వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రూ. 120 కోట్ల నిధులతో అనంతపురం లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశాం: కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే


దేశంలో 180 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ప్రజలకు అందించాం

Posted On: 15 JUN 2022 10:40PM by PIB Hyderabad

అనంతపురం, 15 జూన్, 2022

 

అనంతపురంలో 120 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులను వ్యయం చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు.

బుధవారం అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్ రే, ఆల్ట్రా సౌండ్, కన్సోల్ గదిని, మొదటి అంతస్తులో  ఐసీయూ కాంప్లెక్స్, రెండవ అంతస్తులో నాడీ శస్త్రచికిత్స ఐపీ వార్డు, తదితర విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఐసీయూ, సాధారణ వార్డులలో చికిత్సపొందుతున్న రోగులతో వైద్య సేవల పట్ల కేంద్ర మంత్రి ఆరా తీశారు. రోగులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, భోజనం అందిస్తున్నారా, వార్డులను శుభ్రం చేశారా, ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు ఏమైనా డబ్బులు ఇచ్చారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అందుతున్న వైద్యసేవలు పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారని రోగులు కేంద్ర మంత్రికి తెలిపారు.

అంతకుముందు కేంద్ర సహాయ మంత్రికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగిందన్నారు. కరోనా వేళ తొలుత మాస్కులు గురించి ఎవరికి తెలియవని, ఆ సమయంలో తొలిసారిగా మాస్కులు చూడడం, ధరించడం జరిగిందన్నారు. కరోనా సోకిన తొలినాళ్లలో మనదేశంలో మాస్కులు తయారీ కూడా లేదని, అలాంటి స్థితి నుంచి విదేశాలకు సైతం మాస్కులను ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. కరోనా సమయంలో ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, దేశంలో ఉన్న జనాభాకు తగ్గట్టుగా వెంటిలేటర్లు ఏర్పాటు చేయడం చాలా కష్టంగా ఉండేదన్నారు. కరోనా సమయంలో అనంతపురం జిల్లాలో కూడా 1,600 మంది రోగులు చనిపోవడం జరిగిందన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆస్పత్రులను బలోపేతం చేయడమే మార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడం జరిగిందని, ఎక్కువ శాతం వెంటిలేటర్లు ఆస్పత్రులకు సరఫరా చేయడం, అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని పెంచడం, బెడ్ల సామర్థ్యాన్ని పెంచేలా ప్రధాని చర్యలు తీసుకున్నారన్నారు. అందులో భాగంగానే వెనుకబడిన అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన - 3 (పిఎంఎస్ఎస్ వై - 3) కింద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హృద్రోగ బాధితులకు కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ తదితర సేవలను అందించడం జరుగుతోందన్నారు. ఇలాంటి ఆసుపత్రిని సందర్శించడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. ఇక్కడ చికిత్సపొందుతున్న రోగులలో తాను మాట్లాడటం జరిగిందన్నారు. ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఉచితంగానే వైద్య సేవలు పొందుతున్నామని తనకు తెలియజేశారన్నారు. ఈ ఆస్పత్రిలో భోజనం మొదలుకుని మందులు, ఆపరేషన్లు, చికిత్స పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు వారు తెలిపారన్నారు. ఈ ఆస్పత్రిలో 120 సాధారణ బెడ్ లు, 40 ఐసీయూ బెడ్లు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ మంచి వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు అందుబాటులో ఉండి వైద్య చికిత్సలు అందిస్తున్నారన్నారు. ఇక్కడ టెక్నీషియన్ల అవసరం ఉందని, వారిని భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని తాను సూచించడం జరిగిందన్నారు. ఉచితంగా మందులు, భోజనం, వైద్యసేవలు, ఆపరేషన్లు, చికిత్స అందిస్తున్న ఇలాంటి ఆసుపత్రిని ఏర్పాటు పట్ల ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ అందుతున్న వైద్యసేవల పట్ల రోగులు సంతోషం వ్యక్తం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆసుపత్రిలో వైద్య బృందమంతా రోగులను చాలా మంచిగా చూసుకుంటున్నారని, అందిస్తున్న వైద్య సేవల పట్ల రోగులు సంతోషం వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 కోట్ల రూపాయలతో అధునాతనమైన సీటి స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి సాంకేతికత ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా లేదన్నారు. ఆ యంత్రం ద్వారా గుండె, తల భాగాలలో ఏర్పడ్డ సమస్యలను గుర్తించడం ద్వారా వైద్య చికిత్సలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఈ జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఉపయోగించుకోవాలన్నారు. తాను సిక్కిం, ఒరిస్సా తర్వాత అనంతపురం జిల్లా పర్యటనకు రావడం జరిగిందని తెలిపారు. గురువారం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.

దేశంలో 6 ఎయిమ్స్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో ఆంధ్ర రాష్ట్రంలోని మంగళగిరిలో ఒక ఎయిమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ లో ఒక ఏడాది నుండి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మన శాస్త్రవేత్తలు మనదేశంలోనే కేవలం 11 నెలల వ్యవధిలోనే కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయడం జరిగిందన్నారు. ఇలాంటివి గతంలో ఎన్నడూ జరగలేదని, బయట దేశాల నుంచే వ్యాక్సిన్లు పొందేవారమన్నారు. అలాంటి స్థితి నుంచి ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్ ను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందన్నారు. మందులతోపాటు వెంటిలేటర్ లను కూడా ఇతర దేశాలకు సరఫరా చేశామన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందిందన్నారు. ఉచితంగా 180 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించామన్నారు. ఇందులో మొదటి డోసు 97 శాతం, రెండవ డోసు 87 శాతం, బూస్టర్ డోస్ 20 కోట్లు అందించామని తెలిపారు. ఎక్కువ శాతం దేశంలో కరోనా వ్యాక్సిన్ అందజేయడం వల్ల ఇతర దేశాలతో బేరీజు వేసుకుంటే భారత దేశంలో కరోనా మరణాలు తక్కువగా నమోదయ్యాయన్నారు. గత ఏడాది కరోనా వ్యాక్సిన్ మరియు రీసెర్చ్ కోసం 35 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆత్మ నిర్బర్ భారత్ దిశగా మన దేశం నిలిచిందని, వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందిని ప్రతి జిల్లాలో ఎంత అవసరమో అంత మేరకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడ్పాటు అందించాలన్నారు.

దేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది తక్కువగా ఉన్నారని అందువల్ల ప్రతి రాష్ట్రానికి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాలను కేటాయించిందన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. జనాభా అధికంగా ఉన్న భారత దేశంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ ఇవ్వడం వల్ల ఎంతగానో లాభం కలుగుతుందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా భారి నుండి ప్రజలను రక్షించేందుకు ఎంతగానో కృషి చేశారని...  రాష్ట్రాలతో కలిసి కేంద్రం పని చేయాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో చూపించాల్సి ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం వెనుకబడి ఉందో దాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వచ్చేందుకు దేశ ప్రధాని కృషి చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నీరజ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్, ఆర్డీఓ మధుసూదన్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ రాజగోపాల్, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

***



(Release ID: 1834403) Visitor Counter : 119