శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆవిష్కరణతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలలో ఒకటిగా భారతదేశం గుర్తింపు పొందింది... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్మార్ట్ టెక్ ఇండియాపై ఏర్పాటైన సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి
2021 డిసెంబర్ 3 నుంచి 15 వరకు న్యూ ఢిల్లీలో జరగనున్న స్మార్ట్ టెక్ ఇండియా రెండవ సదస్సు
అంకుర సంస్థలతో దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ అయ్యాయి.. గ్రామీణ ప్రాంతాలలో అంకుర సంస్థల ఏర్పాటు పుంజుకుంటోంది
లక్ష్యాలకు మించి ఈ ఏడాది దేశంలో 35 కొత్త యునికార్న్ అంకుర సంస్థల ఏర్పాటు... డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
17 NOV 2021 5:40PM by PIB Hyderabad
ఆవిష్కరణతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలలో ఒకటిగా భారతదేశం గుర్తింపు పొందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర , పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ ( స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీలో 2021 డిసెంబర్ 3 నుంచి 15 వరకు జరగనున్న “ది స్మార్ట్‌ఇండియా ఇనిషియేటివ్” 2వ ఎడిషన్ సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. అంకుర సంస్థలతో దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ అయ్యాయని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంకుర సంస్థల ఏర్పాటుకు అనుకూల వాతావరణం నెలకొందని అన్నారు. అనుకూల వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంకుర సంస్థలు ఎక్కువగా ఏర్పాటు అవుతున్నాయని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్ర స్థానంలో ఉన్న దేశాల సరసన భారతదేశం ఇటీవల స్థానం సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో మొదటి 50 దేశాల జాబితాలో భారత్ 46వ స్థానానికి చేరుకున్నదని మంత్రి తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని భారత అంకుర సంస్థల రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంచనాలకు మించి దేశంలో ఇంతవరకు నూతనంగా 35 యునికార్న్ అంకుర సంస్థలు ఏర్పడ్డాయని మంత్రి వివరించారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు అంకుర సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు అంకుర సంస్థల సంఖ్యతో పాటు వాటి వ్యాపారాన్ని కూడా ఎక్కువ చేశాయని అన్నారు. నవ భారత నిర్మాణ సాధనకు పరిశ్రమలు సంబంధిత వర్గాల మధ్య సహకారం మరింత పెరగాలని ఆయన అన్నారు.
ప్రపంచంలో భారతదేశ అంకుర సంస్థల రంగం మూడవ అతి పెద్ద రంగంగా గుర్తింపు పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. దేశంలో వివిధ దశల్లో అమలు జరుగుతున్న సహకార వ్యవస్థల సహకారంతో ఈ రంగ అభివృద్ధికి దోహద పడుతున్నాయని అన్నారు.
భారతదేశం కూడా తన వ్యాపారం మరియు ఆవిష్కరణల వాతావరణాన్ని స్థిరంగా మెరుగుపరుచుకుంటుందని, తాజా ప్రపంచ బ్యాంక్ వార్షిక రేటింగ్‌ల ప్రకారం వ్యాపారాన్ని సులభతరం చేసే 190 ఆర్థిక వ్యవస్థలలో ఇప్పుడు 63వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆవిష్కరణల వాతావరణాన్ని స్థిరంగా మెరుగుపరుచుకుంటున్నభారతదేశం ఈ రంగంలో వ్యాపార లావాదేవీల పరంగా కూడా అభివృద్ధి సాధిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన వార్షిక రేటింగ్‌ల ప్రకారం వ్యాపారాన్ని సులభతరం చేసే 190 ఆర్థిక వ్యవస్థలలో ఇప్పుడు భారత్ 63వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
అసోచమ్, నాస్కామ్, సీఐఐ, ఫిక్కీ లాంటి పారిశ్రామిక సంస్థలు దేశంలో అంకుర సంస్థల అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వీటితో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళజాతి సంస్థల నుంచి ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. డీఎస్టీ, డీబీటీ, డీఎస్ఐఆర్, డీఆర్డీవో, ఐసీఎంఆర్, ఎంఎస్ఎంఈ లాంటి మంత్రిత్వ శాఖలు అంకుర సంస్థల రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని అన్నారు.
గత ఏడాది నుంచి స్మార్ట్ టెక్ ఇండియా ఇన్నోవేషన్ నిర్వహణలో శాస్త్ర సాంకేతిక శాఖ సహకారం అందిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ఏడాది అసోచమ్ తో కలసి స్మార్ట్ టెక్ ఇండియా 2021 సదస్సు నిర్వహణకు సహకరిస్తున్నామని అన్నారు. నూతన ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించడానికి, భారత సాంకేతిక అంకుర సంస్థలకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చూడడానికి నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఎంఎస్ఎంఈ సంస్థలు, ఇతర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి.
క్లీన్ ఎనర్జీ జల రంగాల్లో - ముఖ్యంగా క్లీన్ కోల్ టెక్నాలజీ, మిథనాల్, సోలార్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్లు, స్మార్ట్ బిల్డింగ్లు, కర్బన విడుదల, వినియోగ రంగాల్లో తమ శాఖ సాంకేతిక మిషన్‌లను అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. దేశ మొత్తం కంప్యూటింగ్ సామర్థ్యాన్ని 45 పెటాఫ్లాప్‌లకు అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యంగా నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ ను శాస్త్ర సాంకేతిక శాఖ అమలు చేస్తున్నదని మంత్రి వెల్లడించారు.
సాంకేతిక ఆధారిత అంకుర సంస్థలకు మార్కెట్ అవకాశలు కల్పించి, వివిధ దశల ఆవిష్కరణలకు సహకారం అందించడానికి 2016లో శాస్త్ర సాంకేతిక శాఖ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నాదని మంత్రి గుర్తుచేశారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి స్వదేశీ పరిష్కారాలను అందించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో శాస్త్ర సాంకేతిక శాఖ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.
విమాన రక్షణ రంగాలు, ఆర్థిక సేవలు, ఆరోగ్య సౌకర్యాలు, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 మరియు స్మార్ట్ మొబిలిటీ వంటి బహుళ రంగాలలో ఈ ఆవిష్కరణలు విప్లవాన్ని సృష్టిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అమలు చేస్తున్న జాతీయ హైడ్రోజన్ మిషన్‌తో పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగం క్రమంగా మెరుగుపడుతుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1772746)
Visitor Counter : 163