ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు దక్కాలి - ఉపరాష్ట్రపతి
• డేటా సైన్స్ విప్లవానికి ధీటుగా ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను నవీకరించాల్సిన అవసరం ఉంది

• సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలి

• గణితం దిశగా పిల్లల ఆసక్తిని పెంచేందుకు విద్యావేత్తలు సృజనాత్మక పద్ధతులను అవలంబించాలి

• సమాజంలో ముఖ్యంగా పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానం పట్ల జిజ్ఞాసను పెంచడం తక్షణావసరం

• చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమాటికల్ సైన్సెస్ లో జరిగిన సమావేశంలో ఉపరాష్ట్రపతి

• నూతన నివాస భవనాల విభాగాన్ని ప్రారంభించిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు

Posted On: 05 JAN 2021 1:27PM by PIB Hyderabad

శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, గణితం (STEM) రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. భారతదేశంలో అత్యధికంగా మహిళా నిపుణులు (సుమారు 40 శాతం) తయారు అవుతుండగా, ఉద్యోగాల్లో వారి వాటా 14 శాతం మాత్రమే ఉందని, ఈ పరిస్థితి మారాలని ఆయన ఆకాంక్షించారు. దీనితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు పరిశోధన రంగాల్లో సైతం వారి ప్రాతినిధ్యానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని సూచించారు

ఐఐటీల్లో శిక్షణ పొందే బాలికల సంఖ్యను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయన్న ఉపరాష్ట్రపతి, ఈ ప్రయత్నాల కారణంగా 2016లో 8 శాతం ఉన్న వారి సంఖ్య, ఇప్పుడు 20 శాతానికి పెరిగిందన్నారు. శాస్త్ర సాంకేతిక విభాగం ‘ఉమెన్ సైంటిస్ట్స్ ప్రోగ్రాం” ద్వారా చొరవ తీసుకోవడం అభినందనీయమన్న ఆయన, దీని వల్ల శాస్త్రీయ విజ్ఞానం, గణిత సంబంధిత రంగాల్లో వృత్తిని ఎంచుకునే దిశగా మహిళలకు ప్రోత్సాహం పెరిగిందని తెలిపారు. మహిళా శాస్త్రవేత్తలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆడపిల్లలకు స్ఫూర్తిదాయకంగా మారుతుందని, ఫలితంగా సమాన అవకాశాలతో భారతదేశ అభివృద్ధి వేగాన్ని సంతరించుకుంటుందని తెలిపారు.

చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమాటికల్ సైన్సెస్ (ఐ.ఎం.ఎస్సీ)లో శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, గణితం (STEM) రంగాల్లోని నవీన పోకడల గురించి, డేటా సైన్స్ విప్లవానికి ధీటుగా ఉద్యోగ కల్పనలో సామర్థ్యాన్ని పెంచుకోవలసిన అవసరం గురించి ఉపరాష్ట్రపతి దిశా నిర్దేశం చేశారు. డేటా కారణంగా శాస్త్రీయ విజ్ఞాన పోకడలు మారాయని అభిప్రాయపడిన ఆయన, యువ గ్రాడ్యుయేట్లు ఈ నూతన నైపుణ్యానికి ధీటుగా తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సంప్రదాయ ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను దాటి అధ్యయనం చేయాలని, ప్రస్తుత అవకాశాలకు, నూతన విధానాలకు ధీటుగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. 

ఐఐటీల వంటి జాతీయ సంస్థలు అందిస్తున్న దూర విద్య కోర్సుల విస్తరణ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రాంతీయ భాషల్లో సాంకేతిక కోర్సులను అందించాలని సూచించారు. 

గణిత శాస్త్ర ప్రాధాన్యత, ఈ రంగంలో భారతదేశ ఉన్నత వారసత్వం గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, దేశానికి గర్వకారణమైన గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ సేవలను కొనియాడారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని పిలుపునిచ్చిన ఆయన, మన విద్యార్థుల్లో ప్రతిభకు కొరత లేదని, దాన్ని గమనించి, ప్రోత్సహించడమే కీలకమని నొక్కిచెప్పారు. చాలా మంది పిల్లలు గణితమంటే సహజంగానే భయపడతారని, ఈ భయమే నేర్చుకునే ఆసక్తిని తగ్గిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ఈ సమస్యను అధిగమించేందుకు, పిల్లల్లో గణితం పట్ల ఆసక్తిని పెంచేందుకు రోట్ మెమోరైజేషన్ లాంటి ప్రత్యామ్నాయ సృజనాత్మక పద్ధతులను అవలంబించాలని విద్యావేత్తలకు సూచించారు. 

ఈ దిశగా మన ప్రయత్నాలకు తోడుగా నూతన విద్యావిధానంలోని నిబంధలను పూర్తిగా అమలు చేస్తూ, ప్రాథమిక విద్యా బోధనలో మార్పులకు నాంది పలకాలని ఉపరాష్ట్రపతి సూచించారు. శాస్త్రీయ పరిజ్ఞానం దిశగా విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా స్టెమ్ (STEM) రంగాన్ని బలోపేతం చేయాలన్న ఆయన, ఈ దిశగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రైవేట్ రంగం విద్యా సంస్థలతో భాగస్వామ్యం వహించాలని సూచించారు. 

నాణ్యమైన ప్రాథమిక పరిశోధనలను మరింతగా పెంచడంలో ఐ.ఎం.ఎస్సీ కృషిని అభినందించిన ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా మెగా సైన్స్ ప్రాజెక్టు అయిన “భారతదేశ ఆధారిత న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐ.ఎన్.ఓ)”లో వారి ప్రమేయం అభినందించదగినదని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా శాస్త్రీయ పరిశోధనకు నాయకత్వం వహించే దిశగా ప్రపంచ యమనికపై భారతదేశ స్థాయి మరింత పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

సైన్స్ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టిన ఇనిస్టిట్యూట్ చొరవను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, సమాజంలో ముఖ్యంగా పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానం పట్ల జిజ్ఞాసను పెంచడం తక్షణావసరమని తెలిపారు. 

ఈ సందర్భంగా ఐ.ఎం.ఎస్సీ. ప్రాంగణంలో నూతన నివాస సముదాయాన్నిఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీ కె.పి.అన్బళగన్, ఐ.ఎం.ఎస్సీ. డైరక్టర్ ప్రొ. వి.అరవింద్, కల్పకం అటమిక్ ఎనర్జీ విభాగం ఐ.జి.సి.ఏ.ఆర్. డైరక్టర్ డా. అరుణ్ కుమార్ భాదురి, రిజిస్ట్రార్ శ్రీ విష్ణు ప్రసాద్ సహా ఐ.ఎం.ఎస్సీ. అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది  పాల్గొన్నారు.

***(Release ID: 1686236) Visitor Counter : 60


Read this release in: English