విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కేంద్ర ఎక్సైజ్‌-కస్టమ్స్‌ విభాగం పత్రికా ప్రకటన

Posted On: 04 OCT 2020 10:00PM by PIB Hyderabad

విదేశాలకు చెందిన బంగారు కడ్డీలను తగిన పత్రాలేవీ లేకుండా ఇండిగో విమానం ద్వారా హైదరాబాద్‌ నుంచి ముంబై, జైపూర్‌ నగరాలకు దొంగచాటుగా తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి హైదరాబాద్‌ కస్టమ్స్‌ విభాగం అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు 3.10.2020 తెల్లవారుజామున కస్టమ్స్‌ అధికారులు షంషాబాద్‌లోని దేశీయ విమాన సరుకు రవాణా ప్రాంగణంలో అనుమానాస్పద సరుకుల పెట్టెలను చట్ట ప్రకారం నిశితంగా తనిఖీ చేశారు.

   ఈ సందర్భంగా కొన్ని సరుకుల పెట్టెలలో వివిధ రకాల బంగారు ఆభరణాలు, విదేశీ బంగారు కడ్డీలు, 999 స్వచ్ఛతగల వెండికడ్డీలు, సానబెట్టిన వజ్రాలు, విలువైన/పాక్షిక విలువగల రాళ్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ వాచీలు, ప్లాటినం చెవిదుద్దులు, పురాతన నాణేలను వారు కనుగొన్నారు. వీటన్నిటినీ చట్టపరమైన పత్రాలేవీ లేకుండా రవాణా చేస్తున్నట్లు తనిఖీలో నిర్ధారణ అయింది. దీంతో కస్టమ్స్ చట్టం-1962, కేంద్ర వస్తుసేవల పన్ను చట్టం (సీజీఎస్టీ)-2017 నిబంధనల ప్రకారం మొత్తం సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు కడ్డీలు 2.37 కిలోలు కాగా, బంగారు ఆభరణాలు 5.63 కిలోలున్నాయి. కాగా, స్వాధీనం చేసుకున్న సరుకుల విలువ ₹6,62,46,387గా అధికారులు నిర్ధారించారు. ఈ అక్రమ రవాణా కేసుపై అధికారులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

***


(Release ID: 1661662) Visitor Counter : 26
Read this release in: English