ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
Posted On:
03 APR 2020 9:21AM by PIB Hyderabad
ప్రియమైన నా దేశ ప్రజలారా,
కరోనా మహమ్మారి నేపథ్యం లో దేశం అంతటా లాక్ డౌన్ ను అమలు లోకి తెచ్చి నేటి కి తొమ్మిది రోజులు అవుతోంది. ఇంత కాలం మీరు చాటిన క్రమశిక్షణ, సేవాభావం ఇదివరకు ఎన్నడూ ఎరుగనివి.
ప్రభుత్వం, పాలన యంత్రాంగం, జనబాహుళ్యం కలసికట్టుగా ఈ స్థితి ని సాధ్యమైనంత చక్కటి పద్ధతి లో సంబాళించడానికి సకలశక్తులతోను పాటుపడ్డాయి. మార్చి నెల 22 వ తేదీ ఆదివారం నాడు కరోనా వైరస్ కు వ్యతిరేకం గా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఏ విధంగా అయితే మీరు కృతజ్ఞత ను వ్యక్తం చేశారో అది ఇవాళ అన్ని దేశాల కు ఒక ఉదాహరణ గా మారిపోయింది. దీనిని ప్రస్తుతం ఎంతో మంది అనుసరిస్తున్నారు.
అది జనతా కర్ఫ్యూ కావచ్చు, గంటలను మోగించడం కావచ్చు, చప్పట్లు చరచడం కావచ్చు, లేదా పళ్ళాలను మోగించడం కావచ్చు.. ఈ పరీక్ష కాలం లో వారందరూ దేశ ప్రజానీకం తన సామూహిక శక్తి ని గ్రహించుకొనేటట్లు చేశారు. కరోనా తో పోరాడటం లో దేశ ప్రజలందరూ ఐకమత్యం తో నడుచుకోగలరనే నమ్మకం ప్రగాఢం అయ్యేందుకు ఇది దారి ని చూపింది. మీ అందరి ఉమ్మడి శక్తి ఈ లాక్ డౌన్ కాలం లో వెల్లడి కావడాన్ని మనం గమనించవచ్చు.
మిత్రులారా, ప్రస్తుతం ఈ దేశం లో కోట్ల కొద్దీ ప్రజలు వారి ఇళ్ళలోనే ఉండటానికి సంసిద్ధులు అయినప్పుడు, వారు ఒంటరులుగా ఏమి చేయగలరు? అన్న ప్రశ్న ను ఎవరైనా వేయడం స్వాభావికమే అవుతుంది. ఇంత పెద్ద సమరాన్ని వారంతట వారు గా ఎలా జరుపుతారు? అని కొంతమందిలో ఆందోళన కూడా తలెత్తవచ్చు. మరెంతో మంది కి తాము ఈ విధం గా మరెన్ని రోజులను గడపాలి ? అనే ఆందోళన కూడా తలెత్తి ఉండవచ్చు.
మిత్రులారా, ఇది లాక్ డౌన్ అమలు లో ఉన్న కాలమే కావచ్చు, మరి మనం కచ్చితంగా మన ఇళ్ళకే పరిమితం కావలసి రావచ్చు. అయితే, మనలో ఏ ఒక్కరూ ఏకాకి గా లేరు. 130 కోట్ల మంది భారతీయుల సామూహిక శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. ఇది మనలో ప్రతి ఒక్కరి బలం గా కూడాను ఉన్నది. ఈ ఉమ్మడి శక్తి తాలూకు గొప్పతనాన్ని, శ్రేష్ఠత్వాన్ని, దివ్యత్వాన్ని ఎప్పటిప్పుడు అనుభవం లోకి తెచ్చుకోవడం మన దేశ ప్రజలందరికీ అవసరం.
మిత్రులారా, మన దేశం లో జనత ను జనార్దనుడని భావిస్తాం. ఈ కారణం గా, దేశ ప్రజలు అంత పెద్ద సమరాన్ని చేస్తూ ఉన్న కాలం లో, ఎవరైనా సరే ప్రజల రూపేణా వ్యక్తమవుతున్న ఈ సామూహిక అతీత శక్తి ని ఎప్పటికప్పుడు అనుభవం లోకి తెచ్చుకొంటూ ఉండాలి. ఈ అనుభవం మనలో ఉత్సాహాన్ని పెంపొందించి, స్పష్టత ను ఇచ్చి, దిశ ను అందిస్తుంది; అలాగే, ఒక ఉమ్మడి ధ్యేయాన్ని, శక్తి ని కూడా ఇస్తుంది.
మిత్రులారా, కరోనా మహమ్మారి తన వెంట తీసుకు వచ్చిన చీకట్ల నడుమ మనం అదే పని గా వెలుగు వైపునకు, ఆశ వైపునకు సాగిపోతూనే ఉండాలి. తీవ్ర స్థాయి లో ప్రభావితులైన మన పేద సోదరీమణులు, మన పేద సోదరుల ను నిరాశ వైపు నుంచి ఆశ వైపునకు మనం వెంటబెట్టుకొని పోవడానికి నిరంతరం పాటుపడాలి. మనం ఈ సంక్షోభం నుంచి తలెత్తుతున్న అనిశ్చితి ని, అంధకారాన్ని అంతం చేయాలి. ఇది కాంతి దిశ లో ప్రయాణించడం ద్వారానే సాధ్యమవుతుంది. మనం ఈ సంకటం తాలూకు చిమ్మచీకటి ని నలుదిక్కులా జ్యోతులను వెలిగించడం ద్వారానే ఓడించగలుగుతాం.
మరి, అందుకనే ఈ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీ న మనమంతా కలసి కరోనా సంక్షోభం చిమ్మిన చీకటి ని సవాలు చేయాలి. దీనికి గాను మనం వెలుగు కు ఉన్న శక్తి ని ఊతంగా తీసుకోవాలి. ఏప్రిల్ 5 న మనం 130 కోట్ల మంది భారతీయుల మహాశక్తి ని మేల్కొలుపుదాం. మనమందరం కలసి 130 కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తి ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఏప్రిల్ 5 వ తేదీ ఆదివారం మీరందరూ రాత్రి 9 గంటల వేళ ఓ 5 నిమిషాల ను నాకు ఇవ్వాలి అంటూ మిమ్మల్ని నేను కోరుతున్నాను. శ్రద్ధగా వినండి, ఏప్రిల్ 5 వ తేదీ న రాత్రి పూట 9 గంటలకు మీ ఇళ్ళ లో లైట్లు అన్నిటిని ఆర్పివేసి, మీ బాల్కనీల లోనో, లేదా మీ తలుపుల వద్దనో నిలబడి కొవ్వొత్తులను లేదా దీపాలను లేదా టార్చిలైట్ లను లేదా మొబైల్ ఫ్లాశ్ లైట్ లను 9 నిమిషాల పాటు వెలిగించండి. నేను మరోసారి చెప్తున్నాను.. కొవ్వొత్తులను గాని, లేదా ప్రమిదలను గాని, లేదా టార్చిలైట్ లను గాని, లేదా మొబైల్ ఫ్లాశ్ లైట్‌లను గాని ఏప్రిల్ 5 వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల సేపు వెలిగించండి.
ఆ సమయం లో మీరు గనుక మీ ఇళ్ళ లోని లైట్లు అన్నిటిని ఆపివేసి మనలో ప్రతి ఒక్కరమూ అన్ని దిశల లో ఒక దీపాన్ని వెలిగించాం అనుకోండి.. అప్పుడు, కాంతి తాలూకు ఒక మహాశక్తి ని మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. అది మనం పోరాటం సలుపుతున్న ఒక ఉమ్మడి ఉద్దేశ్యాన్ని స్పష్టం గా జ్యోతి రూపం లో చాటిచెప్తుంది. ఆ వెలుగు లో, ఆ తళుకు లో, ఆ మిరుమిట్లలో మనం ఒంటరి గా లేము అని, ఏ ఒక్కరు ఏకాకి గా లేరంటూ మన మనస్సులలో ఒక సంకల్పాన్ని చెప్పుకొందాం, రండి. అంటే, ఇలా 130 కోట్ల మంది భారతీయులు ఒకే సామాన్య సంకల్పం ద్వారా దీక్షాబద్ధులు అవుతున్నారు అన్న మాట.
మిత్రులారా, ఇదే సందర్భం లో నేను మరొక విజ్ఞప్తి ని కూడా చేయదలచాను. అది ఏమిటంటే, ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనేటప్పుడు, ఎవరైనా ఎక్కడైనా గుమికూడటం గాని, గుంపులు గా చేరడం గాని చేయకండి. దయచేసి రోడ్ల మీదికో, వీధులలోకో, లేదా మీరు నివసించే ప్రాంతాల వెలుపలికో వెళ్ళకండి. మీరు చేసే పని ని మీ ఇళ్ళ వాకిలి వద్దో, లేక బాల్కనీల లోనో ఉంటూ పూర్తి చేయండి. ఏ ఒక్కరు సురక్షిత దూరం తాలూకు ‘‘లక్ష్మణ రేఖ’’ ను ఎన్నటికీ దాటి బయటకు అడుగు పెట్టకండి. ఎట్టి పరిస్థితుల లోను సురక్షిత దూరాన్ని ఉల్లంఘించకూడదు. కరోనా వైరస్ శృంఖలాన్ని చేధించాలంటే ఉన్న ఒకే ఒక చింతామణి ఇది.
ఈ కారణం గా, ఏప్రిల్ 5వ తేదీన రాత్రి పూట 9 గంటలకు, కాసేపు ఏకాంతంగా కూర్చొని భరత మాత ను గుర్తు కు తెచ్చుకోండి; అలాగే, 130 కోట్ల మంది భారతీయుల మోములను ఒక బొమ్మ గా మీ తలపుల లోకి ఆహ్వానించండి. 130 కోట్ల మంది భారతీయుల సామూహిక సంకల్పాన్ని స్వీకరించి, ఆ సామూహిక అతీత శక్తి ని గ్రహింపు లోకి తెచ్చుకోండి. ఇది ఈ సంకట ఘడియ లో పోరాడే శక్తి ని, అలాగే గెలుస్తామన్న విశ్వాసాన్ని మనకు ప్రసాదిస్తుంది.
ఉత్సాహో బలవాన్ ఆర్య,
న అస్తి ఉత్సాహ్ పరమ్ బలమ్ ”
సహ ఉత్సాహస్య లోకేశు,
న కించిత్ అపి దుర్లభమ్”
- అని మనకు చెప్పడం జరిగింది.
ఈ మాటలకు.. మన ఉద్వేగానికి, మన ఉత్సాహానికి మించినటువంటి మరే గొప్ప శక్తి ఈ ప్రపంచం లో లేదు. ఈ శక్తి ని ఆధారం చేసుకొని ప్రపంచం లో మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు.. అని భావం.
రండి, తోడు గా ఉంటూ, మనమందరమూ కలసికట్టు గా ఈ కరోనా వైరస్ ను ఓడిద్దాం, భారత్ ను విజేత గా నిలబెడదాం.
మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 1694729)
Visitor Counter : 231