కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు

Posted On: 07 FEB 2022 5:48PM by PIB Hyderabad

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించడం, మెరుగైన ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈ రెండు అంశాల సాధనకు కేంద్రం ఆధ్వర్యంలోని వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను చేపడుతోంది. కేంద్ర సౌజన్యంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.), దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (డి.ఎ.వై.-ఎన్.ఆర్.ఎల్.ఎం.), దీనదయాళ్ ఉపాధ్యాయ-గ్రామీణ కౌశల్య యోజన (డి.డి.యు.-జి.కె.వై.), ప్రధానమంత్రి గ్రామ షడక్ యోజన (పి.ఎం.జి.ఎస్.వై.), శ్యామ ప్రసాద్ ముఖర్జీ గ్రామీణ పట్టణ మిషన్, నేషనల్ కెరీస్ సర్వీస్ (ఎన్.సి.ఎస్.) వంటి పథకాలు అమలవుతూ వస్తున్నాయి.

   ఈ పథకాలకు తోడుగా, దేశంలో ఉపాధి కల్పనా ప్రక్రియను బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం మరెన్నో చర్యలు తీసుకుంది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో దెబ్బతిన్న వాణిజ్య కార్యకలాపాలకు ఉపశమనం, ఉద్దీపన కలిగించేందుకు ఆత్మనిర్భర భారత్ పేరిట ఒక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద, రూ. 27లక్షల కోట్లమేర భారీ స్థాయి ఉద్దీపనను ప్రభుత్వం అందిస్తోంది. దేశాన్ని స్వావలంబనతో తీర్చిదిద్ది, ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో అనేక దీర్ఘ కాలిక పథకాలను, కార్యక్రమాలను, విధానాలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు.

  ఈ క్రమంలో 125 రోజుల వ్యవధితో కూడిన గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన (జి.కె.ఆర్.ఎ.) అనే పథకాన్ని ప్రభుత్వం 2020 జూన్ నెల 20న ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా  ఉపాధి కోల్పోయి నిస్సహాయ స్థితిలో స్వస్థలాలకు తిరిగివచ్చిన వలస కూలీలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పియిన యువజనులకు  ఉపాధి, జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం చేపట్టారు. దేశంలోని 6 రాష్టాల పరిధిలోని 116 ఎంపిక చేసిన జిల్లాల బాధితులకు ప్రయోజనం కలిగించేందుక ఈ పథకం చేపట్టారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని బాధితులకోసం ఈ పథకం అమలు జరిపారు. జి.కె.ఆర్.ఎ. పథకం కింద రూ. 39,293కోట్ల వ్యయంతో 50.78కోట్ల పని దినాలను కల్పించడం ద్వారా ఉపాధి, జీవనోపాధి కల్పన లక్ష్యాలను సాధించారు.

   ఇక ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ 3వ దశలో భాగంగా,..ఆత్మనిర్భర భారత్ రోజ్ గార్ యోజన (ఎ.బి.ఆర్.వై.) పథకాన్ని 2020 అక్టోబరు ఒకటవ తేదీనుంచి చేపట్టారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఉపాధి దెబ్బతిన్న నేపథ్యంలో, నష్టపోయిన యాజమాన్యాలు తిరిగి ఉపాధి అవకాశాలను సృష్టించేలా తగిన  ప్రోత్సాహకాలను అందించేందుకు, సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు, ఉపాధి అవకాశాలను పునరుద్ధరించేందుకు ఎ.బి.ఆర్.వై. పథకాన్ని చేపట్టారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దెబ్బతిన్న యాజమాన్యాలపై ఆర్థిక భారాన్ని తగ్గించి, మరింత మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పించేలా సదరు యాజమాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం చేపట్టారు. ఈ పథకం కింద లబ్ధిదారులను నమోదుకు ఆఖరు తేదీని 2021 జూన్ 30వ తేదీనుంచి 2022 మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీవరకూ అందిన సమాచారం ప్రకారం,..  ఈ పథకం కింద రూ. 3,435కోట్లను అందించారు. 1.26లక్షలసంస్థల ద్వారా 46.89మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చారు.

  కోవిడ్ వ్యాప్తితో తీవ్రంగా దెబ్బతిన్న వీధి వ్యాపారాల పునరుద్ధరణ లక్ష్యంగా ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర నిధి (పి.ఎం.స్వానిధి) పేరిట మరో పథకాన్ని 2020 జూన్ 1వ తేదీ ప్రారంభించారు. వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించేలా తగిన పెట్టుబడిని అందించేందుకు, పట్టణాల్లో వీధి వ్యాపారాలను పునరుద్ధరించేందుకు ఈ పథకం చేపట్టారు. ఈ పథకం కింద 2021 నవంబరు నెలాఖరు నాటికి 32.2లక్షలమంది వీధి వ్యాపారులకు రూ. 3,054కోట్ల మేర రుణాలను అందించారు.

  స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజన (పి.ఎం.ఎం.వై.) పేరిట మరో పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న వాణిజ్య సంస్థలకు, వ్యక్తులు తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు, విస్తరించుకునేందుకు రూ. 10లక్షల వరకూ రుణాలను తనఖా లేకుండానే అందించారు. ఈ ఏడాది జనవరి 21వ తేదీవరకూ అందిన సమాచారం ప్రకారం ఈ పథకం కింద రూ. 32.12కోట్ల మేర రుణాలను మంజూరు చేశారు. ఇక ఉత్పాదకతతో అనుసంధానించిన ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు పథకాల ద్వారా దేశంలో కొత్తగా 60లక్షల వరకూ ఉద్యోగాలను సృష్టించగలిగారు.

  ఆర్థిక ప్రగతి, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా పి.ఎం. గతశక్తి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం కింద రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజారవాణా, జల రవాణా మార్గాలు, లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు వంటి రంగాలను ప్రోత్సహించాలని నిర్దేశించుకున్నారు. దీనితో స్వచ్ఛమైన ఇంధన వినియోగం, భారీ స్థాయిలో అందరికీ ఉద్యోగ అవకాశాలు, ఔత్సాహిక వాణిజ్య, పారిశ్రామిక అవకాశాలను పెంపొందించారు.

   కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (పి.ఎం.ఇ.జి.పి.), కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (డి.ఎ.వై.-ఎన్.యు.ఎల్.ఎం.)  పథకం చేపట్టారు. గణనీయమైన పలు పెట్టుబడులకు, ప్రభుత్వ పెట్టుబడులకు తగిన ప్రోత్సాహం అందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది.

ఈ పథకాలన్నింటితో పాటుగా, మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీ పథకం, అటల్ పట్టణ పరివర్తనా పునరుద్ధరణ పథకం, అందరికీ గృహవసతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి వంటి ఫ్లాగ్ షప్ పథకాలను కూడా ప్రభుత్వం చేపడుతోంది. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పథకాలన్నింటిని ప్రభుత్వం అమలు చేస్తోంది.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి రామేశ్వర తేలీ ఈ రోజు లోక్ సభకు ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

*****


(Release ID: 1796410)
Read this release in: English