వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోంది - కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే


పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి నగదు జమ

వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం

పిఎంఏవై కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

గార్లదిన్నె మండల కేంద్రంలోని హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి

అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలంలో పర్యటించిన మంత్రి

దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిరక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ సందర్శన

Posted On: 16 JUN 2022 6:43PM by PIB Hyderabad

అనంతపురం, జూన్ 16, 2022

రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోందని  కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు. గురువారం అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.  గార్లదిన్నె మండలంలోని దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిరక్షణ సంస్థ (సదరన్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్), ట్రాక్టర్ నగర్ ను ఆమె సందర్శించారు.  ఈ సందర్భంగా అక్కడ ఇంజన్ టెస్టింగ్ ల్యాబ్ ను, తయారయ్యే పరికరాల గురించిసంస్థ లో అందిస్తున్న శిక్షణ వివరాల గురించి  అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.  భారత ప్రభుత్వ నియమాల ఆధారంగా రైతులురైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసుకున్నవారికి కార్యాలయం, సిబ్బంది ఏర్పాటు, మౌలిక వసతులు, ఉత్పత్తుల ఎగుమతులు, మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ కోసం 50 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వ లబ్ధి పొందేందుకు రైతు ఉత్పత్తి సంస్థలలో 300 మందికి తక్కువ కాకుండా రైతులు చేరాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువులపై ఒక బ్యాగుకు 1,200 రూపాయల సబ్సిడీని అందించడం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున రైతులు అకౌంట్ లలోకి నేరుగా నమదు జమ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 11 విడతలుగా లబ్ది కల్పించడం జరిగిందని తెలిపారు.

 

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న రైతులతో కేంద్ర సహాయ మంత్రి ముఖాముఖి నిర్వహించారు.  వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గతంలో ఎద్దులు, ఇతర వ్యవసాయ పనిముట్ల వ్యవసాయం చేసుకునే వారిని, చిన్న సన్నకారు రైతులకు సహకారం అందించాలని ఉద్దేశంతో యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్తోమత లేని రైతులు వ్యవసాయ యంత్రాలను బాడుగకు తీసుకొని వారి పనులకు ఉపయోగించుకోవాలన్నారు. పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీతో యంత్రాలను అందిస్తున్నామన్నారు. రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు, టిల్లర్ లు, ఇతర పనిముట్లు, తదితర యంత్రాల ధరలు స్పష్టంగా రైతులకు తెలిసేలా స్పష్టమైన సమాచారం అందించాలని ఇటీవలే రాష్ట్రాలకు సూచించడం జరిగిందన్నారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు అవుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా పరిశీలించాలన్నారు.   అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద గోదాములు, శీతల గోదాములు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు, గ్రీన్ హౌస్, పాలీహౌస్ లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రైతుల ఉత్పత్తులను రైతులే మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అధిక లాభం పొందవచ్చన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 2023 వ సంవత్సరంలో రాగి, జొన్న పంట ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మలేషియా, ఇండోనేషియా నుంచి 80 శాతం మేర వంటనూనెలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్న మంత్రి,   ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ పండించేందుకు రైతులు ముందుకు రావాలని, అలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

ఈ సందర్భంగా రైతులు రామచంద్రారెడ్డి, తాడపత్రికి చెందిన రాజశేఖర్, బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన తిరుపాలు మాట్లాడుతూ వ్యవసాయ పనులకు రాకుండా ఎక్కువ మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద కల్పిస్తున్న పనులకు వెళ్తున్నారని, దీంతో రైతులకు వ్యవసాయ పనుల సమయంలో ఎక్కువ ఇబ్బంది ఏర్పడుతోందదన్నారు. దీనిని అధిగమించేందుకు వ్యవసాయ పనులకు సైతం ఉపాధి హామీని అనుసంధానం చేయాలని రైతులు మంత్రిని కోరారు. తామంతా కలిసి ఎఫ్ పి ఓ లను కూడా ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. స్థానిక అధికారులు చివరి రైతు వరకు కూడా పథకాల లబ్ధి చేకూరేలా సహకారం అందించాలన్నారు. అనంతరం మందులు పిచికారీ చేసే డ్రోన్ యంత్రం పనితీరును కేంద్ర సహాయ మంత్రి పరిశీలించారు.

గార్లదిన్నె మండల కేంద్రంలోని హౌసింగ్ లేఔట్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై) కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను  మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయించి ఇల్లు నిర్మించడం జరుగుతోందన్నారు. ఇంతకుముందు బాడుగ ఇళ్లలో ఉన్నవారికి సొంతింటి కలను నెరవేర్చి వారికి శాశ్వత గృహ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ, కుల, మతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు.  ఉజ్వల పథకం కింద గ్యాస్ లేని వారికి గ్యాస్ కనెక్షన్ అందించడం, స్వచ్ఛ భారత్ మిషన్ కింద అడిగిన వారికి లేదనకుండా మరుగుదొడ్లని నిర్మించి ఇవ్వడం, జల జీవన్ మిషన్ కింద నీటి కొళాయిలను ఏర్పాటు చేయడం, ముద్ర యోజన కింద స్వయం ఉపాధి కోసం రుణాలు అందించడం, చిరువ్యాపారులకు SVANidhi స్వానిధి పథకం కింద పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. స్వానిధి పథకం కింద చిరువ్యాపారులకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు అందించేలా కేంద్ర క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తున్న లబ్ధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు శివమ్మ, సబీనా మాట్లాడుతూ ఇల్లు మంజూరు చేసిన  దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు పొందిన లబ్దిదారు  శ్రీమతి రమణమ్మ  ఇంటి ముందు కేంద్ర సహాయ మంత్రి మొక్కలు నాటారు. శివమ్మ ఇల్లు చాలా బాగుందని కేంద్ర సహాయ మంత్రి ప్రశంసించారు.

ఈ కార్యక్రమాల్లో  జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిరక్షణ సంస్థ సీనియర్ అగ్రికల్చర్ ఇంజనీర్ కమలాబాయి, అగ్రికల్చర్ ఇంజనీర్లు చంద్రమౌళి, డిఎన్ దీక్షిత్, ఆర్డీఓ మధుసూదన్, వ్యవసాయ శాఖ జెడి చంద్రనాయక్, ఎపిఎంఐపి పిడి ఫిరోజ్, హార్టికల్చర్ డిడి పద్మలత, వ్యవసాయ అధికారి సోమశేఖర్హౌసింగ్ పిడి రాజశేఖర్హౌసింగ్, వివిధ శాఖల అధికారులురైతులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

 

***(Release ID: 1834589) Visitor Counter : 193