ఆర్థిక మంత్రిత్వ శాఖ

సుమారు 94 కోట్ల రూపాయల ఇన్-పుట్ క్రెడిట్ మోసానికి పాల్పడిన వ్యక్తిని అరెష్టు చేసిన - ఢిల్లీ సి.జి.ఎస్.టి. అధికారులు

Posted On: 26 MAR 2021 5:39PM by PIB Hyderabad

తన స్నేహితులు / ఉద్యోగుల గుర్తింపు పత్రాలను ఉపయోగించి నకిలీ సంస్థలను సృష్టించడం, నిర్వహించడం వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న శ్రీ క్రిషన్ కుమార్ పై సేకరించిన విశ్లేషణ, నిఘా సమాచారం ఆధారంగా సి.జి.ఎస్.టి. ఢిల్లీ-నార్త్ కమిషనరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. 

 

ఇంతవరకు నిర్వహించిన దర్యాప్తు ప్రకారం - శ్రద్దా ట్రేడర్స్; అంశారా ఇంపెక్స్; విజేతా ఎంటర్ ప్రైజస్; ఎస్.ఎం.ఏజెన్సీస్; దీపాషా సేల్స్ అనే పేర్లతో మొత్తం ఐదు నకిలీ సంస్థలను అతను సృష్టించి, వెన్న / నెయ్యి / నూనె వంటి వస్తువులను సరఫరా చేస్తున్నట్లుగా వస్తువులు లేకుండా బిల్లులు జారీ చేసి, సుమారు 94 కోట్ల రూపాయల మేర, అనుమతి లేని ఇన్-పుట్ క్రెడిట్ (ఐ.టి.సి) ప్రయోజనం పొందినట్లు తెలిసింది. 

 

అతని నివాసంలో జరిపిన సోదాల్లో - ఎ.టి.ఎం. కార్డులు; సంతకం చేసిన చెక్కులు; బ్యాంకు పత్రాలు; ఈ నకిలీ సంస్థల స్టాంపులతో పాటు, ఈ-వే బిల్లుల్లో పేర్కొన్న రవాణా సంస్థకు చెందిన స్టాంపు, నకిలీ సంస్థల నమోదుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వాటి  అట్ట పెట్టెలను, నేరారోపణకు సంబంధించిన ఇతర పత్రాలను  స్వాధీనం చేసుకున్నారు.

 

పైన పేర్కొన్న వివరాల నేపథ్యంలో, శ్రీ క్రిషన్ కుమార్,  సి.జి.ఎస్.టి. చట్టం, 2017 లోని సెక్షన్ 132 (1) (బి) కింద పేర్కొన్న నేరానికి పాల్పడ్డారు.  దీని ప్రకారం, సి.జి.ఎస్.టి. చట్టం, 2017 లోని సెక్షన్ 69 (1) లోని నిబంధనల ప్రకారం అతన్ని 2021 మార్చి, 25వ తేదీన అరెస్టు చేశారు.  డ్యూటీ మేజిస్ట్రేట్, అతనిని, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తదుపరి దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది. 

 

సి.జి.ఎస్.టి. ఢిల్లీ జోన్,  2020-21 ఆర్థిక సంవత్సరంలో, సుమారు 5,310 కోట్ల రూపాయల మేర, జి.ఎస్.టి. ఎగవేతకు సంబంధించిన వివిధ కేసుల్లో, మొత్తం 40 మందిని అరెస్టు చేసిన విషయాన్ని,ఈ సందర్భంగా, ఇక్కడ, ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. 

 

 

 

*****



(Release ID: 1708052) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi