పథకం కింద చెరువులో పూడిక తీత పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వికాసం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఎంతగానో ఆలోచిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తదితర అన్ని రాష్ట్రాల్లోనూ పథకాలను అమలు చేయడం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని, అధికారులు అందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరోగ్యం, విద్య, వ్యాపారం, గృహ నిర్మాణం తదితర రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. రోగాల బారి నుంచి సామాన్య ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్డు తీసుకున్న వారికి 5 లక్షల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స పొందవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలను క్షేత్ర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పీఎం కిసాన్ కింద లబ్ధి పొందిన నాగేంద్ర, పోషణ అభియాన్ కింద లబ్ధి పొందిన అనంతమ్మ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద లబ్ధి పొందిన రోజా, జల్ జీవన్ మిషన్ కింద లబ్ధి పొందిన వెంకటేష్ నాయక్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధి పొందిన లక్ష్మి, పీఎం మాతృ వందన యోజన కింద లబ్ధి పొందిన మమత, ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధి పొందిన లక్ష్మి, తదితరులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినట్లు తెలియజేశారు. ఇందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ పథకాలలో అందించిన ప్రధానమంత్రికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్రెడ్డి, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ మధుసూదన్, సర్పంచ్ హిమ కుమారి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1834600)
Visitor Counter : 139