జల శక్తి మంత్రిత్వ శాఖ

'స్వచ్ఛ గంగా' నిధికి రూ.42.8 లక్షల విరాళం

Posted On: 23 SEP 2021 7:27PM by PIB Hyderabad

ప‌విత్ర గంగానది పరిరక్షణ మరియు పునరుజ్జీవనం కార్య‌క్ర‌మానికి 2014 నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేతృత్వంలోని  ప్రభుత్వం  ప్రాధాన్యతనిస్తూ వ‌స్తోంది. శ్రీ న‌రేంద్ర మోడీ స‌ర్కారు చేప‌ట్టిన  ప్ర‌ధాన కార్యక్రమం - 'నమామి గంగే'. గంగా న‌దిని కాలుష్య ర‌హితంగా చేయడం ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి సంబంధించిన క్లీన్ గంగా ఫండ్ ప్రజలు మరియు కార్పొరేషన్ల‌నూ ఆకర్షించడం ప్రారంభించింది.  గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది వ్యక్తులు, కంపెనీలు, పీఎస్‌యు లు మరియు మతపరమైన ట్రస్టులు క్లీన్ గంగా ఫండ్‌కు నిధుల‌ను స‌మ‌కూర్చి త‌మవంతు  సహకారం అందించారు. ట్రింబుల్ గ్రూప్‌కు చెందిన‌  ట్రింబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్  లిమిటెడ్ (టీఎంఎస్ఐపీ) రూ. 42.8 లక్షల నిధుల‌ను క్లీన్ గంగా ఫండ్‌కు అందించింది. సంస్థ ఫైనాన్స్ విభాగం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సుధీర్ ఆర్. కామత్, ఆప‌రేష‌న్స్ విభాగం భార‌త శాఖ డైరెక్ట‌ర్ శ్రీ సుదర్శన్ మోహన్‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. టీఎంఎస్‌ఐపీ సంస్థ త‌ర‌ఫున రూ.42.9 ల‌క్ష‌ల‌ డిమాండ్ డ్రాఫ్ట్‌ను సంస్థ అధికారులు క్లీన్ గంగా జాతీయ మిష‌న్ (ఎన్ఎంసీజీ) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్  శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రాకు అందించారు. జాతీయ నది గంగా పునరుజ్జీవనానికి ప్రతిఒక్కరి సహకార కృషి అవసరమని, ఈ దిశగా ఆయా కార్పొరేట్ సంస్థలు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని డీజీ, ఎన్‌ఎంసీజీ అన్నారు. టీఎంఎస్ఐపీ అందించిన ఈ త‌ర‌హా  సహకారాన్ని ఆయ‌న అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీఎంఎస్ఐపీకి  త‌న‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయత్నాలు గంగా పునరుజ్జీవనం కోసం చేతులు కలిపేందుకు ఇతర కార్పొరేట్ సంస్థల‌నూ ప్రోత్సహిస్తాయని అన్నారు. ఈ సంస్థ జియో స్పేషియల్ టెక్నాలజీలో పాలుపంచుకుంటుంది. దీంతో నమామి గంగా  కార్య‌క్ర‌మంలో ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి  ఎల్ఐడీఏఆర్ మ్యాపింగ్ వంటి అనేక ర‌కాల టెక్నాల‌జీని వాడుకొనేందుకు కూడా ఇది ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. ఇటీవల ప్రధాన మంత్రి మాట్లాడుతూ తాను అందుకున్న బహుమతులు మరియు మెమెంటోల ఈ-వేలంలో పాల్గొనమని ప్రజలను కోరారు. టోక్యో ఒలింపిక్స్ మరియు టోక్యో పారాలింపిక్స్ హీరోలు ప్రధానికి ఇచ్చిన ప్రత్యేక మెమెంటోలు కూడా ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్లీన్ గంగా ఫండ్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది.
                                                       

*****



(Release ID: 1757472) Visitor Counter : 116


Read this release in: English , Hindi