ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కంపెనీలకోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు
प्रविष्टि तिथि:
08 FEB 2021 7:53PM by PIB Hyderabad
కోవిడ్ వ్యాప్తి సమయంలో దేశంలోని కంపెనీలకోసం కొన్ని చట్టాల నిబంధనలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలులోకి తెచ్చింది. 2013వ సంవత్సరపు కంపెనీల చట్టం, 2008వ సంవత్సరపు పరిమిత నష్టభాగస్వామ్యాల చట్టం, 2016వ సంవత్సరపు దివాలా, బ్యాంక్రప్టసీ చట్టం (ఐ.బి.సి.) నిబంధనలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలులోకి తీసుకువచ్చింది.
లోక్ సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఒక లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ విషయం తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన అందిస్తూ, తన మంత్రిత్వ శాఖకు చెందిన సమాచారాన్ని సభ్యులతో పంచుకున్నారు:
1. కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకాలు:-
- కంపెనీల ఫ్రెష్ స్టార్ట్ పథకం (సి.ఎఫ్.ఎస్.ఎస్.) 2020:- లెక్కలకు సంబంధించిన అధికారిక పత్రాల దాఖలు చేయడంలో విఫలమైన కంపెనీలకు అండగా నిలిచేందుకు కంపెనీల తాజా ప్రారంభ పథకాన్ని 2020 మార్చి 30న ప్రారంభించారు. ఇందుకు సంబంధించి 12/2020వ నంబరుతో ఒక సర్క్యులర్ ను కూడా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. పత్రాల దాఖలులో ఎలాంటి వైఫల్యం ఉన్నా అలాంటి కంపెనీలకు సహాయం అందించేందుకు, కంపెనీని తాజాగా ప్రారంభించేలా చేసేందుకు ఈ పథకం దోహదపడుతుంది. పత్రాల దాఖలులో జరిగిన జాప్యానికి విధించే పెనాల్టీని మాఫీ చేయడానికి, ఈ ఆంశంపై మరింత విచారణ జరగకుండా నివారించేందుకు కూడా ఈ పథకం వీలు కలిగిస్తుంది. మారటోరియం వ్యవధి (2020 ఏప్రిల్ 1నుంచి డిసెంబరు 31వరకూ)లో పత్రాలు, ఆదాయం రిటర్న్ వివరాలను కంపెనీలు మంత్రిత్వ శాఖ రిజిస్ట్రీలో ఆలస్యంగా దాఖలు చేసినా, అవి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించారు. రికార్డుల ద్వారా అందిన సమాచారం ప్రకారం 4,73,131 భారతీయ కంపెనీలు, 1,065 విదేశీ కంపెనీలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాయి. పెండింగ్ పత్రాలను దాఖలు చేయడానికి తాజా ప్రారంభ పథకాన్ని ఈ కంపెనీలు వినియోగించుకున్నాయి.
- పరిమిత నష్ట భాగస్వామ్యాల (ఎల్.ఎల్.పి.) పరిష్కార పథకం, 2020:- 2020వ సంవత్సరం మార్చి 4వ తేదీన ఈ పథకాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రారంభించింది. పరిమిత నష్ట భాగస్వామ్యాల (ఎల్.ఎల్.పి.) కింద కంపెనీలు తమ పెండింగ్ పత్రాలను కంపెనీ వ్యవహారాల రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆలస్యంగా దాఖలు చేసినప్పటికీ సదరు కంపెనీలపై అదనపు రుసుం వసూలు చేయకుండా ఒకేసారి పరిష్కరించే సదుపాయాన్ని కల్పిస్తూ ఈ పథకం తీసుకువచ్చారు. వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో ఎలాంటి అవాంతరం కలగకుండా చూసేందుకు ఈ పథకం దోహదపడుతుంది. కొన్ని రకాల పత్రాల దాఖలు చేసే ప్రక్రియకు సంబంధించి 2020 మార్చి 13నుంచి, 30వ తేదీవరకూ మొదట ఈ పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇదే పథకాన్ని మరింత సవరించి, విస్తరించి గత ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి డిసెంబరు నెలాఖరు వరకూ అమలు చేసి, అన్ని ఈ-ఫారమ్స్ కు వర్తింపజేశారు. రికార్డుల ద్వారా అందిన సమాచారం ప్రకారం 1,05,643 పరిమిత నష్ట భాగస్వామ్య సంస్థలు ఈ పథకాన్ని వినియోగించుకుని ప్రయోజనం పొందాయి.
- క్రియేషన్, మాడిఫికేషన్ చార్జీలకు సంబంధించిన పత్రాల దాఖలు గడవులో సడలింపునకు పథకం:- చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు, కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తగిన సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వ తీసుకునే చర్యలకు అనుగుణంగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకం ప్రవేశపెట్టింది. కంపెనీ ఏర్పాటు, సవరణల పత్రాల దాఖలు గడువులో సడలింపు ఇస్తూ పథకం తీసుకువచ్చారు. 23/2020 నంబరు జనరల్ సర్క్యులర్ ద్వారా గత ఏడాది జూన్ 17న ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం...:-
- క్రియేషన్, మాడిఫికేష్ చార్జీలకు సంబంధించిన తేదీ, గత ఏడాది మార్చి నెల ఒకటి కంటే ముందుగానే ఉండి, సదరు పత్రం దాఖలుకు గడువు, గత ఏడాది మార్చి 1నాటికి ముగిసిపోని పక్షంలో, పత్రం గత ఏడాది డిసెంబరు నెలాఖరులోగా భర్తీ చేసి ఉంటే, నిబంధనల ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి 29నాటికి చెల్లించదగిన చార్జీని మాత్రమే చెల్లించవచ్చు. పత్రం డిసెంబరు నెల తర్వాత భర్తీ చేసి ఉన్న పక్షంలో ఈ ఏడాది జనవరి ఒకటవతేదీనుంచి దాఖలు చేసే నాటి వరకూ జరిగిన గడువు వరకూ అదనపు రోజులను లెక్కించి ఫీజు వసూలు చేస్తారు. దీనికి తోడు కంపెనీ ఏర్పాటైన తేదీనుంచి గత ఏడాది ఫిబ్రవరి 29వ వరకూ గడువుకు కూడా అయిన చార్జీని కూడా చెల్లించవలసి ఉంటుంది.
- కంపెనీ ఏర్పాటు, మాడిఫికేషన్ తేదీ, గత ఏడాది మార్చి ఒకటి, డిసెంబరు 31మధ్య ఉన్నపక్షంలో, 2020 డిసెంబరు 31వ తేదీలోగా పత్రం భర్తీ చేసి ఉన్నట్టయితే, నిబంధనల ప్రకారం చెల్లించవలసిన సాధారణ రుసుం చెల్లిస్తే సరిపోతుంది. ఒక వేళ సదరు పత్రాన్ని 2020, డిసెంబరు 31 తర్వాత భర్తీ చేసి ఉంటే, ఏర్పాటు, మాడిఫికేషన్ తేదీని ఈ ఏడాది జనవరి ఒకటిగా పరిగణించి, భర్తీ చేసేనాటికి జరిగిన దినాలన్నింటినీ లెక్కించి సదరు వ్యవధిని ఫీజు చెల్లింపునకు అర్హమైనదిగా లెక్కలోకి తీసుకుంటారు
- పునరురుద్ధరణ జరిగిన కంపెనీలకు అదనపు ఫీజు మాఫీకోసం ఎన్.సి.ఎల్.టి. పథకం :- తిరిగి ప్రారంభమైన కంపెనీలకు అదనపు ఫీజు మాఫీచేసే ప్రయోజనం అందించేందుకు కండోనేషన్ ఆఫ్ డిలే పేరిట ఒక పథకాన్ని ఈ ఏడాది జనవరి 15వ తేదీన ప్రకటించారు. జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.టి.), కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 3/2021 నంబరు సర్క్యులర్ ద్వారా ఈ పథకాన్ని ప్రకటించాయి. గత ఏడాది డిసెంబరు ఒకటినుంచి అదే నెల 31వ తేదీలోగా ఎన్.సి.ఎల్.టి. ద్వారా పునరుద్ధరణ జరిగిన కంపెనీలకోసం కంపెనీల చట్టంలోని 252 సెక్షన్ కింద ఈ పథకాన్ని ప్రకటించారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి పత్రాలను దాఖలు చేయడంలో జరిగిన జాప్యాన్ని లెక్కలోకి తీసుకోకుండా, అందుకు అదనపు రుసుం చెల్లించకుండా నివారించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. ఇందుకు సంబంధించిన మిగతా నిర్దేశిత నిబంధనలను పథకానికి సంబంధించిన పత్రంలోనే పొందుపరిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీనుంచి ఈ పథకం అమలులో ఉంది. మార్చి నెలాఖరు వరకూ ఏ కంపెనీ అయినా ఓవర్.డ్యూ ఈ-ఫారమ్స్ భర్తీ చేయడానికి వీలుగా ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
కంపెనీలకోసం ప్రకటించిన వివిధ పథకాలపై మరిన్ని వివరాలను కేంద్రమంత్రి సభలో తెలియజేశారు. దివాలా, బ్యాంక్రప్టసీ చట్టం (ఐ.బి.సి.) లోని 4వ సెక్షన్ ప్రకారం అందే ప్రయోజనాలను వివరించారు. గత ఏడాది మార్చి 24వ తేదీన ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రయోజనాలను ప్రకటించినట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం సవరించిన ఐ.బి.సి. చట్టాన్ని గత ఏడాది సెప్టెంబరు 23న నోటిపై చేశామని, సవరించిన ఈ చట్టం గత ఏడాది జూన్ 5నుంచే అమలులోకి వచ్చినట్టుగా పరిగణించామని చెప్పారు. దెబ్బతిన్న సదరు కంపెనీలపై ఆరునెలల వరకూ గడువుకు ఐ.బి.సి. చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించకుండా నివారించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. అలాగే, గత ఏడాది మార్చి 25నుంచి గరిష్టంగా ఏడాది గడువుకు వరకు సవరణ ప్రయోజనాలు అందేలా తగిన చర్యలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. గత ఏడాది మార్చి 25నుంచి కార్పరేట్ రుణగ్రస్తంగా మిగిలిన కంపెనీలన్నింటికీ దివాలా చట్టం సవరణ ప్రయోజనాలు వర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఐ.బి.సి. చట్టం ప్రకారం చర్యలను నివారించే గడువును గత ఏడాది డిసెంబరు 25నుంచి 3 నెలల గడువుకు పొడిగిస్తూ డిసెంబరు 22న నోటిఫికేషన్ జారీ చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి కాలంలో కంపెనీల డైరెక్టర్లకు వ్యక్తిగతంగా కలిగే నష్టాలనుంచి రక్షణ కల్పించేందుకు ఐ.బి.సి. చట్టంలోని 66వ సెక్షన్ ను కూడా సవరించినట్టు కేంద్రమంత్రి తెలిపారు.
****
(रिलीज़ आईडी: 1696410)
आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English