ప్రధాన మంత్రి కార్యాలయం

2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 28 FEB 2021 11:42AM by PIB Hyderabad

నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం.  నిన్నటి రోజు న మాఘ పూర్ణిమ పండుగ ను జరుపుకోవడమైంది. మాఘ మాసం ప్రత్యేకించి నదులతో, చెరువులతో, నీటి వనరుల తో ముడిపడి ఉందని భావిస్తారు. మన గ్రంథాల లో :-

‘‘మాఘే నిమగ్నా: సలిలే సుశీతే,
విముక్త పాపా: త్రిదివమ్ ప్రయాన్తి’’ అని ఉంది.

ఈ మాటల కు, మాఘ మాసం లో ఏదైనా పవిత్ర జలాశయం లో స్నానం చేయడాన్ని పవిత్రమైంది గా పరిగణిస్తారు.  ప్రపంచం లోని ప్రతి సమాజం లో, నది తో ముడిపడ్డ సంప్రదాయం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది.  నదుల ఒడ్డు న అనేక నాగరకత లు అభివృద్ధి చెందాయి.  మన సంస్కృతి వేల సంవత్సరాల నాటిది కాబట్టి, నదుల నాగరకత ఇక్కడ మరీ ఎక్కువ గా ఉంటుంది.  దేశం లో ఏదో ఒక మూల న నీటి కి సంబంధించినటువంటి పండుగ లేని రోజు అంటూ ఉండనే ఉండదు.  మాఘ మాసం లో ప్రజలు వారి ఇళ్ల ను, కుటుంబాలను వదలిపెట్టి నెలంతా నదీతీరాల కు వెళ్తారు.  ఈ సారి హరిద్వార్‌ లో కుంభ మేళా కూడా జరుగుతోంది.  జలం మనకు జీవితం.  నీరే విశ్వాసం.  నీరే ప్రగతి ధార కూడాను.  నీరు చాలా ముఖ్యమైంది.  నీటి స్పర్శ తో ఇనుము బంగారం గా మారుతుందని ఒక తత్వవేత్త అంటారు.  అదేవిధం గా జీవితానికి కూడా నీటి స్పర్శ అవసరం.  అభివృద్ధి కి సైతం ఇది చాలా అవసరం.

మిత్రులారా, మాఘ మాసాన్ని నీటి తో అనుసంధానించడానికి మరొక కారణం ఉండవచ్చు.  ఈ మాసం నుంచి చలికాలం ముగుస్తుంది.  ఎండకాలం  మొదలవుతుంది.  నీటి ని పరిరక్షించడానికి ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించాలి.  కొన్ని రోజుల తరువాత మార్చి 22 వ తేదీ నాడు ‘ప్రపంచ జల దినం’ కూడా ఉంది.

ప్రపంచం లోని కోట్ల కొద్దీ ప్రజలు వారి జీవితం లో ఎక్కువ భాగాన్ని నీటి లోటు ను తీర్చుకోవడం కోసమే వెచ్చిస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరాధ్య గారు రాశారు.  ‘నీరు లేకుంటే అంతా శూన్యం’ అని ఊరకనే ఏమీ అనలేదు.  నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి పశ్చిమ బంగాల్‌ లోని ఉత్తర దీనాజ్‌పుర్‌ కు చెందిన సుజిత్ గారు నాకు చాలా మంచి సందేశాన్ని పంపారు.  ప్రకృతి మనకు నీటి రూపం లో ఉమ్మడి బహుమతి ని ఇచ్చిందని, కాబట్టి దానిని ఆదా చేయడం కూడా ఉమ్మడి బాధ్యత అంటూ సుజిత్ గారు రాశారు.  సామూహిక బహుమతి ఉన్నట్లే సామూహిక బాధ్యత కూడా ఉంటుంది.  సుజిత్ గారి మాట అచ్చం గా సరైందే.  నది, చెరువు, సరస్సు, వర్షం లేదా భూగర్భ జలం.. ఇవి అన్నీ కూడా ఉన్నది ప్రతి ఒక్కరి కోసం.

మిత్రులారా, ఒక కాలం అంటూ ఉండేది, అప్పుడు పల్లె లో బావుల ను, చెరువుల ను ఊరంతా కలిసి చూసుకొనే వారు.  ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నమే తమిళ నాడు లోని తిరువన్నామలై లో జరుగుతోంది.  అక్కడి స్థానికులు వారి బావుల ను సంరక్షించుకోవడం కోసం ఉద్యమాన్ని నడిపారు.  వారు వారి ప్రాంతం లో ఏళ్ల తరబడి మూతపడ్డ సార్వజనిక బావుల ను తిరిగి ఉపయోగం లోకి తీసుకువస్తున్నారు.

మధ్య ప్రదేశ్‌లో ని అగరోథా గ్రామాని కి చెందిన బబీతా రాజ్‌పూత్ గారు ఏదైతే చేస్తున్నారో, ఆ ప్రయత్నం మీకు అందరికీ ప్రేరణ ను ఇవ్వగలదు.  బబిత గారి గ్రామం బుందేల్‌ ఖండ్‌ లో ఉంది.  వారి పల్లె దగ్గర ఒకప్పుడు ఓ చాలా పెద్ద సరస్సుఉండేది, కానీ అది ఎండిపోయింది.  ఆమె గ్రామం లోని ఇతర మహిళల సాయం తీసుకొని సరస్సు దాకా నీటిని తరలించేందుకు ఒక కాలువ ను నిర్మించేశారు.  ఆ కాలువ ద్వారా వర్షం నీరు నేరు గా సరస్సు లోకి వెళ్ళసాగింది.  ఇప్పుడు ఆ సరస్సు లో నీళ్లు నిండుగా ఉన్నాయి.

మిత్రులారా, ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో నివసిస్తున్న జగదీశ్ కునియాల్ గారి కృషి కూడా ఎంతో నేర్పిస్తుంది.  జగదీశ్ గారి గ్రామం తో పాటు ఆ పరిసర ప్రాంతం నీటి అవసరాలకు సహజ వనరులపైన ఆధారపడింది.  అయితే చాలా సంవత్సరాల కిందట ఆ నీటి వనరు ఎండిపోయింది.  ఈ కారణం గా ఆ ప్రాంతం లో నీటి సంక్షోభం తీవ్రమైంది.  జగదీశ్ గారు ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికని మొక్కల ను నాటాలని నడుం కట్టారు.  ఆయన గ్రామస్తులతో కలసి ఆ ప్రాంతమంతా వేల కొద్దీ మొక్కలను నాటారు.  మరి ఈ రోజున ఆయన ప్రాంతం లో ఎండిపోయిన జలవనరులన్నీ తిరిగి నిండిపోయాయి.

మిత్రులారా, నీటి విషయం లో మనం ఇదే తరహా లో సామూహిక బాధ్యతల ను అర్థం చేసుకోవాలి.  భారతదేశం లోని చాలావరకు ప్రాంతాల లో మే-జూన్ లలో వర్షాలు కురవరడం మొదలవుతుంది.  మన చుట్టూ ఉన్న నీటి వనరుల ను శుభ్రపరచడానికి, వర్షం నీటి ని సేకరించడానికి 100 రోజుల ప్రచారాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించగలమా?  ఈ ఆలోచన తో కొన్ని రోజుల తరువాత జల శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ‘క్యాచ్ ది రెయిన్’ అనే పేరు తో జల శక్తి అభియాన్ ను ప్రారంభించడం జరుగుతున్నది.  ‘వర్షం ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా వెంటనే ఒడిసి పట్టుకోవాలి’ అనేది ఈ ప్రచార ఉద్యమం తాలూకు ప్రాథమిక సూత్రం.  మనం మొదటి నుంచి చేస్తున్న వాన నీటి సంరక్షణ ను ఇప్పటి నుంచి మళ్ళీ మొదలుపెట్టాలి.  వర్షం నీటి సేకరణ విధానం ఇప్పటి నుంచే అమల్లోకి తేవాలి.  గ్రామాల లో చెరువులు, జలాశయాల మార్గాల లో నీటి ప్రవాహానికి అడ్డు గా ఉన్న చెత్త ను తొలగించాలి.  నీటి మార్గానికి ఉన్న అవరోధాలను తొలగించడం ద్వారా వర్షం నీటి ని మరింత ఎక్కువగా నిలవ చేయగలుగుతాం.

నా ప్రియమైన దేశవాసులారా, మాఘ మాసాన్ని గురించి, ఈ మాసానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి చర్చ జరిగినపుడల్లా, ఒక పేరు ప్రస్తావన కు రాకుండా ఈ చర్చ పూర్తి కాజాలదు.  ఆ పేరే సంత్ రవిదాస్ గారు.  మాఘ పూర్ణిమ రోజుననే సంత్ రవిదాస్ గారి జయంతి కూడా జరుగుతుంది.  ఈ రోజుకు కూడా, సంత్ రవిదాస్ గారి మాట లు, ఆయన జ్ఞానం, మనకు మార్గ నిర్దేశం చేస్తున్నాయి.

ఆయన అన్నారు..


ఏకయి మాతీ కె సభ్ భాండే,
సభ్ కా ఏకౌ సిర్ జన్ హార్,
రవిదాస్ వ్యాపౌ ఏకౌ ఘట్ భీతర్,
సభ్ కౌ ఏకై ఘడై కుమ్హార్.. అని.

ఈ మాటల కు :-

మనమందరం ఒకే మట్టి తో తయారైన పాత్రలం. మననందరినీ దిద్దితీర్చింది ఒక్కరే. అని భావం.  సంత్ రవిదాస్ సమాజం లో ప్రబలంగా ఉన్న వక్రీకరణ ల గురించి  ఎల్లప్పుడూ దాపరికం లేకుండా తన మనస్సు లో మాటలను చెప్పారు. ఆ వక్రతలను సమాజం ఎదుట ఉంచి, వాటిని సరి చేసే దారి ని చూపించారు. అందుకే మీరా గారు అన్నారు కదా..

‘గురూ మిలియా రైదాస్,
దీన్హీ జ్ఞాన్ కీ గుట్ కీ’ అని.

సంత్ రవిదాస్ గారి జన్మస్థలమైన వారాణసీ తో జతపడటం నాకు దక్కినటువంటి  అదృష్టం.  సంత్ రవిదాస్ గారి జీవనం లోని ఆధ్యాత్మిక ఉన్నతి ని, ఆయన శక్తి ని నేను ఆ తీర్థ స్థలం లో అనుభవం లోకి తెచ్చుకోగలిగాను.

మిత్రులారా, రవిదాస్ అనే వారు..

కరమ్ బంధన్ మే బంధ్ రహియో, ఫల్ కీ నా తజ్జియో ఆస్
కర్మ్ మానుష్ కా ధర్మ్ హై, సత్ భాఖై రవిదాస్.. అని.

ఈ మాటలకు

‘కర్మ బంధనాలకు కట్టుబడి ఉండండి, ఫలాల ఆశ వద్దు; కర్మ మనిషి ధర్మం, నిజాయితీ రవిదాస్ మతం’ అని భావం.

అంటే మన పని ని నిరంతరం చేస్తూనే ఉండాలి.  అప్పుడు మనకు తప్పక ఫలం దక్కుతుంది.  అంటే కర్మ నుంచి సిద్ధి ఎలాగూ ఉంటుంది.  దాని ని గురించిన ఆలోచన వద్దు అని.  మన యువత సంత్ రవిదాస్ గారి నుంచి ఇంకొక విషయాన్ని కూడా నేర్చుకోవాలి.  యువకులు వారు ఏదైనా ఒక పని ని చేయడానికి పాత మార్గాలకు, విధానాలకు తమను తాము బంధించుకోకూడదు.  మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోండి.  మీ స్వంత మార్గాలను కూడా తయారు చేసుకోండి.  మీ లక్ష్యాలను మీరు స్వంతంగా నిర్ధారించుకోండి.  మీ వివేకం, మీ విశ్వాసం బలంగా ఉంటే, మీరు ప్రపంచం లో దేనికీ భయపడవలసిన అవసరం లేదు.  నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన యువత చాలా సార్లు పని చేయాలనుకుంటున్నా కొనసాగుతున్న ఆలోచన ల ఒత్తిడి లో పని చేయలేకపోతుంది.  అందువల్ల మీరు ఎప్పుడూ ఆలోచించడానికి, ఆవిష్కరించడానికి వెనుకాడకూడదు.  సంత్ రవిదాస్ గారు మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. ‘ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి’ అనేదే ఆ సందేశం.  మన కలల కోసం మనం వేరొకరి మీద ఆధారపడడం సరైంది కాదు.  రవిదాస్ గారు ఎప్పుడూ ఆ ఆలోచన కు సానుకూలం గా లేరు.  ఈ రోజు దేశ యువత కూడా ఆ ఆలోచన ధోరణి కి అనుకూలంగా లేరని మనం చూస్తున్నాం.  ఈ రోజు దేశం లోని యువత లో వినూత్న స్ఫూర్తి ని చూసినప్పుడు సంత్ రవిదాస్ గారు కూడా గర్వపడతారని నేను భావిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజు న ‘నేశనల్ సైన్స్ డే’ ను జరుపుకొంటున్నాం.  భారతదేశ గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. రమణ్ గారు చేసిన రమణ్ ఇఫెక్ట్ పరిశోధన కు గుర్తు గా ఈ రోజు న ‘నేశనల్ సైన్స్ డే’ జరుగుతోంది.  రమణ్ ఇఫెక్ట్ ఆవిష్కరణ యావత్తు సైన్స్ దిశ ను మార్చివేసిందని కేరళ కు చెందిన యోగేశ్వరన్ గారు నమోఆప్‌ (NamoApp) లో రాశారు.  దీనికి సంబంధించిన చాలా మంచి సందేశాన్ని నాసిక్ కు చెందిన స్నేహిల్ గారు కూడా నాకు పంపారు.  మన దేశంలో లెక్కలేనంత మంది శాస్త్రవేత్త లు ఉన్నారని, శాస్త్రవేత్త ల కృషి లేకుండా సైన్స్ ఇంత పురోగతి సాధించలేదని స్నేహిల్ గారు రాశారు. ప్రపంచం లోని ఇతర శాస్త్రవేత్తల గురించి మనకు తెలిసినట్టే భారతదేశ శాస్త్రవేత్తల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోత ల అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.  భారతదేశ శాస్త్రీయ చరిత్ర ను గురించి, మన శాస్త్రవేత్తల ను గురించి మన యువత తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, అధ్యయనం చేయాలని నేను  కోరుకుంటున్నాను.

మిత్రులారా, మనం సైన్స్ ను గురించి మాట్లాడేటప్పుడు, చాలా సార్లు ప్రజలు దీనిని భౌతిక శాస్త్రానికి, రసాయన శాస్త్రానికి లేదా ప్రయోగశాలల కు పరిమితం చేస్తారు.  కానీ, సైన్స్ దీని కంటే చాలా ఉన్నతమైంది. ‘స్వయంసమృద్ధియుత భారతదేశం ప్రచార ఉద్యమంలో సైన్స్ శక్తి తోడ్పాటు ఎంతో ఉంది. ‘ల్యాబ్ టు ల్యాండ్’ అనే మంత్రం తో మనం ముందుకు వెళ్ళాలి.

ఉదాహరణ కు హైదరాబాద్ లో చింతల వెంకట రెడ్డి గారు ఉన్నారు. రెడ్డి గారి డాక్టర్ స్నేహితుడు ఒకసారి ఆయనకు విటమిన్-డి లోపం వల్ల కలిగే వ్యాధులను గురించి, వాటి అనర్థాల గురించి చెప్పారు.  రెడ్డి గారు ఒక రైతు.  ఈ సమస్య ను పరిష్కరించడానికి ఏం చేయాలా అని ఆయన ఆలోచించారు. దీని తరువాత ఆయన చాలా కష్టపడ్డారు. విటమిన్-డి అధికంగా ఉండే గోధుమ, వరి పంటలను అభివృద్ధి చేశారు.  అదే నెలలో ఆయన కు జెనీవా లోని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ నుంచి పేటెంట్ కూడా లభించింది.  గత ఏడాది వెంకట్ రెడ్డి గారి ని పద్మశ్రీ తో సమ్మానించడం మన ప్రభుత్వానికి దక్కిన సౌభాగ్యం.

లద్దాఖ్‌ కు చెందిన ఉర్ గెన్ ఫుత్సౌగ్ గారు కూడా చాలా వినూత్న పద్ధతి లో పనిచేస్తున్నారు.  ఉర్ గెన్ గారు ఇంత ఎత్తు లో సేంద్రియ విధానం లో సుమారు 20 పంటలను పండిస్తున్నారు.  చక్రీయ పద్ధతి లో సాగు చేస్తున్నారు.  ఒక పంట వ్యర్థాలను ఇతర పంటల లో ఎరువు గా ఉపయోగిస్తారు.  ఇది అద్భుతమైన విషయం కదూ.

అదేవిధం గా గుజరాత్‌ లోని పాటన్ జిల్లా లో కామరాజ్ భాయ్ చౌదరి గారి ఇంట్లో మంచి మునగ కాయ విత్తనాలను అభివృద్ధి చేశారు.  మంచి విత్తనాల సహాయం తో ఉత్పత్తి అయ్యే మునగ కాయ నాణ్యత కూడా మంచిది. ఆయన ఇప్పుడు తన ఉత్పత్తులను తమిళ నాడు, పశ్చిమ బంగాల్ లకు పంపించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకొంటున్నారు.

మిత్రులారా, ఈ రోజుల లో మీరు చియా విత్తనాల పేరు తప్పక వింటూ ఉండవచ్చు.  ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు దీనికి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ప్రపంచం లో దీనికి చాలా డిమాండు ఉంది.  భారతదేశం లో ఇది ఎక్కువ గా విదేశాల నుంచి వస్తోంది.  కానీ ఇప్పుడు ప్రజలు చియా విత్తనాల విషయం లో స్వయంసమృద్ధి దిశ లో ముందడుగు వేస్తున్నారు.  ఈ విధం గా ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ లో హరిశ్చంద్ర గారు చియా విత్తనాల సాగు ను మొదలుపెట్టారు.  ఈ విత్తనాల సాగు వారి ఆదాయాన్ని కూడా పెంచుతోంది.  స్వావలంబనయుత భారతదేశం ప్రచారానికి సహాయపడుతుంది.

మిత్రులారా, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడానికి అనేక ప్రయోగాలు కూడా దేశవ్యాప్తం గా విజయవంతం గా జరుగుతున్నాయి.  ఉదాహరణ కు, మదురై కి చెందిన మురుగేశన్ గారు అరటి వ్యర్థాల నుంచి తాడు ను తయారు చేసే యంత్రాన్ని రూపొందించారు.  మురుగేశన్ గారి ఈ ఆవిష్కరణ పర్యావరణ సమస్యలను, వ్యర్థ పదార్థాల నిర్మూలన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.  అదనపు ఆదాయానికి రైతులకు ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది.

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల కు ఇలా చాలా మంది ని గురించి చెప్పడం వెనుక నా ఉద్దేశ్యం మనమంతా వారి నుంచి ప్రేరణ పొందుతాం అనేదే.  దేశం లోని ప్రతి పౌరుడు తన జీవితంలో ప్రతి రంగం లో విజ్ఞాన శాస్త్రాన్ని విస్తరిస్తే పురోగతి కి మార్గాలు కూడా తెరచుకొంటాయి.  దేశం సైతం స్వయంసమృద్ధి కలిగింది గా మారుతుంది.  ఈ దేశం లోని ప్రతి పౌరుడు/ పౌరురాలు దీన్ని చేయగలరన్న నమ్మకం నాకుంది.

నా ప్రియమైన మిత్రులారా, కోల్‌కాతా కు చెందిన రంజన్ గారు తన లేఖ లో చాలా ఆసక్తికరమైన, ప్రాథమిక ప్రశ్నలను అడిగారు.  అదే సమయంలో వాటికి ఉత్తమ సమాధానాలను కూడా ఇవ్వడానికి ప్రయత్నించారు.  మనం స్వావలంబన ను గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘‘స్వావలంబనయుత భారతదేశం ప్రచారం కేవలం ప్రభుత్వ విధానం కాదు, జాతీయ స్ఫూర్తి” అని ఈ ప్రశ్న కు సమాధానంగా ఆయన స్వయం గా రాశారు.  స్వయంసమృద్ధి గా ఉండడం అంటే తమ స్వంత విధి ని నిర్ణయించడం అని ఆయన అభిప్రాయం.  అంటే తమ భవిష్యత్తు ను తామే నిర్ణయించుకోవడం అని ఆయన  నమ్ముతారు.  రంజన్ బాబు గారి అభిప్రాయం వంద శాతం సరైంది.  ఆయన చెప్పిన విషయాన్ని మరింత వివరిస్తే- మన దేశ విషయాల గురించి గర్వపడడం, మన దేశ ప్రజలు చేసిన పనుల గురించి గర్వపడడం స్వయంసమృద్ధి (లేదా ఆత్మనిర్భరత) లో మొదటి అంశం గా ఉంటుంది.  ప్రతి దేశ వాసీ గర్వపడుతున్నప్పుడు, ఈ ప్రక్రియ లో అందరూ దేశవాసులూ పాలుపంచుకున్నప్పుడు స్వావలంబనయుత భారతదేశం కేవలం ఆర్థిక ప్రచారం గా కాక జాతీయ స్ఫూర్తి గా మారుతుంది.  మన దేశంలో తయారైన తేజస్ యుద్ధ విమానాల విన్యాసాలను ఆకాశం లో చూసినప్పుడు; భారతదేశంలో తయారైన యుద్ధ ట్యాంకులు, క్షిపణులు మన గౌరవాన్ని పెంచినప్పుడు; ధనిక దేశాలలోని మెట్రో రైళ్లలో ‘మేడ్ ఇన్ ఇండియా’ రైలు పెట్టెల ను చూసినప్పుడు; ‘మేడ్ ఇన్ ఇండియా’ కరోనా టీకామందు విదేశాలకు చేరుకొన్న విషయం చూసినప్పుడు, మన నుదురు మరింత ఉన్నతమవుతుంది.  పెద్ద విషయాలు మాత్రమే భారతదేశాన్ని స్వయంసమృద్ధి కలవిగా మారుస్తాయని కాదు.  భారతదేశం లో తయారైన దుస్తులు, భారతదేశం లోని ప్రతిభావంతులైన హస్తకళాకారులు తయారుచేసిన వస్తువులు, భారతదేశ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, దేశ మొబైల్ రంగం.. ఇలా ప్రతి రంగం లో మనం ఈ ప్రతిష్ఠ ను పెంచుకోవాలి.  ఈ ఆలోచన తో మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే మనం నిజంగా స్వావలంబన ను సాధించగలుగుతాం.  ఈ స్వావలంబనయుత భారతదేశ మంత్రం దేశం లోని ప్రతి గ్రామానికి చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది.  బిహార్‌ లోని బేతియా లో ఇదే జరిగింది. దీని ని గురించి నేను ప్రసార మాధ్యాల లో చదివాను.

బేతియా లో నివసించే ప్రమోద్ గారు దిల్లీ లో ఎల్‌ఇడి బల్బులను తయారు చేసే కర్మాగారం లో సాంకేతిక నిపుణుడి గా పని చేసే వారు.  ఆ కార్ఖానా లో పని చేసేటప్పుడు మొత్తం ప్రక్రియ ను చాలా దగ్గరగా అర్థం చేసుకొన్నారు.  కానీ కరోనా సమయం లో ప్రమోద్ గారు తన ఇంటికి తిరిగి రావలసి వచ్చింది.  తిరిగి వచ్చిన తరువాత ప్రమోద్ గారు ఏం చేశారో తెలుసా? ఎల్‌ఇడి బల్బుల తయారీ కి స్వయం గా ఒక చిన్న యూనిట్‌ ను ప్రారంభించారు.  ఆయన తన ప్రాంతం నుంచి కొంతమంది యువకులను తీసుకొని ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫ్యాక్టరీ యజమాని గా తన ప్రయాణాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేశారు.  అది కూడా తన తన సొంత ఇంట్లోనే నివసిస్తూ.

మరో ఉదాహరణ ఉత్తర్ ప్రదేశ్ లోని గఢ్ ముక్తేశ్వర్ కు సంబంధించింది.  కరోనా కాలం లో ఆపద ను ఒక అవకాశం గా తాను ఎలా మార్చుకొన్నదీ గఢ్ ముక్తేశ్వర్ నుంచి సంతోష్ గారు రాశారు.  సంతోష్ గారి పూర్వికులు అద్భుతమైన హస్తకళాకారులు.  వారు చాపల ను తయారు చేసే వారు.  కరోనా కాలం లో ఇతర పనులు ఆగిపోయినప్పుడు వారు గొప్ప శక్తి తో, ఉత్సాహం తో చాపలను తయారు చేయడం మొదలుపెట్టారు.  త్వరలో ఉత్తర్ ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాపల కోసం ఆర్డర్ లను అందుకొన్నారు.  దీనివల్ల ఈ ప్రాంతానికి చెందిన శతాబ్దాల నాటి  పురాతనమైనటువంటి, అందమైనటువంటి కళ కు కొత్త బలం లభించిందని సంతోష్ గారు చెప్పారు.

మిత్రులారా, దేశవ్యాప్తం గా అనేక ఉదాహరణలు ఉన్నాయి.  ఇక్కడ ప్రజలు స్వావలంబనయుత భారతదేశం ప్రచారానికి సహకరిస్తున్నారు.  ఈ రోజు న అది ఒక భావోద్వేగ అంశం గా మారిపోయింది.  ఈ భావోద్వేగం సాధారణ ప్రజల మనస్సుల లో  ప్రవహిస్తోంది.

నా ప్రియమైన దేశవాసులారా, గుడక గాఁవ్‌ లో నివసిస్తున్న మయూర్ గారి ఆసక్తికరమైన పోస్ట్ ను నమోఆప్‌ (NaMoApp) లో చూశాను.  ఆయన ఎంతో మక్కువ తో పక్షుల ను గమనిస్తుంటారు.  ప్రకృతి ప్రేమికుడు ఆయన.  తాను హరియాణా లో నివసిస్తున్నానని మయూర్ గారు రాశారు.  కానీ మీరు అసమ్ ప్రజలను గురించి, ముఖ్యంగా కాజీరంగ ప్రజల ను గురించి చర్చించాలి అని నేను కోరుకుంటున్నాను అంటూ ఆయన రాసుకొచ్చారు.  అసమ్ కు గర్వకారణమైన ఖడ్గమృగాలను గురించి మయూర్ గారు మాట్లాడతారు అని నేను అనుకున్నాను.  అయితే కాజీరంగా లో వాటర్ ఫౌల్స్ సంఖ్య పెరిగినందుకు అసమ్ ప్రజలను మయూర్ గారు అభినందించారు.  ఈ వాటర్‌ ఫౌల్స్ ను సులువైన భాషలో ఎలా చెప్పవచ్చో నేను అన్వేషిస్తున్నాను.  ఒక పదం కనుగొన్నాను. ఆ పదం ‘జలపక్షి’. చెట్ల మీద కాకుండా నీటి పై గూడు ఉండే పక్షి. బాతు లు మొదలైనవి.  కాజీరంగ నేశనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఆథారిటీ కొంతకాలం గా వార్షిక వాటర్ ఫాల్స్ సంతతి ని లెక్కించే పనిని చేస్తున్నాయి. ఈ లెక్కల ను బట్టి నీటి పక్షుల సంఖ్య తెలుస్తుంది.  వాటికి ఇష్టమైన ఆవాసాలు ఏమిటన్నది తెలుస్తుంది. రెండు-మూడు వారాల కిందట మళ్ళీ సర్వేక్షణ జరిగింది.  ఈసారి నీటి పక్షుల సంఖ్య గత సంవత్సరం తో పోలిస్తే సుమారు 175 శాతం పెరిగినట్లు తెలిస్తే మీకు కూడా సంతోషం గా ఉంటుంది.  ఈ లెక్క ల ప్రకారం కాజీరంగ జాతీయ ఉద్యానవనం లో మొత్తం 112 జాతుల పక్షులు కనిపించాయి.  వీటిలో 58 జాతుల పక్షులు యూరోప్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా లతో సహా ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుంచి శీత కాలం లో వలస వస్తాయి.   దీనికి ఇక్కడ మెరుగైన నీటి సంరక్షణ తో పాటు   మానవ ప్రమేయం చాలా తక్కువ ఉండడం కూడా ముఖ్య కారణం.  కొన్ని సందర్భాలలో సానుకూల మానవ జోక్యం కూడా చాలా ముఖ్యమైంది.

అసమ్ కు చెందిన శ్రీ జాదవ్ పాయెంగ్ ను చూడండి.  మీలో కొందరికి ఆయన ను గురించి తెలిసి ఉండవచ్చును.  ఆయన చేసిన కృషి కి పద్మ సమ్మానాన్ని అందుకొన్నారు.  అసమ్ లోని మజూలీ దీవి లో సుమారు 300 హెక్టేర్ ల క్షేత్రం లో తోట ల పెంపకం లో తన చురుకైన సహకారాన్ని ఆయన అందించారు.  ఆయన అటవీ సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు.  తోట ల పెంపకం లో, జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రజలను ప్రేరేపించడం లో కూడా పాల్గొన్నారు.

మిత్రులారా, అసమ్ లోని మన దేవాలయాలు కూడా ప్రకృతి పరిరక్షణ లో వాటిదైన పాత్ర ను పోషిస్తున్నాయి. మీరు దేవాలయాలను పరిశీలిస్తే ప్రతి ఆలయానికి ఒక చెరువు ఉందని మీకు తెలుస్తుంది.  హజో లోని హయగ్రీవ మధేబ్ ఆలయం, సోనిత్‌ పుర్‌ లోని నాగశంకర్ ఆలయం, గువాహాటీ లో నెలకొన్న ఉగ్రతార ఆలయం మొదలైన ఆలయాల సమీపం లో ఇలాంటి చెరువులు చాలా ఉన్నాయి. అంతరించిపోయిన జాతుల కు చెందిన తాబేళ్ల ను కాపాడటానికి వీటిని ఉపయోగిస్తున్నారు.  అసమ్ లో అత్యధిక జాతుల తాబేళ్లు ఉన్నాయి.  దేవాలయాల సమీపం లోని ఈ చెరువులు తాబేళ్ల సంరక్షణ, పెంపకం లతో పాటు తాబేళ్ల పెంపకం లో శిక్షణ కోసం ఒక అద్భుతమైన ప్రదేశం గా మారతాయి.

నా ప్రియమైన దేశవాసులారా, ఆవిష్కరణ చేయడానికి శాస్త్రవేత్త గా ఉండవలసిన అవసరం ఉందని కొంతమంది భావిస్తారు.  ఇతరులకు ఏదైనా నేర్పడానికి ఉపాధ్యాయుడి గా ఉండవలసిన అవసరం ఉందని మరికొందరు భావిస్తారు.  ఈ ఆలోచన ను సవాలు చేసే వారికి ఎల్లప్పుడూ ప్రశంస లు లభిస్తాయి.  ఎవరైనా సైనికుడి గా మారడానికి శిక్షణ పొందితే అతను సైనికుడి గా ఉండవలసిన అవసరం ఉందా?  అవును.. అది అవసరం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి.  కానీ ఇక్కడే చిన్న మెలిక ఉంది.

మైగవ్‌ (MyGov) లో కమలకాంత్ గారు ప్రసార మాధ్యమాలలో వచ్చిన ఒక నివేదిక ను గురించి వెల్లడించారు.  ఇది భిన్నమైన విషయం.  ఒడిశా లోని అరాఖుడ లో ఒక మంచి వ్యక్తి ఉన్నారు.  ఆయన పేరు నాయక్ సర్.  ఆయన పేరు సిలూ నాయక్ అయినప్పటికీ అందరూ ఆయన్ని నాయక్ సర్ అని పిలుస్తారు.  నిజానికి ఆయన ‘మేన్ ఆన్ ఎ మిశన్’ గా ఉన్నారు. సైన్యం లో చేరాలని కోరుకొనే యువకులకు శిక్షణ ను  ఆయన ఉచితం గా ఇస్తారు.  ఆయన సంస్థ పేరు మహాగురు బెటాలియన్.  శారీరిక దృఢత్వం నుంచి ఇంటర్ వ్యూ ల వరకు, రాయడం నుంచి శిక్షణ వరకు.. అన్ని అంశాలను అక్కడ నేర్పిస్తారు.  ఆ సంస్థ లో శిక్షణ పొందిన వ్యక్తులు సైన్యం, నౌకాదళం, వాయు సేన, సిఆర్ పిఎఫ్, బిఎస్ఎఫ్ ల వంటి సైనిక దళాల లో చేరారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  ఒడిశా పోలీస్ లో నియామకం కోసం ప్రయత్నించిన సిలూ నాయక్ సఫలుడు కాలేకపోయారు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయినప్పటికీ తన శిక్షణ ఆధారం గా ఆయన చాలా మంది యువకులను జాతీయ సేవ కు అర్హులు గా దిద్ద తీర్చారు.  రండి.. మన దేశానికి మరింత మంది నాయకులను సిద్ధం చేయాలంటూ నాయక్ సర్ కు శుభాకాంక్షలను తెలియజేద్దాం.

మిత్రులారా, కొన్నిసార్లు చాలా చిన్నదైన, సాధారణమైన ప్రశ్న కూడా మనస్సు ను కదిలిస్తుంది.  ఈ ప్రశ్నలు చాలా పెద్దవి కావు.. అవి చాలా సరళమైనవి.  అయినప్పటికీ అవి మనల్ని ఆలోచింపజేస్తాయి.  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ కు చెందిన అపర్ణరెడ్డి గారు నన్ను అలాంటి ఒక ప్రశ్న అడిగారు. “మీరు చాలా సంవత్సరాలు ప్రధాన మంత్రి గా ఉన్నారు.  చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉన్నారు.  ఇంకా ఏదో లోటు గా ఉంది అని మీకు ఎన్నడైనా అనిపిస్తుందా?” అంటూ అపర్ణ గారు అడిగారు.  అపర్ణ గారి ప్రశ్న చాలా సులభమైంది. కానీ ఆ ప్రశ్న కు జవాబు చెప్పడం కష్టమైన పని. నేను ఈ ప్రశ్న ను గురించి చాలా ఆలోచించాను.  నా లోటుల లో ఒకటి, ప్రపంచం లో అన్నింటి కంటే పురాతనమైనటువంటి భాష అయిన తమిళాన్ని నేర్చుకోవడానికి నేను పెద్ద గా ప్రయత్నం చేయకపోవడం అని, నేను తమిళం నేర్చుకోలేకపోయానని నాలో నేను అనుకున్నాను.  తమిళం చాలా సుందరమైనటువంటి భాష.  ప్రపంచవ్యాప్తం గా ప్రాచుర్యం పొందింది.  తమిళ సాహిత్యం లోని నాణ్యత, ఆ భాష లో రాసిన కవిత ల లోతు ను గురించి చాలా మంది నాకు చాలా చెప్పారు.  మన సంస్కృతి కి, గౌరవాని కి ప్రతీక అయిన అనేక భాష ల నిలయం భారతదేశం.  భాష ను గురించి మాట్లాడుతూ, నేను ఒక చిన్న ఆసక్తికరమైన క్లిప్‌ ను మీ అందరికి వెల్లడి చేయాలనుకొంటున్నాను.


సౌండ్ క్లిప్- స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
## (sound clip Statue of Unity)

(సౌండ్ బైట్ ను తర్జుమా చేయనక్కర లేదు)
 

నిజానికి మీరందరూ వింటున్నది, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని గురించి ఒక గైడ్, సంస్కృతం లో ప్రజలకు ప్రపంచం లో అత్యంత ఎత్తయినది అయినటువంటి సర్ దార్ పటేల్ ఏక్యత విగ్రహం గురించి చెబుతున్న మాటలు. కేవడియా లో 15 మంది కి పైగా గైడ్‌ లు సంస్కృతం లో ప్రజలకు మార్గనిర్దేశం చేస్తారని తెలుసుకొంటే మీకు సంతోషం గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మరో గొంతు ను వినిపిస్తాను. -

## (sound clip Cricket commentary- no need to transcribe the byte)

## (సౌండ్ క్లిప్ క్రికెట్ వ్యాఖ్యానం- బైట్‌ ను లిప్యంతరీకరించాల్సిన అవసరం లేదు)

ఇది కూడా మీరు విని ఆశ్చర్యపోయి ఉంటారు.  వాస్తవానికి, ఇది సంస్కృతం లో జరుగుతున్న క్రికెట్ వ్యాఖ్యానం.  వారాణసీ లో సంస్కృత మహావిద్యాలయాల మధ్య క్రికెట్ టువర్నమంట్ జరుగుతుంది.  ఈ కళాశాల లు – శాస్త్రార్థ్ మహావిద్యాలయం, స్వామి వేదాంతి వేద విద్యాపీఠ్, శ్రీ బ్రహ్మ వేద విద్యాలయ, అంతర్జాతీయ చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్.  ఈ టువర్నమంట్ తాలూకు మ్యాచ్‌ ల సందర్భం గా సంస్కృతం లో కూడా వ్యాఖ్యానం ఉంటుంది.  ఇప్పుడు ఆ వ్యాఖ్యానం లో చాలా చిన్న భాగాన్ని మీకు వినిపించాను.  ఇది మాత్రమే కాదు.. ఈ టువర్నమంట్  లో ఆటగాళ్ళు, వ్యాఖ్యాత లు సంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు.  మీకు శక్తి, ఉత్సాహం, ఉత్కంఠ ఒకేసారి కావాలి అంటే మీరు ఆట ల వ్యాఖ్యానాన్ని వినాలి.  టీవీ రాక ముందు క్రికెట్, హాకీ ల వంటి క్రీడల కు వ్యాఖ్యానం దేశ ప్రజల ను రోమాంచితం చేసే మాధ్యమంగా ఉండింది.  టెనిస్, ఫుట్‌బాల్ మ్యాచ్‌ ల వ్యాఖ్యానం కూడా చాలా బాగా జరుగుతుంది. వ్యాఖ్యానం గొప్ప గా ఉండే ఆట లు చాలా వేగం గా అభివృద్ధి చెందుతాయని మనం చూశాం.  మనకు ఇక్కడ చాలా భారతీయ క్రీడ లు ఉన్నాయి.  కానీ వాటిలో వ్యాఖ్యాన సంస్కృతి రాలేదు.  ఈ కారణం గా అవి అంతరించిపోయే స్థితి లో ఉన్నాయి.  నా మనస్సు లో ఒక ఆలోచన ఉంది.  అది.. వేరు వేరు ఆటల లో- ముఖ్యం గా భారతీయ క్రీడల లో మంచి వ్యాఖ్యానాన్ని మరిన్ని భాషల లో ఎందుకు ఉండకూడదు.. అనేదే.  దీనిని ప్రోత్సహించడాన్ని గురించి మరి మనం తప్పక ఆలోచించాలి.  క్రీడా మంత్రిత్వ శాఖ ను, ప్రైవేటు సంస్థల సహచరులను దీనిని గురించి ఆలోచించవలసింది అని  నేను విన్నవిస్తాను.

నా ప్రియమైన యువ మిత్రులారా, రాబోయే నెలలు మీ అందరి జీవితం లో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి.  చాలా మంది యువ మిత్రులకు పరీక్షలు ఉన్నాయి.  మీరు యోధులు (వారియర్స్) గా మారాలి తప్ప ఆందోళన చెందే వారి (వర్రీయర్స్) గా మారకూడదని మీకు గుర్తుంది కదా.  మీరు యోధులు గా మారాలి. ఆందోళన చెందకూడదు.  మీరు నవ్వుతూ పరీక్ష కు హాజరు కావాలి. నవ్వుతూ తిరిగి రావాలి.  ఇతరుల తో పోటీ పడటం కాక మీతోనే మీరు పోటీ పడాలి.  తగినంత సమయం నిద్ర పోవాలి.  సమయ నిర్వహణ కూడా ఉండాలి. ఆడడాన్ని ఆపేయకండి. ఎందుకంటే ఆడే వారు వికసిస్తారు.  పునర్విమర్శ లో, జ్ఞాపక శక్తి లో ఆధునిక పద్ధతులను అనుసరించాలి. మొత్తంమీద ఈ పరీక్షల లో మీరు మీ లోపలి ఉత్తమమైన సామర్థ్యాన్ని వెలికి తీయాలి.  ఇవన్నీ ఎలా జరుగుతాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు.  మనందరం కలసి ఈ కృషి చేయబోతున్నాం.  ప్రతి సంవత్సరం మాదిరి గా ఈ సారి కూడా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.  మార్చి నెల లో ‘పరీక్షా పే చర్చ’ ను జరగడానికి ముందు మీ అనుభవాలను, మీ చిట్కాలను పంచుకోవాలని పరీక్ష యోధుల ను, తల్లితండ్రులను, ఉపాధ్యాయులను నేను కోరుతున్నాను.  ఈ విషయాలను మీరు మైగవ్ (MyGov) లో పంచుకోవచ్చు. నరేంద్రమోదీ ఆప్‌ (NarendraModi App) లో శేర్ చేయవచ్చును.  ఈసారి యువతీయువకుల తో పాటు తల్లితండ్రులను, ఉపాధ్యాయులను కూడా ‘పరీక్షా పే చర్చ’ కు ఆహ్వానిస్తారు.  ఎలా పాల్గొనాలి, బహుమతి ని ఎలా గెలుచుకోవాలి, నాతో చర్చించే అవకాశాన్ని ఎలా పొందాలో మీకు సమస్త సమాచారం మైగవ్‌ (MyGov) లో లభిస్తుంది.  ఇప్పటివరకు లక్ష మంది కి పైగా విద్యార్థులు, సుమారు 40 వేల మంది తల్లితండ్రులు, సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.  మీరు కూడా పాలుపంచుకోండి.  ఎగ్జామ్ వారియర్ పుస్తకం లో నేను కొత్త అంశాలను జోడించేందుకు ఈ కరోనా కాలం లో కొంత సమయాన్ని తీసుకున్నాను.  పరీక్ష యోధుల పుస్తకం లో చాలా కొత్త విషయాలను జోడించాను.  ఇప్పుడు తల్లితండ్రులకు కూడా కొన్ని అంశాలను అందజేయడం జరిగింది.  ఈ అంశాల కు సంబంధించిన చాలా ఆసక్తికరమైన కార్యకలాపాలు నరేంద్రమోదీ ఆప్‌ (NarendraModi App) లో ఉన్నాయి.  ఇవి మీలోని పరీక్ష యోధుడి ని ప్రజ్వలింపజేసి, సఫలత ను సాధించేందుకు దోహదపడతాయి.  వాటిని మీరు తప్పక ప్రయత్నించాలి.  రాబోయే పరీక్ష ల సందర్భం లో యువ మిత్రులందరికీ అనేకానేక శుభకామన లు.

నా ప్రియమైన దేశవాసులారా, మార్చి నెల ఆర్థిక సంవత్సరం లో చివరి నెల.  కాబట్టి మీలో చాలా మంది తీరిక లేకుండా ఉండి ఉంటారు.  ఇప్పుడు దేశం లో ఆర్థిక కార్యకలాపాలు అధికం అవుతుండడం వల్ల వ్యాపారులు, వ్యవస్థాపక సహోద్యోగుల పని కూడా పెరుగుతోంది. ఈ పనులన్నిటి మధ్య కరోనా విషయం లో అప్రమత్తం గా ఉండడాన్ని తగ్గించకూడదు.  మీరందరూ ఆరోగ్యం గా ఉంటూ, సంతోషం గా ఉంటూ, మీ మీ విధులలో నిమగ్నం అయితేనే, అప్పుడే దేశం వేగం గా ముందుకు సాగుతూ ఉండగలదు.

మీ అందరి కి పండుగ ల కాలానికంటే ముందుగా ఇవే శుభాకాంక్షలు. శుభాకాంక్షల తో పాటు కరోనా విషయం లో ఏవైతే నిబంధనలను పాటించవలసి ఉందో ఆ విషయం లో అలసత్వం ఎంత మాత్రం తగదు.  అనేకానేక ధన్యవాదాలు.

 


 

***

 



(Release ID: 1701498) Visitor Counter : 383