గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘నూతన పట్టణ భారతదేశం’ పై -ఆజాదీ@75- విజయవంతం!
సమ్మేళనానికి, ప్రదర్శనకు భారీ ప్రతిస్పందన..
ఉత్సాహభరితంగా ముగిసిన 3రోజుల సంరంభం
Posted On:
07 OCT 2021 6:32PM by PIB Hyderabad
“నూతన పట్టణాలు, నగరాలతో కూడిన భారతదేశం, అంటే,.. భారతీయ పట్టణాలకు కొత్తరూపు,..అన్న అంశంపై 3 రోజులపాటు లక్నోలో మేథోమధనం జరిపేందుకు దేశం నలుమూలలనుంచి నిపుణులు వస్తున్నారనే భావన ఎంతో బాగుంది. ఈ సమ్మేళనం, ప్రదర్శన 75ఏళ్శ విజయాలను తప్పకుండా ప్రతిబింబిస్తాయి. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో దేశం తీసుకునే కొత్త తీర్మానాలనూ ఈ కార్యక్రమం ప్రతిఫలించి తీరుతుంది....”
ప్రారంభోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. ‘ఆజాదీ@75 – కొత్త పట్టణ భారతదేశం: నగర దృశ్యంలో పరివర్తన’ అన్న అంశంపై ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అక్టోబరు 5న సమ్మేళాన్ని, ఎగ్జిబిషన్ .ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. లక్నోలోని గాంధీ ప్రతిష్టాన్ ప్రాంగణంలో సదస్సు, ఎగ్జిబిషన్.లతో 3 రోజుల సంరంభం ఈ నెల 7న ముగిసింది. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు ముగుస్తున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. “భారతదేశ శక్తి సామర్థ్యాలను తేటతెల్లం చేసి, మన విశ్వాసాలను మేల్కొలిపే” కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని పరిగణించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆజాదీ@75 పేరిట నిర్వహించిన సదస్సుకు ఎగ్జిబిషన్.కు వివిధ భాగస్వామ్య వర్గాలనుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులనుంచి ఎంతో ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన లభించింది. ప్రారంభోత్సవం అనంతరం పలు కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. పలు రంగాలకు నిపుణులు, వక్తలతో సమాంతర సదస్సులను కూడా నిర్వహించారు. విభిన్నమైన ఫ్లాగ్ షిప్ పథకాల కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల పరిధిలోని పలు అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. నీటి రక్షణ నగరాలు, చిన్న, మధ్యతరహా అంతస్తుల ఇళ్ల నిర్మాణానికి సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం అమలు, స్మార్ట్ నగరాల నిర్మాణ కార్యక్రమం ద్వారా పట్టణ పరివర్తన, వందేళ్ల స్వాతంత్ర్యం అనంతరం మెట్రో రైలు రవాణా వ్యవస్థ, మురికి వాడలులేని నగరాలు, సమ్మిళిత గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థను (ఆర్.ఇ.ఆర్.ఎ.ను) బలోపేతం చేయడం, మార్కెట్లోని అగ్రశ్రేణి సంస్థల భాగస్వామ్యంతో స్మార్ట్ సిటీ కార్యకలాపాల కేంద్రాల నిర్వహణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో జీవనోపాధికి సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై ఈ సమ్మేళనంలో వివిధ రంగాల నిపుణులు విస్తృతంగా చర్చించారు. మెరుగైన దృక్కోణంలో పట్టణీకరణ కార్యక్రమాలను, పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా చర్చ జరిగింది.
పట్టణ పథకాల విజయాలు, భవిష్యత్తలో చేపట్టదలచిన పట్టణ పరవర్తనా కార్యక్రమాలను విశదీకరిస్తూ ఆజాదీ@75 పేరిట జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్.ను ఈ సందర్భంగా నిర్వహించారు. ప్రపంచ గృహనిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సవాళ్లు-భారతదేశం (జి.హెచ్.టి.సి.-భారతదేశం) పేరిట ప్రదర్శనను,..75రకాల సృజనాత్మక నిర్మాణరంగ టెక్నాలజీలను వివరిస్తూ ‘భారతీయ గృహనిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన మేళా (ఐ.హెచ్.టి.ఎం.)’ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సృజనాత్మక నిర్మాణ రంగ సాంకేతిక పరిజ్ఞానాలను, ప్రక్రియలను గురించి ఈ ప్రదర్శనల్లో వివరించారు. పట్టణ ప్రాంతాలకు ప్రత్యేకించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించే ఇళ్లు, ఇతర చిన్న, మధ్యతరహా అంతస్తుల ఇళ్ల నిర్మాణానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. పట్టణీకరణ కార్యక్రమాల కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పలు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను వివరిస్తూ మరో ఎగ్జిబిషన్.ను కూడా నిర్వహించారు. ‘ఉత్తర ప్రదేశ్ లో పట్టణీకరణను పరివర్తన చెందించడం’ అనే అంశంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
ఈ జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ ను తిలకించడానికి ఆక్టోబరు 6వ తేదీనుంచి సందర్శకులను అనుమతిస్తున్నారు. సందర్శకులనుంచి, భాగస్వామ్య వర్గాలనుంచి ఈ ఎగ్జిబిషన్.ను భారీ ప్రతిస్పందన లభిస్తోంది. వివిధ పథకాలను, సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్య సంస్థలను గురించి తెలుసుకోవడానికి సందర్శకులు ప్రదర్శనలోని వివిధ స్టాళ్లను ఉత్సాహంగా తిలకిస్తున్నారు.
ఐ.హెచ్.టి.ఎం. ప్రదర్శనలో దేశం నలుమూలలనుంచి ప్రభుత్వరంగం, ప్రైవేటురంగం తరఫున భాగస్వామ్య ప్రతినిధులు పాలుపంచుకున్నారు; సాంకేతిక పరిజ్ఞాన్ని అందించిన సంస్థల తరఫున, తయారీదార్ల, నిర్మాణకేంద్రాల ప్రతినిధులు, ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి. సంస్థలు, పరిశోధనా అభివృద్ధి సంస్థల సృజనాత్మక నిపుణలు, వివిధ రాష్ట్రాల, స్థానిక పరిపాలనా సంస్థల తరఫున ప్రతినిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)ను అమలు చేసే సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -ప్రపంచ గృహనిర్మాణ సాంకేతిక రంగం సవాళ్లు, భారతదేశం- పేరిట ఆరు విభిన్న రాష్ట్రాల్లో చేపట్టిన లైట్ హౌస్ ప్రాజెక్టుల (ఎల్.హెచ్.పి.ల) నిర్మాణంలో పాలుపంచుకునే సంస్థలు కూడా ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నాయి. ఈ లైట్ హౌస్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీన శంకుస్థాపన చేశారు.
ఐ.హెచ్.టి.ఎం. పేరిట నిర్వహించిన ఎక్స్.పోలో చిన్న తరహా, మధ్యతరహా అంతస్తుల ఇళ్ల నిర్మాణంలో అనుసరించే 79 రకాల సాంకేతిక పరిజ్ఞాన అంశాలను ప్రదర్శించారు. ఈ పరిజ్ఞాన అంశాలపై,.. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ (టి.ఇ.సి.) మధింపు చేస్తోంది.
అక్టోబరు 7వ తేదీ, గురువారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అశుతోష్ టాండన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీ, ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రజనీశ్ దూబే తదితరులు పాల్గొన్నారు.
ముగింపు కార్యక్రమంలో అశుతోష్ టాండన్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో చోదక శక్తిగా పనిచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్), స్మార్ట్ నగరాల పథకం, పి.ఎం. స్వానిధి, ఇతర పట్టణ ఫ్లాగ్ షిప్ పథకాల అమలులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని గురించి టాండన్ వివరించారు. అమృత్ (AMRUT), స్వచ్ఛ భారత్ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రధానమంత్రి దార్శనిక భావాలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఎలా దోహదపడ్డాయో మంత్రి వివరించారు. ఆజాదీ@75 పేరిట నిర్వహించిన సదస్సు, ప్రదర్శన సందర్భంగా వివిధ సమ్మేళనాల్లో ప్రముఖ వక్తలు ప్రస్తావించిన, చర్చించిన అంశాలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దోహదకారులుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సదస్సును, ఎగ్జిబిషన్.ను విజయవంతంగా నిర్వహించడంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన కృషి ఎంతో అభినందనీయమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సౌకర్యవంతమైన జీవనాన్ని కొనసాగించేందుకు వీలుగా జీవనయోగ్యమైన సుస్థిర సానుకూల వ్యవస్థలను సృష్టించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాల ప్రయోజనాలకోసం ప్రదర్శించిన సృజనాత్మకమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలు ప్రజలకు చేరేలా తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ముగింపు సమావేశంలో ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రజనీశ్ దూబే మాట్లాడుతూ, ‘భారతదేశం అంతా ఒక్కటే’ అన్న భావనను ఈ కార్యక్రమం ప్రతిబింబించిదన్నారు. ఆజాదీ @75 సమ్మేళనంలో, ప్రదర్శనలో కాశ్మీర్.నుంచి కన్యాకుమారి వరకూ.., మణిపూర్.నుంచి గుజరాత్ వరకూ పలువురు నిపుణులు ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నారని అన్నారు.
****
(Release ID: 1762001)
Visitor Counter : 287