ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ భారతీయ వైద్యుల సమావేశాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి శ్రీ హర్షవర్ధన్ ప్రసంగం.
కరోనా మహమ్మారి కారణంగా మానవాళి మనుగడ సంక్షోభంలో పడ్డ సమయంలో భారతీయ వైద్యులు, నర్సులు, ఆరోగ్య భద్రతా కార్యకర్తలు తమ విశేషకృషితో ప్రపంచ విజేతలుగా నిలిచారు.
ప్రపంచ ఫార్మసీగా ప్రసిద్ధి చెందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచానికే టీకాలందిస్తూ కోవిడ్ 19 టీకా తయారీ కేంద్రంగా అవతరించింది.
Posted On:
28 FEB 2021 7:26PM by PIB Hyderabad
భారతీయ సంతతికి చెందిన వైద్యుల సంఘం ( అసోషియేషన్ ఫర్ ఫిజిసియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్- జిఏపిఐఓ) నిర్వహించిన అంతర్జాతీయ భారతీయ వైద్యుల సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లిడిన కేంద్ర మంత్రి శ్రీ హర్షవర్ధన్ జిఏపిఐఓ సేవలను ప్రశంసించారు. 2011లో ప్రారంభమైన ఈ సంస్థ అనతికాలంలలో భారతీయ సంతతికి చెందిన 1.4 మిలియన్ వైద్యులను ఒకే వేదిక మీదకు చేర్చిందని ఈ వేదిక ద్వారా వైద్యరంగ విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, పరిశోధనలను పంచుకుంటున్నారని ఇది చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ప్రతిభను చూపుతున్న భారతీయ వైద్యులను సభ్యులుగా కలిగిన ఈ సంస్థ ఈ రంంగంలో విశేషమైన కృషికి నిదర్శనంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా మానవాళి మనుగడ సంక్షోభంలో పడ్డ సమయంలో భారతీయ వైద్యులు, నర్సులు, ఆరోగ్య భద్రతా కార్యకర్తలు తమ విశేషకృషితో ప్రపంచ విజేతలుగా నిలిచారని వారి సేవలను కేంద్రమంత్రి కొనియాడారు. ధైర్య సాహసాలతో, నిస్వార్థంగా సమాజం సేవచేశారని ప్రశంసించారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికిగాను తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కరోనా వారియర్స్ సిద్ధపడ్డారని వారిపట్ల కృతజ్ఞత ప్రకటించడానికి తన వద్ద మాటలు లేవని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 నివారణకోసం, వైద్యచికిత్సల నిర్వహణకోసం అనుసరించాల్సిన ఉత్తమ విధానాల రూపకల్పనకోసం అంత్జాతీయ భారత వైద్యుల సాయాన్ని తీసుకోవడంలో జిఏపిఐఓ విశేష కృషి చేసిందని ఆయన అన్నారు.
కోవిడ్ 19 మహమ్మారి నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. కోవిడ్ 19కు సంబంధించిన పలు అంశాల్లో ప్రమాణాలను పాటిస్తూ వివిధ దశల్లో చర్యలను తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. తద్వారా మరణాల సంఖ్యను తగ్గించగలిగామని, రికవరీ రేటు పెరిగిందని ఆయన అన్నారు. ఒక పక్క కోవిడ్19 సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరో పక్క అత్యవసర వైద్య సేవలందించడంలో ఎలాంటి లోటులేకుండా చూశామని అన్నారు. విధానపరమైన పలు నిర్ణయాలను తీసుకొని టెలిమెడిసిన్ లాంటి సాంకేతికతతో కూడిన సేవలను అందించడం జరిగిందని ఆయన అన్నారు. తక్కువ సమయంలోనే అత్యధిక సేవలందించిన వేదికగా ఎలక్ట్రానిక్ సంజీవని నిలిచిందని ఈ విషయంలో ఇది రికార్డు అని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో భారతీయ శాస్త్రవేత్తలందించిన సేవలను ఆయన ప్రశంసించారు. రాత్రి పగలు తేడా లేకుండా మన శాస్త్రవేత్తలు పని చేసి దేశీయంగా టీకాలను తయారు చేశారని అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి వాటిని వినియోగంలోకి తెచ్చామని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమం భారతదేశంలో జరుగుతోందని ఇప్పటికే ఒక కోటి డోసుల టీకాలను వేయడం జరిగిందని ఆయన వివరించారు. భారతదేశ నిపుణుల ప్రతిభ, సామర్థ్యాలకు నిదర్శనంగా నిలిచేలా ఇప్పటికే భారతదేశానికి ప్రపంచ ఫార్మసీగా పేరు వచ్చిందని, ఇప్పుడు మనదేశం ప్రపంచ కోవిడ్ 19 టీకా కేంద్రంగా అవతరించిందని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ఆరోగ్య భద్రతా వ్యస్థలను బలోపేతం చేయడానికిగాను తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజనలాంటి పథకాల ద్వారా విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందడుగు వేస్తున్నామని ఆయన అన్నారు. జాతీయ వైద్య కమిషన్, నర్సింగ్ కమిషన్ బిల్, వివిధ ఆరోగ్య భద్రతా వృత్తుల జాతీయ కమిషన్ బిల్లులద్వారా నూతన ఆలోచనలు రూపుదాలుస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశవ్యాప్తంగా వైద్యకళాశాలల్ని విస్తరిస్తున్నామని, ఆరోగ్యభద్రతారంగ మౌలిక వసతులు పెంచుతున్నామని ఆయన అన్నారు. ఆరోగ్య సేవలను అందించే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
జిఏపిఐఓ లాంటి సంస్థల సహాయ సహకారాల కారణంగా ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు లబ్ధి పొందుతున్నాయని శ్రీ హర్షవర్ధన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. విజ్ఞానాన్ని పంచడంద్వారా ఉత్తమ విధానాలు రూపొందుతాయని అవి అమల్లోకి వస్తాయని తద్వారా సమాజానికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.
జిఏపిఐఓ అవార్డు విజేతలను కేంద్రమంత్రి అభినందించారు. అంతర్జాతీయ భారతీయ వైద్యుల సమావేశం విజయవంతంగా కొనసాగాలని శుభాభినందనలు తెలిపారు.
****
(Release ID: 1701615)
Visitor Counter : 144