ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ సదుపాయాలు
Posted On:
20 JUL 2021 3:49PM by PIB Hyderabad
“ప్రజారోగ్యం, ఆసుపత్రులు” అనేవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలు. అందువల్ల, నాణ్యమైన ఆరోగ్య రక్షణ, చికిత్స, అధునాతన వ్యాధి నిర్ధారణ సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటుగా, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అవుతుంది. అయితే, జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) కింద ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజారోగ్య రక్షణ సదుపాయాలను పటిష్టపరిచేందుకు, ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగినంత సాంకేతిక సహాయం, ఆర్థిక మద్దతు లభిస్తోంది.
ఆరోగ్యరక్షణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంకోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్.ఆర్.హెచ్.ఎం.) 2005లో ప్రారంభమైంది. ప్రజారోగ్య సదుపాయాలతో సంబంధం ఉన్న ప్రజలందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య రక్షణను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలకు దన్నుగా ఎన్.ఆర్.హెచ్.ఎం. పథకం రూపొందింది. ప్రస్తుతం జాతీయ ఆరోగ్య కార్యక్రమానికి ఉప పథకంగా ఎన్.ఆర్.హెచ్.ఎం. అమలు జరుగుతోంది. ఎన్.హెచ్.ఎం.కు ఉపపథకంగా జాతీయ పట్టణ ప్రాంతాల ఆరోగ్య పథకాన్ని (ఎన్.యు.హెచ్.ఎం.ను) కూడా 2013లో ప్రారంభించారు.
రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఆరోగ్య రక్షణ సదుపాయాలను బలోపేతం చేసేందుకు, తాజాగా మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం తగిన మద్దతు అందిస్తోంది. ప్రస్తుతం ఏర్పడిన అసరాలకు, ఉన్న సదుపాయాలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
మాతా శిశు ఆరోగ్యం, కిశోర ప్రాయంలోని వారి ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం, ట్యూబెర్కులోసిస్ (టి.బి.) వ్యాధి, దోమలు తదితర పరాన్నజీవుల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ, కాలా అజర్, కుష్టువ్యాధి వంటి వాటి నివారణ కార్యక్రమాలకోసం కూడా జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద సహాయం లభిస్తోంది.
ఇంకా, జనని శిశు సురక్షా కార్యక్రమం (జె.ఎస్.ఎస్.కె.), రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం (ఆర్.బి.ఎస్.కె.)వంటి వాటికి కూడా జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ప్రధానంగా సహాయం అందుతోంది. జె.ఎస్.ఎస్.కె. కింద మాతా శిశువులకు ఉచితంగా మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రక్తదానం, ఆహారం, ఇంటికి, వైద్య సంస్థకు మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు. ఆర్.బి.ఎస్.కె. కింద నవజాత శిశువులకు, చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు, జన్మతః వచ్చిన శారీరక ఆరోగ్య లోపాలను సవరించే చికిత్సలు, వివిధ వ్యాధులకు చికిత్సలు, ఉచితంగా అందిస్తారు. ఉచిత మందులు, ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల సేవలు, ప్రధానమంత్రి జాతీయ రక్తశుద్ధి కార్యక్రమం, గ్రామాల్లోని ఆరోగ్య సదుపాయాలతోపాటుగా అన్ని ఆరోగ్య రక్షణ సదుపాయాల్లో జాతీయ నాణ్యతా హామీ కార్యక్రమం అమలుకు కూడా జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద సహాయం అందుతోంది.
ఆరోగ్య సదుపాయాలతో ప్రజలకు అనుసంధానం మెరుగుపరిచేందుకు, ఈ విషయంలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంచార వైద్య చికిత్సా యూనిట్లు (ఎం.ఎం.యు.లు), టెలీ కన్సల్టేషన్ వంటి సేవలను కూడా అమలు చేస్తూ వస్తున్నారు.
ఇక, ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో భాగంగా వచ్చే ఏడాది డిసెంబరులోగా దేశవ్యాప్తంగా లక్షన్నర ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్రాలకు సహాయం అందిస్తున్నారు. ప్రజా సంఘాల స్థాయిలో మందస్తు జాగ్రత్తలతో కూడిన ఆరోగ్య రక్షణ సదుపాయాలను, ఆరోగ్య ప్రోత్సాహక కార్యక్రమాలతో సహా సమగ్ర ఆరోగ్య రక్షణ వ్యవస్థను కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తూ, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎ.బి.-పి.ఎం.జె.ఎ.వై) పేరిట మరో పథకం కూడా ప్రజలకు ఆరోగ్య రక్షణను అందిస్తోంది. ఎ.బి.-పి.ఎం.జె.ఎ.వై కింద ఒక్కొక్క పేద కుటుంబానికి సంవత్సరానికి 5లక్షల రూపాయలమేర చికిత్సా వ్యయంతో ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, కులపరమైన జనగణన (ఎస్.ఇ.సి.సి.) ప్రాతిపదికన వైద్య సదుపాయాలకు నోచుకోని దాదాపు 1,074 కోట్ల పేద కుటుంబాలకు కూడా ఎ.బి.-పి.ఎం.జె.ఎ.వై. పథకం ఆరోగ్య రక్షణను అందిస్తోంది.
ఇప్పటికి 15 సంవత్సరాలుగా అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ఆరోగ్యానికి సంబంధించి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు వీలైంది. మాతృ సంబంధమైన ఆరోగ్య సదుపాయాలు, నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య సూచీలను మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం గణనీయమైన ప్రగతిని కనబరిచింది. మహిళల ప్రసూతి మరణాలను, శిశు మరణాలను, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను తగ్గించడంలో కూడా గణనీయమైన కృషి జరిగింది. దీనితో భారతదేశంలో ఈ తరహా మరణాల తగ్గుదల రేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద సాధించిన ప్రముఖ విజయాలను ఈ కింది అనుబంధంలో పొందుపరిచాం.
అనుబంధం
జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఎం.) విజయాలు
ఎ. కీలకమైన ఆరోగ్య ఫలితాల్లో మెరుగుదల:
- ప్రజల జేబునుంచి చేసే ఖర్చు (ఒ.ఒ.పి.ఇ.) తగ్గింపు: ఎన్.హెచ్.ఎం. అమలైన ఈ 15 సంవత్సరాల కాలంలో ఆసుపత్రిలో చేరికకు, ప్రసవం, శిశుజననానికి అయ్యే ఖర్చు బాగా తగ్గింది. ఆసుపత్రిలో చేరికకు అయ్యే ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5,636నుంచి రూ. 4290కి, పట్టణ ప్రాంతాల్లో రూ. 7,670నుంచి రూ. 4,837కు తగ్గింది. అలాగే, ప్రసూతికోసం అయ్యే ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,587నుంచి రూ. 1,324కు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,117నుంచి రూ. 1,919కి తగ్గింది. అంటే ఆరోగ్య రక్షణ, ఆసుపత్రులకోసం ప్రజలు తమ జేబునుంచి చేసే ఖర్చు (ఒ.ఒ.పి.ఇ.)ను తగ్గించడంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఎంతో ప్రభావం చూపినట్టు దీన్ని బట్టి తెలుస్తోంది.
- ప్రసూతి మరణాల రేటు (ఎం.ఎం.ఆర్.) కూడా గణనీయంగా తగ్గిపోయింది. 1990లో లక్ష జననాలకు 556 మరణాలనుంచి, 2016-17లో 113కు తగ్గింది. ఇదే కాలంలో భారతదేశంలో గర్భిణీ, ప్రసూతి మరణాల రేటు తగ్గుదల 77శాతంగా నమోదైంది. అంటే ప్రపంచస్థాయి సగటు తగ్గుదల కంటే ఇది చాలా మెరుగ్గా ఉంది. అదే కాలంలో ప్రపంచ స్థాయి మరణాల తగ్గుదల సగటు రేటు 44శాతంగా మాత్రమే నమోదైంది.
- శిశుమరణాల రేటు (ఐ.ఎం.ఆర్.), కూడా బాగా తగ్గింది. 1990లో 80దాకా ఉన్న ఈ మరణాలు 2018లో 32కు తగ్గాయి.
- ఐదేళ్లలోపు శిశువుల మరణాల రేటు (యు5ఎం.ఆర్.)..2012లో 52వరకూ నమోదైన ఈ మరణాలు 2018కల్లా 36కు తగ్గిపోయాయి.
- మొత్తం సంతాన సాఫల్య రేటు (టి.ఎఫ్.ఆర్.)..2013లో 2.3గా ఉన్న సాఫల్య రేటు 2018లో 2.2కు తగ్గింది.
- ట్యూబెర్కులోసిస్ (టి.బి.) ప్రభావం..2012లో లక్షమంది జనాభాలో 234మందికి టి.బి. సోకగా, 2019లో ఈ వ్యాధి సంక్రమించిన వారి సంఖ్య 193కు తగ్గింది. టి.బి. కారణంగా 2012లో లక్ష జనాభాకు 42మంది మరణించగా, 2019లో ఈ మరణాల సంఖ్య 33కు తగ్గింది.
- కుష్టువ్యాధి నిర్మూలన లక్ష్యం సాధించిన జిల్లాల సంఖ్య కూడా పెరిగింది. 2011-12లో ఈ లక్ష్యం సాధించిన జిల్లాలు 543కాగా, 2017 మార్చి కల్లా ఈ జిల్లాల సంఖ్య 554కు, అలాగే 2018 మార్చి నెలకల్లా 571కి తగ్గింది. కుష్టువ్యాధి సోకిన వారి సంఖ్య కూడా బాగా తగ్గింది. 2020 కల్లా దేశంలోని 610 జిల్లాల్లో పదివేల జనాభాకు గాను కుష్టువ్యాధి సోకినవారి సంఖ్య ఒకటికంటే తక్కువగానే నమోదైంది.
- మలేరియా వ్యాధికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్రాంతంలో తాజాగా మలేరియా సంక్రమించిన వారి సంఖ్య కూడా ఒకటి కంటే తక్కువ స్థాయిలోనే స్థిరంగా కొనసాగింది. 2014లో 0.89మందికి సోకిన ఈ మలేరియా 2018లో 0.32మందికి మాత్రమే సోకింది. 2019లో ఈ సంఖ్య 0.25కు తగ్గింది. 2018లో 21.27శాతంగా నమోదైన మలేరియా కేసులు, మరణాలు 2019లో 20శాతానికి తగ్గాయి.
- 2019 డిసెంబరు నెలాఖరు నాటికి కాలా అజర్..అనే విషజ్వరం నిర్మూలనా లక్ష్యాన్ని దేశంలోని 94శాతం బ్లాకులు సాధించాయి.
- డెంగ్యూ సంబంధమైన కేసులతో సంభవించే మరణాల రేటును ఒకశాతం కంటే తక్కువ స్థాయికి చేర్చాలన్న జాతీయ లక్ష్యాన్ని ఇప్పటికే సాధించారు. 2014లో 0.3 శాతం ఉన్న డెంగ్యూ మరణాల రేటు 2019లో 0.1 శాతానికి తగ్గింది.
- అంధత్వం కూడా తగ్గిపోయింది. 2010లో 0.68శాతం ఉన్న అంధత్వం రేటు 2019లో 0.36శాతానికి తగ్గిపోయింది.
- పొగాకు వినియోగం కూడా 17.3శాతంమేర తగ్గింది. 2009-10వ సంవత్సరంలో 34.6శాతం మేర ఉన్న పొగాకు వినియోగం 2016-17లో 28.6శాతానికి తగ్గిపోయింది.
బి. ఆరోగ్య సేవలతో పెరిగిన అనుసంధానం:
- జాతీయ ఆరోగ్య కార్యక్రమం అమలు కారణంగా ఆరోగ్య వ్యవస్థలు మరింత బలోపేతం కావడంతో ప్రజారోగ్య సదుపాయాల ద్వారా ఆరోగ్య రక్షణను కోరుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 28.3శాతంనుంచి 32.5శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో 21.2శాతంనుంచి 26.2శాతానికి పెరిగింది. 2014, 2017 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పెరుగుదల చోటు చేసుకుంది.; ఇక ఆసుపత్రుల్లో ప్రసవాలకోసం జనం ప్రజారోగ్య సదుపాయాలను వినియోగించుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో 56శాతంనుంచి 69.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 42శాతంనుంచి 48.3శాతానికి పెరిగింది.
- ప్రజారోగ్య సదుపాయాల వృద్ధి:
ప్రజారోగ్య సదుపాయాల స్థాపన లక్ష్యంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మాణ పద్దతిని జాతీయ ఆరోగ్య కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం అట్టడుగు స్థాయిలో, జిల్లా ఆసుపత్రుల్లో ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పౌరులకు రెఫరల్ అనుసంధానంతో సమగ్రమైన, ప్రాథమిక ద్వితీయ స్థాయి ఆరోగ్య రక్షణ సేవలను అందించేందుకు వీలుగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో,..వివిధ స్థాయిల్లో 2005నుంచి ఇప్పటి వరకూ పెరిగిన ఆరోగ్య సదుపాయాల వివరాలను ఈ కిందనున్న పట్టికలో చూడవచ్చు.
క్రమసంఖ్య
|
ఆరోగ్య రక్షణ సదుపాయ స్వభావం
|
2005లో పరిస్థితి
|
2020లో పరిస్థితి
|
2005వ సంవత్సరంలో వర్గీకరణ ప్రకారం సదుపాయాలు
|
|
|
1
|
ఆరోగ్య ఉపకేంద్రాలు
|
1,46,026
|
1,57,411
|
2
|
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
|
23,236
|
24,855
|
3
|
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
|
3,346
|
5,335
|
4
|
జిల్లా ఆసుపత్రులు
|
635
|
756
|
5
|
తొలి రెఫరల్ యూనిట్లు (ఎఫ్.ఆర్.యు.)
|
940
|
3,122
|
6
|
24 x 7 బట్వాడా కేంద్రాలు
|
2,243
|
15494
|
ఎన్.హెచ్.ఎం. పరిధిలో అమలులోకి వచ్చిన సదుపాయాలు
|
|
|
7
|
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలు
|
-
|
77,278
(2021, జూలై 15నాటికి)
|
8
|
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
|
-
|
5,895
|
9
|
మాతా శిశు ఆరోగ్య విభాగాలు
|
-
|
650
|
10
|
ప్రసవ సంబంధమైన ఐ.సి.యు./హెచ్.డి.యు.లు
|
-
|
278
|
11
|
నవజాత, అస్వస్థ శిశువుల సంరక్షణా విభాగాలు (ఎస్.ఎన్.సి.యు.)/పసికందుల ఐ.సి.యు (ఎన్.ఐ.సి.యు.)
|
-
|
894
|
12
|
నవజాత శిశువుల స్టెబిలైజేషన్ యూనిట్లు (ఎన్.బి.ఎస్.యు.)
|
-
|
2,571
|
13
|
నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు (ఎన్.బి.సి.సి.)
|
-
|
20,337
|
14
|
చిన్నారుల ఐ.సి.యు.లు (పి.ఐ.సి.యు.)
|
-
|
42
|
15
|
పౌష్టికాహార పునరావాస కేంద్రాలు (ఎన్.ఆర్.సి.)
|
-
|
1,072
|
16
|
ఎన్.సి.డి. క్లినిక్కులు
|
-
|
జిల్లా ఎన్.సి.డి. క్లినిక్కులు: 638
సి.హెచ్.సి. ఎన్.సి.డి క్లినిక్కులు: 4,464
|
17
|
టి.బి. మాలిక్యులర్ వ్యాధి నిర్థారణ సదుపాయాలు
|
-
|
3,470
|
18
|
జిల్లా ఆసుపత్రుల్లోని వృద్ధాప్య వైద్య చికిత్సా వార్డులు
|
-
|
578
|
19
|
జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వృద్ధాప్య వైద్య సేవలు.
|
-
|
జిల్లా ఆసుపత్రులు: 578
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు: 2,704
|
20
|
జాతీయ అంబులెన్స్ సేవలు (ఎ.ఎల్.ఎస్.\బి.ఎల్.ఎస్. అంబులెన్సులు)
|
-
|
20,990
|
21
|
కిశోరప్రాయంలోని వారికోసం ఆరోగ్య కేంద్రాలు (ఎ.ఎఫ్.హెచ్.సి.లు)
|
-
|
7,980
|
22
|
వైరల్ హెపటైటిస్ చికిత్సా కేంద్రాలు
|
-
|
792
|
23
|
పి.ఎం.ఎన్.డి.పి. రక్తశుద్ధి కేంద్రాలు
|
-
|
862
|
24
|
దంతవైద్య చికిత్సా కేంద్రాలు
|
-
|
1,759
|
పైన పేర్కొన్న వివరాలను బట్టి చూస్తే, దేశ వ్యాప్తంగా ఆరోగ్య సేవా సదుపాయాలను పెంచడానికే కాక, తన పరిధిలోని వివిధరకాలేన జాతీయస్థాయి కార్యక్రమాల లక్ష్యాలు సాధించేందుకు కూడా జాతీయ ఆరోగ్య కార్యక్రమం కృషి చేసిందని చెప్పవచ్చు.
.
- సమానస్థాయి అభివృద్ధి: దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో ఉండే గిరిజన జనాభా ఆరోగ్యంపై, పట్టణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యంపై కూడా దృష్టిని కేంద్రీకరించారు. ఆరోగ్య సదుపాయాలకు సమాన స్థాయిలో అనుసంధానం కల్పించే కార్యక్రమాల్లో ఇటీవల చేపట్టిన ఆశావహ జిల్లాల పథకం ఒకటి. ఇందుకోసం 28 రాష్ట్రాల్లో బలహీనమైన సామాజిక, మానవాభివృద్ధి సూచికలు కనిపించిన 115 జిల్లాలను ఎంపిక చేశారు. మిగిలిన అభివృద్ధి చెందిన జిల్లాలతో పాటుగా సామర్థ్యాలను పెంపొందించేందుకు అదనపు వనరులను కేటాయించేందుకు వీలుగా ఈ జిల్లాల ఎంపిక జరిగింది.
- జాతీయ అంబులన్స్ సేవలు: 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం (ఎన్.హెచ్.ఆర్.ఎం.) ప్రారంభించేనాటికి పల్లె ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు అందుబాటులో లేవు. అయితే, ఇప్పటి వరకూ ఎన్.హెచ్.ఆర్.ఎం. కింద 20,990 అత్యవసర ప్రతిస్పందనా సేవల వాహనాలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు 5,499 రోగుల రవాణా వాహనాలను కూడా తరలించారు. గర్భిణీ స్త్రీలను, అస్వస్థులైన చిన్నారులను ఇంటినుంచి ఆరోగ్య సదుపాయ కేంద్రాలకు “ఉచితంగా తీసుకువచ్చి తిరిగి ఇంటివద్ద దింపేందుకు” ఈ వాహనాలను ఏర్పాటు చేశారు.
- మానవ వనరుల బలోపేతం: ఆరోగ్య సేవలను బట్వాడా చేసే మానవ వనరులైన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలను వినియోగించుకునే రాష్ట్రాలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద తగిన సహాయం లభిస్తుంది. అలాగే ఆశా వర్కర్ల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య వలంటీర్ల కార్యక్రమాన్ని కూడా జాతీయ ఆరోగ్య పథకం కింద అమలు చేస్తున్నారు. ఇందుకోసం పది లక్షలమందికిపైగా ఆశా వర్కర్లను, ఆశా ఫెసిలిటేటర్లను జాతీయ ఆరోగ్య కార్యక్రమం కిందనే వినియోగిస్తున్నారు. ప్రజారోగ్య, ఆర్ఖిక, ప్రణాళిక, నిర్వహణ కార్యక్రమాల్లో నైపుణ్యం కలిగిన సిబ్బందిని సమకూర్చుకునేందుకు, వైద్య సిబ్బంది కేవలం ఆరోగ్య వైద్యసేవలందించేలా తగిన వెసులుబాటు కల్పించేందుకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం రాష్ట్రాలకు తగిన సహాయం అందిస్తుంది. మారు మూల ప్రాంతాలకు విధుల నిర్వహణకు నియమితులయ్యే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆరోగ్య సదపాయ కేంద్రాల్లోను, నిర్వహణా విధుల్లో నియమితులైన మానవ వనరుల విభాగం సిబ్బందిపై సమగ్రమైన వాస్తవ సమాచారం తెలిపేందుకు అవసరమైన పరిపాలనా సంస్కరణను అమలు చేశారు. ఇందుకోసం మానవ వనరుల సమాచార వ్యవస్థ (హెచ్.ఆర్.ఐ.ఎస్.)ను అమలు చేశారు. మానవ వనరుల విభాగంలో సిబ్బంది కొరత రాకుండా చూసేందుకు వీలుగా అన్ని రకాల సిబ్బందిపై పర్యవేక్షణకు, సామర్థ్యాల పెంపుదలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం కిందనే పెట్టుబడులు పెడుతున్నారు.
- ఆరోగ్య రంగ సంస్కరణలు: ఆరోగ్య సేవల సదుపాయాల పరిపాలనా సంస్కరణలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం రూపకల్పన చేయడమేకాక, వాటిని సమర్థంగా అమలు చేసింది. వికేంద్రీకరించిన నిర్వహణా విభాగాలు, పరిపాలనా నిధుల నిర్వహణా పరమైన నిర్ణయాల్లో వెసులుబాటు, రోగి కల్యాణ సమితుల ఏర్పాటు, జవాబ్దారీతనం లక్ష్యంగా గ్రామ ఆరోగ్య, పారిశుద్ధ్య, పౌష్టికాహార కమిటీల వంటివి ఏర్పాటు, మహిళా ఆరోగ్య సమితుల స్థాపన వంటి చర్యలు తీసుకుంది. పలు రాష్ట్రాల్లో వైద్య సేవా సంస్థల ఏర్పాటు, సరఫరా వ్యవస్థల మెరుగుదల, నిర్వహణ, సేకరణ సామర్థ్యాలను విస్తృతం చేయడం వంటి చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే, సేవలు అవసరమైన తల్లులు, చిన్నారుల సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు, వ్యాక్సీన్ సదుపాయాలను తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో తగిన చర్యలు తీసుకున్నారు.
- ప్రజల జేబు ఖర్చు (ఒ.ఒ.పి.ఇ.) సమస్యను పరిష్కరించడం: మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకోసం జనం జేబులనుంచి ప్రస్తుతం అవుతున్న ఖర్చును తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ఉచిత మందులు, ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల పద్ధతిని జాతీయ ఆరోగ్య కార్యక్రమం చేపట్టింది. అత్యంత ఆవశ్యకమైన మందుల జాబితా (ఇ.డి.ఎల్.)లను, ఆవశ్యకమైన వ్యాధి నిర్ధారణ పరీక్షల జాబితాలను నోటిపై చేశారు. కాలక్రమేణా అవసరాలను బట్టి మరిన్ని ఆవశ్యక మందులను చేర్చేందుకు వీలుగా సదరు జాబితాలను క్రమం తప్పకుండా నవీకరిస్తూ వచ్చారు. మరింత విస్తృతమైన సేవలందించేందుకు వీలుగా ఆరోగ్య సదుపాయాల సామర్థ్యాన్ని పెంచేందుకు, వాటిని ప్రజలకు చేరువగాగా తీసుకెళ్లేందుకు ఈ చర్యలన్నీ దోహదపడ్డాయి. ప్రజల వైద్య ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు టెలీ కన్సల్టేషన్ సేవలు కూడా దోహదపడ్డాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమ మద్దతుతో చేపట్టిన ఆరోగ్యరంగ సంస్కరణల కారణంగా పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థకు రూపకల్పన జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలను పెంచుకునేందుకు వీలైంది. అలాగే, గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణ ప్రాంతాలకు వేగంగా వలసలు పెరగడం, దీనితో జనాభాలో వయోవృద్ధుల సంఖ్య పెరగడం, దీర్ఘకాల వ్యాధుల ఒత్తిడి పెరగడం, కొత్తగా సంక్రమించే వ్యాధులు వెలుగులోకి రావడం, తదితర పరిణామాల నేపథ్యంలో అదనంగా చేపట్టిన సంస్కరణలతో ఆరోగ్య సదుపాయాలను పెంచవలసి వచ్చింది. వివిధ రాష్రాల మధ్య, ఆయా రాష్ట్రాల్లోను ప్రజారోగ్య సదుపాయాల్లో ఏర్పడిన అసమానతలను తొలగించేందుకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం సంస్కరణలు బాగా దోహదపడ్డాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వైద్యం, ఆరోగ్యంకోసం జాతీయ ఆరోగ్య కార్యక్రమం పరిధిలో చేసే వ్యయంపై జాతీయ పబ్లిక్ ఫైనాన్స్, పాలసీ అధ్యయన సంస్థ 2020వ సంవత్సరంలో జరిపిన అధ్యయనం ప్రకారం పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్యంపై జరిగే ఖర్చులో అసమానతలు గణనీయంగా తగ్గించేందుకు జాతీయ ఆరోగ్య కార్యక్రమం అందించిన సేవలు ఎంతగానో దోహదపడ్డాయని ఈ అధ్యయనం పేర్కొంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద చేపట్టిన సేవలవల్ల ఆరోగ్య వ్యవస్థలో కింది స్థాయి సంస్థలకు బాగా నిధులు సమకూరాయని కూడా ఈ అధ్యయనం పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన తన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలన్నీ తెలిపారు.
***
(Release ID: 1737389)
|