జల శక్తి మంత్రిత్వ శాఖ

జార్ఖండ్‌ ను సందర్శించిన - జాతీయ జల్ జీవన్ మిషన్ బృందం


2021-22 లో జార్ఖండ్‌ లో జె.జె.ఎం. అమలు కోసం 2,479.88 కోట్ల రూపాయలకు పెరిగిన - కేంద్ర నిధుల కేటాయింపు

Posted On: 07 SEP 2021 4:43PM by PIB Hyderabad

జాతీయ జల్-జీవన్-మిషన్ కు చెందిన వివిధ రంగాల వ్యక్తులతో కూడిన ఒక బృందం 2021 సెప్టెంబర్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు జార్ఖండ్‌ లోని రాంచీ, ధన్బాద్, కుంతి, హజారీబాగ్ నాలుగు జిల్లాల్లో సందర్శిస్తోంది.  రాష్ట్రంలో పర్యటన సందర్భంగా, ఎన్.జె.జె.ఎం. బృందం సభ్యులు ప్రతి రోజూ, వీలును బట్టి, జిల్లాల్లోని 3 నుండి 5 గ్రామాలను సందర్శిస్తున్నారు.  ఈ బృందం సభ్యులు, రాష్ట్రంలో మిషన్ అమలు, పురోగతికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారు.  క్షేత్ర స్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవడం, వంద శాతం గృహాలకు కుళాయిల  ద్వారా నీటి సరఫరా అందించడం కోసం రూపొందించవలసిన ప్రణాళిక గురించి వారు చర్చించనున్నారు.  ఇందుకోసం వారు జిల్లా అధికారులు, స్థానిక గ్రామ సంఘం, గ్రామ పంచాయతీల సభ్యులు మొదలైన వారితో సంభాషిస్తున్నారు.  జిల్లాల పర్యటన తరువాత, వారు రాష్ట్ర బృందంతో చర్చలు జరుపుతారు. 

2023-24 సంవత్సరానికి కల్లా జార్ఖండ్ రాష్ట్రంలో 100 శాతం ఎఫ్.హెచ్.టి.సి.లను సాధించాలని, ఝార్ఖండ్ రాష్ట్రం యోచిస్తోంది.   రాష్ట్రంలోని 59.24 లక్షల గ్రామీణ కుటుంబాలకు గాను, 8.60 లక్షల (14.5 శాతం) కుటుంబాలకు పంపు నీటి కనెక్షన్లు ఉన్నాయి.  2019 ఆగష్టు, 15వ తేదీన, జల్-జీవన్-మిషన్ ప్రారంభించే సమయానికి, జార్ఖండ్‌లో కేవలం 3.45 లక్షల (5.85 శాతం) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే పంపు నీటి సరఫరా ఉంది.  గత 24 నెలల్లో, రాష్ట్రంలో 5.15 లక్షల (8.7 శాతం) కుటుంబాలకు పంపు నీటి కనెక్షన్లు అందించబడ్డాయి.  ఏది , ఏమైనా, గ్రామీణ కుటుంబాలకు పంపు నీటి సరఫరా అందించడంలో, జాతీయ సగటు 23 శాతం పెరుగుదలతో పోలిస్తే, జార్ఖండ్‌లో సాధించిన పురోగతి చాలా నెమ్మదిగా ఉంది.

2020-21లో, గ్రామీణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా నీటి సరఫరా కోసం రాష్ట్రానికి 572.24 కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించగా,  పనులు నెమ్మదిగా అమలు జరగడం వల్ల, అందులో కేవలం 143.06 కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది.  దాంతో, మిగిలిన 429.18 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి అప్పజెప్పడం జరిగింది.   2024 నాటికి ప్రతి ఇంటికి పంపు నీటి సరఫరా అందించడానికి గాను, రాష్ట్రానికి సహాయం చేయడానికి, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర ప్రభుత్వ నిధులను నాలుగు రెట్లు పెంచి, 2,479.88 కోట్ల రూపాయలు కేటాయించారు.  ఈ పెరిగిన కేంద్ర కేటాయింపుకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా 2,617.81 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది.  దీంతో ఇప్పుడు, జార్ఖండ్‌ లో 2021-22 లో నీటి సరఫరా పనుల కోసం జల్-జీవన్-మిషన్ కింద 5,235.62 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నట్లయ్యింది.  అయితే, పేలవమైన భౌతిక, ఆర్థిక పురోగతి కారణంగా రాష్ట్రం ఇంకా మొదటి విడత కేంద్ర కేటాయింపులను తీసుకోలేకపోయింది. 

దీనికి అదనంగా, 2021-22 లో, గ్రామీణ స్థానిక సంస్థలు / పి.ఆర్.ఐ. లకు నీటి సరఫరా, పారిశుధ్య పనుల కోసం జార్ఖండ్‌ కు, 15వ ఆర్థిక సంఘం, 750 కోట్ల రూపాయల మేర గ్రాంట్‌  మంజూరు చేసింది.   వచ్చే ఐదు సంవత్సరాలకు అంటే 2025-26 వరకు 3,952 కోట్ల రూపాయల మేర నిధుల హామీ ఉంది.

అన్ని గ్రామాల్లో పంపు నీటి కనెక్షన్లను అందించే లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో సాధించడానికి వీలుగా పనులను వెంటనే ప్రారంభించాలనే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నొక్కి చెబుతూ, జార్ఖండ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. జల్-జీవన్-మిషన్ కింద వివిధ ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను సాధించడానికి వీలుగా, అమలును వేగవంతం చేయడానికి, పెంచిన కేటాయింపు రాష్ట్రానికి దోహదపడుతుందని, శ్రీ షెకావత్ ఆకాంక్షించారు.  అదేవిధంగా, అందుబాటులో ఉన్న మొత్తం కేంద్ర నిధులను స్వీకరించడానికీ, ఉపయోగించుకోవడానికీ వీలుగా అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేయాలని కేంద్రమంత్రి రాష్ట్రాన్ని కోరారు.

'బాటమ్ అప్' విధానాన్ని అనుసరించి వికేంద్రీకృత పద్ధతిలో జల్-జీవన్-మిషన్ అమలు చేయబడుతోంది.  ఇందులో స్థానిక గ్రామ సంఘం ప్రణాళిక నుండి అమలు వరకు; యాజమాన్యం నుండి పనిచేయడం మరియు నిర్వహణ వరకు కీలక పాత్ర పోషిస్తుంది.  దీనిని సాధించడానికి వీలుగా, గ్రామ నీటి సరఫరా, పారిశుధ్య కమిటీ (VWSC) / పానీ సమితి లను బలోపేతం చేయడం; వచ్చే ఐదేళ్లపాటు ప్రతి గ్రామం కోసం గ్రామ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడం;  గ్రామ కమ్యూనిటీలకు అవసరమైన సలహా, సహకారాలను అందించడానికి  రాష్ట్ర స్థాయి ఏజెన్సీలను (ఐ.ఎస్.ఏ. లను) ఏర్పాటు చేయడం;  ప్రజల్లో భారీ అవగాహన కల్పించడం వంటి సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి.   ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేయడం కోసం, దీర్ఘకాలిక, సుస్థిరమైన నీటి సరఫరా మౌలిక సదుపాయాలను వినియోగించడంతో పాటు నిర్వహణను నిర్ధారించడానికి జార్ఖండ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మందికి పైగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 

జల్-జీవన్-మిషన్ కింద, సరఫరా చేయబడిన నీటి నాణ్యతను నిర్ధారించడానికి ఎప్పటికప్పుడు నీటి వనరులతో పాటు, డెలివరీ పాయింట్ల పర్యవేక్షణను నిర్వహించడానికి, స్థానిక సమాజాలను / సంఘాలను ప్రోత్సహించడం జరుగుతోంది.   పి.హెచ్.ఈ. శాఖ గ్రామ సమాజాలకు వారి గ్రామాల్లో క్రమం తప్పకుండా నీటి నాణ్యతా పరీక్షను నిర్వహించడానికి అవసరమైన శిక్షణతో పాటు, సదుపాయాలను అందుబాటులో ఉంచుతోంది.  ఇందుకోసం, పంచాయితీలకు క్షేత్ర స్థాయి పరీక్షా పరికరాలు (ఎఫ్.టి.కె. లు) సకాలంలో సేకరణ మరియు సరఫరా;  కమ్యూనిటీ కార్యక్రమాల కోసం కోసం ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు మహిళలను గుర్తించడం, వారికి ఎఫ్.టి.కె. లను ఉపయోగించడంపై శిక్షణ ఇవ్వడం;  పరీక్ష ఫలితాలను తెలియజేయడం వంటి వాటిపై ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ప్రజారోగ్యంపై దృష్టి సారించి,  కోవిడ్-19 టెస్టింగ్, రిపోర్టింగ్ విధానానికి అనుగుణంగా, ఎఫ్.టి.కె. లు మరియు ప్రయోగశాలల ద్వారా నీటి నాణ్యత పరీక్షల నుండి రూపొందించిన నివేదికలను ఉపయోగించడం ద్వారా,  దేశవ్యాప్తంగా ఆన్‌-లైన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ (డబ్ల్యూ.క్యూ.ఎం.ఐ.ఎస్) ను ప్రారంభించడం జరిగింది.  సాధారణ ప్రజలు, నామమాత్రపు ధరతో, తమ నీటి నమూనాలను పరీక్షించుకోవడానికి వీలుగా, దేశంలో 2,000 కంటే ఎక్కువ సంఖ్యలో నీటి నాణ్యత పరీక్షా ప్రయోగశాలలు ప్రారంభించడం జరిగింది. 

2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ పంపు నీటి కనెక్షన్ అందించడం కోసం, ప్రధానమంత్రి 2019 ఆగష్టు, 15వ తేదీన ప్రకటించిన జల్-జీవన్-మిషన్ ప్రస్తుతం, రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలులో ఉంది.  జల్-జీవన్-మిషన్ కోసం 2021-22 లో మొత్తం 50,011 కోట్ల రూపాయల మేర బడ్జెట్ కేటాయించారు.  రాష్ట్ర సొంత వనరులతో పాటు నీటి సరఫరా, పారిశుధ్య పనుల కోసం ఆర్.ఎల్.బి. లు / పి.ఆర్.ఐ. లకు ఈ సంవత్సరం 15వ ఆర్థిక సంఘం 26,940 కోట్ల రూపాయల మేర గ్రాంట్లు మంజూరు చేయగా,   ప్రభుత్వం, గ్రామీణ తాగునీటి సరఫరా రంగంలో ఒక లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువగా, పెట్టుబడి పెట్టింది.  దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి భారీ పెట్టుబడి ఖచ్చితంగా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు, గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా పెంపొందిస్తుంది.

2019 ఆగష్టు, 15వ తేదీన జె.జె.ఎం. ప్రకటించిన సమయంలో, మొత్తం 18.93 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను, 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు (17 శాతం) మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లను కలిగి ఉన్నాయి.  అప్పటి నుండి, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 4.87 కోట్ల (25.25 శాతం) కుటుంబాలకు వారి ఇళ్లలో పంపు నీటి కనెక్షన్‌లు అందించబడ్డాయి. ప్రస్తుతం, దేశంలోని మొత్తం 19.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను, 8.11 కోట్ల (42.2 శాతం) గ్రామీణ కుటుంబాలకు, వారి ఇళ్లలో తాగునీటి సౌకర్యంతో పాటు, వారి జీవన నాణ్యతను మెరుగుపరచి , 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి హామీ ఇచ్చినట్లయింది.  కోవిడ్ -19 మహమ్మారితో పాటు అనంతర పరిస్థితులు క్షేత్ర స్థాయిలో జె.జె.ఎం. అమలును ప్రభావితం చేశాయి.  అయితే, జాతీయ జల్-జీవన్-మిషన్ మాత్రం, గ్రామీణ గృహాలకు పంపు నీటి కనెక్షన్లను అందించడానికి తన చర్యల వేగాన్ని కొనసాగించడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పనిచేస్తూనేఉంది. 

 

*****



(Release ID: 1753024) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Hindi