సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్


Posted On: 15 JUN 2022 6:48PM by PIB Hyderabad

క్షేత్త్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, మత్స్య, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ అధికారులను ఆదేశించారు.

కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బుధవారం ఉదయం కాకినాడ నగరపాలక సంస్థలోని 26వ వార్డులో స్వచ్ఛ భారత్ లో భాగంగా   సచివాలయాన్ని  మంత్రి శుభ్రం చేశారు. స్థానిక నాగరాజుపేట లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసారు. ఆయా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

కాకినాడ స్మార్ట్ సిటీ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ ని సందర్శించిన మంత్రికి, స్మార్ట్ సిటీస్ మిషన్ (SCM) నిధుల వినియోగం పై జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.  స్మార్ట్ సిటీస్ మిషన్ (SCM) నిధులు సమర్థవంతం గా వినియోగించాలని  అధికారులకు  సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మొక్కని నాటారు.

కాకినాడ నగర పాలక సంస్థ పరిధి లోని 36వ వార్డులో వార్డు సచివాలయాన్ని సందర్శించిన మంత్రి అధికారులతో మాట్లాడారు.  రెల్లిపేట లోని 31వ వార్డులో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని సందర్శించి ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు లభిస్తున్న సేవల గురించి వివరించారు.  ప్రధాన మంత్రి మాతృవందన యోజన పధకం అమలవుతున్న విధానాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న పధకాలను సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు.

సామర్లకోట మండలం, ఉండూరు గ్రామంలో "రైతు భరోసా" కేంద్రాన్ని సందర్శించిన  మంత్రి లబ్దిదారులతో మాట్లాడారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులు లబ్దిపొందాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు అందిస్తున్న ఎరువులు, క్రిమిసంహారక మందుల గురించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సామర్లకోట మండలం, హౌసింగ్ కాలనీ లో నిర్మించిన మోడల్ హౌస్ ని మంత్రి సందర్శించారు. "పీఎంఏవై" (అర్బన్) పధకం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం  అర్హులైన అందరికి గృహాలను అందిస్తోందన్న మంత్రి, ఈ పధకం ద్వారా గృహాలు పొందిన లబ్దిదారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ప్రసంగించారు.

జల్ జీవన్ మిషన్ పధకం ద్వారా ప్రతీ ఇంటికీ సురక్షితమైన మంచినీటిని కుళాయిలు ద్వారా అందజేయడం జరుగుతోందన్నారు.

కోవిడ్ మహమ్మారి సమయం లో సైతం జన్-ధన్ ఖాతా దారులందరికీ మూడు పర్యాయాలు రూ. 500 చొప్పున రూ.1500 కేంద్ర ప్రభుత్వం అందచేసిందన్నారు.

ఉజ్వల యోజన పధకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు రాయతీలో గ్యాస్ సిలండర్లు అందజేయడం జరుగుతోందన్నారు.

ఈ పర్యటనలో మంత్రితో పాటు కాకినాడ  ఎంపీ  వంగా గీత విశ్వనాథ్, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ కృతికా శుక్లా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

***



(Release ID: 1834332) Visitor Counter : 156


Read this release in: English