రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
అయిదు వైద్య పరికరాల ధరలు పంపిణీదారు స్థాయిలో వ్యాపార మార్జిన్ 70 శాతం మించకుండా పరిమితి విధించిన ప్రభుత్వం
Posted On:
14 JUL 2021 5:08PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి వల్ల వైద్య పరికరాల అవసరం ఉంటోంది. ఈ కారణంగా వాటి ధరలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సంకల్పించి నియంత్రించాలని నిర్ణయించింది. డిపిసిఓ, 2013 పారా 19 కింద విస్తృతమైన ప్రజా ప్రయోజనాల కోసం అసాధారణమైన అధికారాలను వినియోగించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ ఏజెన్సీ (ఎన్‌పిపిఎ) 13.07.2021 నాటి నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ, ( i) పల్స్ ఆక్సిమీటర్, (ii) రక్తపోటు పర్యవేక్షణ యంత్రం, (iii) నెబ్యులైజర్, (iv) డిజిటల్ థర్మామీటర్ మరియు (v) గ్లూకోమీటర్ పై ట్రేడ్ మార్జిన్‌ను పంపిణీదారు (పిటిడి) స్థాయిలో 70% వరకు పరిమితి విధించింది. అంతకుముందు, ఫిబ్రవరి 2019 లో ఎన్‌పిపిఎ క్యాన్సర్ నిరోధక ఔషధాలపై ట్రేడ్ మార్జిన్‌ను, 2021 జూన్ 3 న ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలపై పరిమితి విధించింది. నోటిఫైడ్ ట్రేడ్ మార్జిన్ ఆధారంగా, సవరించిన ఎంఆర్‌పిని ఏడు రోజుల్లో నివేదించాలని ఎన్‌పిపిఎ తయారీదారులు / దిగుమతిదారులకు సూచించింది. సవరించిన ఎంఆర్‌పిలను ఎన్‌పిపిఎ ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ప్రదర్శిస్తారు. సవరించిన ధరలు 2021 జూలై 20 నుండి అమల్లోకి వస్తాయి.
ప్రతి రిటైలర్, డీలర్, హాస్పిటల్ మరియు సంస్థ ఈ వైద్య పరికరాల ధరల జాబితాలను తయారీదారు అందించినట్లుగా, వ్యాపార ప్రాంగణంలో ఒక స్పష్టమైన భాగంలో ప్రదర్శిస్తాయి. సవరించిన ఎంఆర్‌పి ట్రేడ్ మార్జిన్ క్యాపింగ్‌కు అనుగుణంగా లేని తయారీదారులు / దిగుమతిదారులు 1955 నిత్యావసర వస్తువుల చట్టం, ఔషధాల (ధరల నియంత్రణ), 2013 ప్రకారం అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో పాటు 100% వరకు జరిమానా జమ చేయాల్సి ఉంటుంది. బ్లాక్-మార్కెటింగ్ యొక్క సందర్భాలను నివారించడానికి, తయారీదారు, పంపిణీదారు, రిటైలర్ ఏ వినియోగదారునికి సవరించిన ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరకు ఈ వైద్య పరికరాలను విక్రయించకూడదని నిర్ధారించడానికి స్టేట్ డ్రగ్ కంట్రోలర్స్ ( ఎస్ డి సి లు) పర్యవేక్షించాలి.
ఈ ఆదేశాలు మధ్యలో సమీక్ష చేస్తూనే, 2022 జనవరి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయి.
******
(Release ID: 1735743)