ప్రధాన మంత్రి కార్యాలయం

డికోయా లో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ; నార్ వుడ్‌లో భార‌తీయ మూలాలున్న త‌మిళ సముదాయాన్ని ఉద్దేశించి ఆయన ప్ర‌సంగించారు

Posted On: 12 MAY 2017 4:22PM by PIB Hyderabad

శ్రీ‌లంక సెంట్ర‌ల్ ప్రావిన్స్‌లోని డికోయాలో  భార‌త ప్ర‌భుత్వ స‌హాయంతో నిర్మించిన‌ ఆసుపత్రిని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం ప్రారంభించారు. ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి స్వాగ‌తం ప‌లికేందుకు పెద్ద‌ సంఖ్య‌లో ప్ర‌జ‌లు రహదారికి ఇరువైపులా బారులు తీరి నిల‌బ‌డ్డారు.  అనంత‌రం ప్ర‌ధాన మంత్రి నార్ వుడ్‌ లో భార‌తీయ మూలాలు కలిగిన త‌మిళ సముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌ లంక అధ్య‌క్షుడు, శ్రీ‌లంక ప్ర‌ధాని, పెద్ద‌సంఖ్య‌లో వివిధ వ‌ర్గాల నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి త‌మ ప్ర‌సంగంలో శ్రీ‌ లంక అభివృద్ధిలో భార‌త సంత‌తి త‌మిళుల కృషి ని గురించి, భార‌తదేశం, శ్రీ ‌లంక‌ ల మ‌ధ్య గ‌ల సుదీర్ఘ ఉమ్మ‌డి వార‌స‌త్వాన్ని గురించి ప్ర‌స్తావించారు.  సిలోన్ వ‌ర్క‌ర్స్ కాంగ్రెస్‌, త‌మిళ్ ప్రోగ్రెసివ్ అల‌యెన్స్ ప్ర‌తినిధుల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి క‌లుసుకున్నారు.  సెంట్ర‌ల్ శ్రీ ‌లంక‌ కు చెందిన సుమారు 30 వేల మంది భార‌త సంత‌తి త‌మిళులను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..
 
ఈ రోజు ఇక్క‌డ మీ స‌మ‌క్షంలో ఉండ‌డం ఎంతో ఆనందంగా ఉంది.
మీ హృద‌య పూర్వ‌క సాద‌ర‌ స్వాగ‌తానికి నా కృత‌జ్ఞ‌త‌లు. 

శ్రీ‌ లంక‌ లోని ఈ అద్భుత ప్రాంతానికి విచ్చేసిన తొలి ప్ర‌ధాన‌ మంత్రిగా ఇది నాకు గొప్ప గౌర‌వం.  ఇంకా, మీతో మాట్లాడే అవ‌కాశం రావ‌డం మ‌రింత గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. 

ఇక్క‌డి సార‌వంత‌మైన మ‌ట్టి నుండి వ‌చ్చిన ప్ర‌ఖ్యాత సిలోన్ టీ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు తెలుసు.  అయితే ప్ర‌పంచ‌మంతటా ల‌క్ష‌లాది మంది కోరుకునే ఈ టీ వెనుక‌ మీ స్వేదం, శ్ర‌మ ఉన్నాయన్న విష‌యం త‌క్కువ‌ మందికి తెలుసు.

ఈ రోజు శ్రీ ‌లంక చాయ్ ఎగుమ‌తుల‌లో మూడ‌వ అతి పెద్ద ఎగుమ‌తి దారుగా ఉందంటే, అందుకు మీ క‌ఠోర‌ శ్ర‌మే కార‌ణం.

తేయాకు కు ఉన్న ప్ర‌పంచ డిమాండ్‌లో సుమారు 17 శాతం శ్రీ‌ లంక స‌మ‌కూర్చగ‌లగ‌డంలో మీ ప్రేమ‌పూర్వ‌కమైనటువంటి శ్ర‌మే కీల‌కం. విదేశీ మార‌క ద్ర‌వ్యం రూపంలో 1.5 బిలియ‌న్ డాల‌ర్లను శ్రీ ‌లంక‌ ఆర్జించ‌గ‌లుగుతోంది.

తేయాకు ప‌రిశ్ర‌మ‌ సాధించిన విజ‌యానికి, అంత‌ర్జాతీయంగా ఎగుమ‌తుల‌లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి సాధించ‌డానికి మీరు వెన్నెముక లాంటి వారు.

శ్రీ ‌లంక లోపల, శ్రీ లంకకు వెలుప‌ల మీ కృషికి మంచి గుర్తింపు ఉంది.

మీ కృషిని నేను అభినందిస్తున్నాను.

మీకు, నాకు కొంత‌ సామ్యం ఉంది.

మీలో కొంద‌రు వినే ఉంటారు, నాకు టీ తోప్ర‌త్యేక అనుబంధం ఉందని.

‘చాయ్ పే చ‌ర్చ’ కేవ‌లం ఒక నినాదం కాదు.

నిజాయితీతో కూడిన శ్ర‌మ ప‌ట్ల గ‌ల అపార‌మైన గౌర‌వానికి ఇది నిద‌ర్శ‌నం.

ఈ రోజు మ‌నం మీ పూర్వీకుల‌ను స్మ‌రించుకుంటున్నాం. నాడు ఇండియా నుండి సిలోన్‌కు  వ‌చ్చిన వారి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌, ధైర్యం, కృషి మ‌రువ‌లేనివి.  వారి ప్ర‌యాణం క‌ఠిన‌మైన‌ది, వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అయినా వారు ప‌ట్టుద‌ల వీడ‌లేదు.
ఈ రోజు మ‌నం వారిని స్మ‌రించుకుంటూ, వారి స్ఫూర్తికి వంద‌నాలు చేస్తున్నాం.

మీ త‌రం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

కొత్త‌గా స్వాతంత్ర్యం పొందిన దేశంలో మీ ప్ర‌త్యేక‌త‌ను, గుర్తింపును చాటుకోవ‌డానికి మీరు గ‌ట్టి స‌వాళ్లు ఎదుర్కొన్నారు.
 
అయితే వాటిని మీరు ఎంతో గంభీరంగా ఎదుర్కొన్నారు.  మీరు మీ హ‌క్కుల కోసం పోరాడారు, దానిని మీరు ఎంతో శాంతియుతంగా సాగించారు.

మీ హ‌క్కుల కోసం, అభ్యున్న‌తి కోసం, ఆర్థిక సుసంప‌న్న‌త కోసం ఎంతగానో పోరాడిన సౌమ్య మూర్తి శ్రీ తొండ‌మాన్ వంటి నాయ‌కుల‌ను మ‌నం ఎన్న‌టికీ మ‌రిచిపోం.

సుప్ర‌సిద్ధ త‌మిళ పండితుడు క‌నియ‌న్ పుంగుంన్‌రానార్ ఏనాడో చెప్పారు, యాతుం ఊరే, యావ‌రుమ్ కెలిర్ అంటే ప్ర‌తి గ్రామం మ‌న స్వ‌గ్రామ‌మే, ప్ర‌తివారూ మ‌న బంధువులే అని.

మీరు వారి ప్ర‌వ‌చ‌నం లోని నిజమైన స్ఫూర్తిని  ప‌ట్టుకున్నారు.

మీరు శ్రీ‌లంక‌ను మీ స్వంత నివాసంగా చేసుకున్నారు. 
ఈ సుంద‌ర దేశపు సామాజిక జీవ‌నపు క‌ల‌నేత‌లో మీరు ప‌డుగూ పేక‌లా క‌లిసిపోయారు.

మీరు త‌మిళ త‌ల్లి బిడ్డ‌లు.

మీరు  ప్ర‌పంచంలో అతి ప్రాచీన భాష‌ల‌లో ఒక‌టైన త‌మిళంలో మాట్లాడుతారు. అంతేకాదు, మీలో చాలామంది సింహ‌ళ భాష కూడా మాట్లాడుతారు; ఇది ఒక గొప్ప గౌర‌వం.

భాష అనేది భావ వ్య‌క్తీక‌ర‌ణ‌కు మించిన ఉప‌క‌ర‌ణం. ఇది ఒక సంస్కృతిని నిర్వ‌చిస్తుంది, సంబంధాల‌ను క‌లుపుతుంది, సముదాయాల‌ను క‌లుపుతుంది, బ‌ల‌మైన ఐక్య‌తా శ‌క్తిగా ఉంటుంది.
భిన్న భాష‌ల స‌మాజం శాంతి, సామ‌ర‌స్యంతో స‌హ‌జీవ‌నం చేయ‌డం కంటే చూడ‌ముచ్చ‌టైంది మ‌రొక‌టి ఉండ‌దు.

భిన్న‌త్వం యొక్క గొప్పత‌నాన్ని ఉత్స‌వంలా జ‌రుపుకోవాలి కానీ ఘ‌ర్ష‌ణ ప‌డ‌కూడ‌దు.

మ‌న గ‌తం  అంతా శాంతియుత స‌హ‌జీవ‌నంతో అల్లుకుపోయింది.
ఎన్నో బౌద్ధ గ్రంథాలు, జాత‌క క‌థ‌లు మ‌హాపురుషుడు అగ‌స్త్యుని గురించి ప్ర‌స్తావించాయి.  వారిని త‌మిళ భాష‌కు పితామ‌హుడుగా చాలా మంది భావిస్తారు.

కాండీకి చెందిన సింహ‌ళ నాయ‌క రాజులకు మ‌దురై, తంజావూరు లలోని నాయ‌క రాజుల‌తో సంబంధాలు ఉన్నాయి.

సింహ‌ళ‌, త‌మిళ భాషలు రెండూ రాజ‌భాష‌లు.

ఇక్క‌డ హిందూ, బౌద్ధ మందిరాల‌ను గౌర‌వించి ఆరాధిస్తారు

ఈ ఐక్య‌త‌, స‌హ‌జీవ‌నానికి సంబంధించిన బంధాల‌ను బ‌లోపేతం చేయాలి తప్ప వేరు చేయ‌కూడదు.

అందుకు గ‌ట్టి కృషిని కొన‌సాగించ‌గ‌ల మంచి స్థితిలో మీరు ఉన్నారు. అందుకు మీ కృషిని కొన‌సాగించండి.

నేను భార‌త దేశంలో మ‌హాత్మ గాంధీ జన్మ‌స్థ‌ల‌మైన గుజ‌రాత్ రాష్ట్రం నుండి వ‌చ్చాను.

దాదాపు 90 సంవ‌త్స‌రాల క్రితం వారు శ్రీ ‌లంక‌ను సంద‌ర్శించారు. కాండీ, నువారా ఎలియా, మ‌తాలె, బ‌దుల్లా, బందార‌వేలా, హాట‌న్‌ ల‌లోనూ ప‌ర్య‌టించారు.

సామాజిక ఆర్థిక అభ్యున్న‌తిని గురించి ప్ర‌చారం చేయ‌డానికి మాత్ర‌మే వారు ఇక్క‌డికి వ‌చ్చారు.
ఆనాటి వారి రాక‌కు గుర్తుగా మ‌తాలేలో 2015లో భార‌త ప్ర‌భుత్వ స‌హాయంతో మ‌హాత్మ గాంధీ అంత‌ర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

ఇంకా చెప్పుకోవాలంటే, ‘పురచ్చి తలైవార్’ ఎమ్ జిఆర్ ఈ గ‌డ్డ‌ మీదే పుట్టారు. ఇది జీవిత ప‌ర్యంత బంధాన్ని ఏర్ప‌రుస్తోంది.  

ఇంకా ఇటీవ‌లి కాలంలో చెప్పుకుంటే మీరు ప్ర‌పంచం గ‌ర్వించ‌ద‌గ్గ క్రికెట్ స్పిన్న‌ర్ శ్రీ ముత్త‌య్య ముర‌ళీధర‌న్‌ను ప్ర‌పంచానికి అందించారు. మీ ప్ర‌గ‌తి మాకు గ‌ర్వ‌కార‌ణం.

మీరు వివిధ జీవ‌న వ్యాసంగాల‌లోసాధిస్తున్న విజ‌యాల‌ ప‌ట్ల మేం ఎంత‌గానో ఆనందిస్తాం. ప్ర‌పంచం న‌లుమూల‌లా భార‌తీయ‌ సంత‌తి ప్ర‌జ‌లు సాధిస్తున్న విజ‌యాలు హృదయం ఉప్పొంగేలా చేస్తాయి.

మీ నుండి అలాంటి మ‌రిన్ని విజ‌యాల‌ కోసం నేను ఎదురుచూస్తుంటాను.  

మీరు భార‌తదేశం, శ్రీ లంక‌ ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ముఖ్య‌మైన వార‌ధులు.

ఈ మ‌హాద్భుత దేశంతో నిరంత‌రాయ సంబంధాలలో భాగంగా మేం మిమ్మ‌ల్ని చూస్తాం.

ఇలాంటి సంబంధాల‌ను పెంపొందించ‌డం మా ప్ర‌భుత్వ ప్రాధాన్య‌ం.

మ‌న భాగ‌స్వామ్యం, మ‌న కృషి అంతిమంగా  భార‌త‌, శ్రీ‌లంక ల ప్ర‌జ‌లంద‌రి ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డే విధంగా ఉండాలి, మీ జీవితాల‌ను సుసంప‌న్నం చేయాలి.

మీరు భార‌తదేశంతో మీ బంధాన్ని స‌జీవంగా  కొన‌సాగిస్తున్నారు.
మీకు భార‌త దేశంలో బంధువులు , మిత్రులు ఉన్నారు.

భార‌తీయ పండ‌గ‌ల‌ను మీరు మీ స్వంత పండ‌గ‌లుగా జ‌రుపుకుంటారు.

మీరు మా సంస్కృతిలో మునిగి దానిని మీ దానిగా చేసుకున్నారు.
మీ హృద‌యాల‌లో భార‌తదేశం గుండె చ‌ప్పుడు వినిపిస్తుంది.

మీ హృద‌య‌పూర్వ‌క అభిమానానికి భార‌తదేశం అదే రీతిలో త‌న ప్ర‌తిస్పంద‌న‌ను తెలియ‌జేస్తోంద‌ని మీకు తెలియ‌జేసుకుంటున్నాను.

మీ సామాజిక ఆర్థిక అభ్యున్న‌తికి మేం  అన్ని విధాలా, నిర్వ‌రామంగా మా కృషి కొన‌సాగిస్తామ‌ని మీకు చెప్ప‌ద‌ల‌చుకున్నాను. 

మీ జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు శ్రీ‌ లంక ప్ర‌భుత్వం ఐదేళ్ల జాతీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌తో పాటు ప‌లు  క్రియాశీల‌ చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని నాకు తెల‌ుసు.
  
ఈ దిశ‌గా వారు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు భార‌తదేశం పూర్తి మ‌ద్ద‌తును తెలుపుతుంది.

మీ సంక్షేమం కోసం భార‌తదేశం కూడా శ్రీ ‌లంక ప్ర‌భుత్వంతో క‌లిసి ప్ర‌త్యేకించి విద్య‌, వైద్యం, సామాజిక అభివృద్ధి రంగాల‌లో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.  

ప్ర‌తిభ‌ గ‌ల విద్యార్థులు త‌మ చ‌దువు కొన‌సాగించ‌డానికి 1947లోనే సిలోన్ ఎస్టేట్ వ‌ర్క‌ర్స్ ఎడ్యుకేష‌న్ ట్ర‌స్ట్ (సిఇడ‌బ్ల్యుఇటి)ని ఏర్పాటు చేశారు. ఈ ప‌థ‌కం లో భాగంగా మేం ఏటా 700 ఉపకార వేతనాల‌ను శ్రీ‌ లంక‌,ఇండియా ల‌లో చ‌దువుకునే వారికి ఇస్తున్నాం.
మీ పిల్ల‌లు దీని ద్వారా ల‌బ్ధి పొందారు. 

ఇక జీవ‌నోపాధి, సామ‌ర్ధ్యాల క‌ల్ప‌న‌కు సంబంధించి మేం వృత్తివిద్యా శిక్ష‌ణ కేంద్రాలు, 10 ఆంగ్ల భాషాశిక్ష‌ణ కేంద్రాలు , నైపుణ్యశిక్ష‌ణ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. 

అలాగే మేం ప్లాంటేష‌న్ పాఠ‌శాల‌ల్లో కంప్యూట‌ర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు స‌హాయం చేశాం.

ఎన్నో ప్లాంటేష‌న్ పాఠ‌శాల‌ల స్థాయి పెంచ‌డానికి కృషి చేస్తున్నాం. 

భార‌త ప్ర‌భుత్వ స‌హాయంతో డికోయా లో నిర్మించిన 150 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి సముదాయాన్ని శ్రీ‌లంక అధ్య‌క్షుడు శ్రీ సిరిసేన‌, ప్ర‌ధాని శ్రీ రానిల్ విక్ర‌మ సింఘె, నేనూ క‌లిసి కొద్దిసేప‌టి క్రిత‌మే ప్ర‌జ‌ల‌కు అంకితం చేశాం.  ఇందులోని అధునాత‌న సౌక‌ర్యాలు ఈ ప్రాంత‌ ప్ర‌జ‌ల వైద్య అవ‌స‌రాల‌ను తీర్చనున్నాయి.
 అలాగే ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌, ద‌క్షిణ ప్రావిన్సుల‌లో అందుబాటులో ఉన్న‌1990 ఎమ‌ర్జెన్సీ అంబులెన్సుసేవ‌ల‌ను ఇత‌ర ప్రావిన్స్‌ల‌న్నింటికీ వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని తెల‌ప‌డానికి సంతోషిస్తున్నాను.  అలాగే భార‌తీయ ప‌విత్ర ఆరోగ్య సేవ‌ల సంప్ర‌దాయాలైన యోగ‌, ఆయుర్వేద‌ల‌ను మీతో పంచుకోవ‌డం సంతోషంగా ఉంది.

వ‌చ్చే నెల‌లో మ‌నం అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వాన్ని జ‌రుపుకోనున్నాం.  యోగ వల్ల క‌లిగే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌కు ప్రాచుర్యం క‌ల్పించ‌డంలో మీ క్రియాశీల‌క ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నాను.

శ్రీ‌ లంక‌ లో వినూత్న భార‌త గృహ‌నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల‌లో నాలుగువేల ఇళ్ల‌ను నిర్మించ‌నున్నారు.

తొలిసారిగా ల‌బ్ధిదారుల‌కు వారి ఇళ్లు క‌ట్టించిన భూమిపై వారికి హ‌క్కులు ద‌ఖ‌లు ప‌ర‌చ‌నున్నార‌ని తెల‌ప‌డానికి సంతోషిస్తున్నాను.
ఈ రంగంలో మాకృషి కొన‌సాగింపులో భాగంగా, ఈ ప్రాజెక్టు కింద అద‌నంగా ప‌దివేల ఇళ్ల‌ను వివిధ ప్రాంతాల‌లో నిర్మించ‌నున్నామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాను.

ఇంత‌కు ముందే నేను కొలంబో నుండి వారాణసీకి నేరుగా ఏర్ ఇండియా విమాన సేవ‌ల‌ను ప్ర‌క‌టించాను. దీనితో మీరు వారాణసీని సుల‌భంగా ద‌ర్శించుకుని ప‌ర‌మాత్మ శివుడి ఆశీస్సులు పొంద‌గ‌లుగుతారు.

శాంతి, సుసంప‌న్న‌త ల దిశ‌గా మీరు సాగించే ప్ర‌యాణానికి భార‌త ప్ర‌భుత్వం, భార‌తదేశ ప్ర‌జ‌లు మీకు అండ‌గా ఉన్నారు.

గ‌తం విసిరిన స‌వాళ్ల‌ను ఎదుర్కొని, ఆశావ‌హ భ‌విష్య‌త్తును సాకారం చేసుకోవ‌డానికి మీకు మేం సహాయం చేస్తాం.

కృషి , ప‌ట్టుద‌ల గ‌ల వ్య‌క్తి  చెంత‌కు సంప‌ద త‌నంత‌ట తానే వ‌చ్చి చేరుతుంద‌ని ప్ర‌ముఖ క‌వి తిరువ‌ళ్లువార్ ఏనాడో చెప్పారు. 

మీ స‌మున్న‌త వార‌స‌త్వం, మీ పిల్ల‌ల శ‌క్తి సామ‌ర్ధ్యాలు వారి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్తు మీకు ఉంటుంద‌ని నాకు గ‌ట్టి విశ్వాసం ఉంది.

ధ‌న్య‌వాదాలు, నండ్రి.
అనేకానేక ధ‌న్య‌వాదాలు

 

***



(Release ID: 1790066) Visitor Counter : 82


Read this release in: English