సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఉమ్మడి అర్హతా పరీక్ష నిర్వహణకోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరివర్తనాత్మక మార్పులకు మార్గం సుగమం చేస్తూ , నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎన్.ఆర్.ఎ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్.ఆర్.బి లు), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబిపిఎస్) నిర్వహించే తొలిస్థాయి పరీక్ష ల మల్టీ ఏజెన్సీ సంస్థ.
ఎస్.ఎస్.సి, ఆర్.ఆర్.బి, ఐబిపిఎస్‌లకు తొలిదశలో అభ్యర్థులను వడపోసే ఉమ్మడి అర్హతా పరీక్ష (సి.ఇ.టి)
సిఇటి: విప్లవాత్మక సంస్కరణలలో భాగంగా మెట్రిక్యులేషన్ (పదవతరగతి పాస్), హయ్యర్ సెకండరీ (12వ తరగతిపాస్), గ్రాడ్యుయేట్లకు కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ఉమ్మడి అర్హతా పరీక్ష (సి.ఇ.టి) నిర్వహణ.
ప్రతి జిల్లాలో సిఇటి: గ‌్రామీణ యువత, మహిళలు, అణగారిన వర్గాల అభ్యర్థులకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ప్రతి జిల్లాలో సిఇటి.
సిఇటి: ఆకాంక్షిత జిల్లాలలో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంచడంపై దృష్టి.
సిఇటి: ఏకీకృత పరివర్తనాత్మక రిక
Posted On:
19 AUG 2020 4:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో పరివర్తనాత్మక సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎ) ఏర్పాటుకు తన ఆమోదం తెలిపింది.
రిక్రూట్‌మెంట్ సంస్కరణలు-యువతకు వరం:
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు ఒకే అర్హతా నిబంధనలు ఉన్నప్పటికీ ,వివిధ పోస్టులకు బహుళ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే వేర్వేరు పరీక్షలకు హాజరు కావలసి ఉండేది.
అభ్యర్థులు పలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. వీరు ఈ పరీక్షలకు హాజరుకావడం కోసం దూరప్రాంతాలకు వెళ్లవలసి ఉండేది. ఇలా పలు రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరుకావడం విద్యార్ధులకు , అటు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు భారంగా ఉండేది. నివారింపదగిన, పదేపదే పెట్టే ఖర్చులు, శాంతి భద్రతలు, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, పరీక్షా కేంద్రాల విషయంలో సమస్యలు ఉండేవి. సగటున ప్రతి పరీక్షకు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్ధులు హాజరయ్యేవారు. ఈ ఉమ్మడి అర్హతా పరీక్ష తో అభర్ధులు ఒకసారి ఈ పరీక్షకు హాజరై, ఈ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే ఏదైనా ఒక లేదా అన్ని ఉన్నతస్థాయి పరీక్షలకు హాజరుకావడానికి వీలుంటుంది. ఇది అభ్యర్థులందరికీ ఒక వరం లాంటిది.
నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA)
బహుళ ఏజెన్సీ సంస్థ అయిన నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్.ఆర్.ఎ) గ్రూప్ బి, గ్రూప్ -సి (నాన్ టెక్నికల్) పోస్టులకు సంబంధించి అభ్యర్ధుల ను స్క్రీన్ చేయడానికి లేదా షార్ట్‌లిస్ట్ చేయడానికి ఉమ్మడి అర్హతా పరీక్షను నిర్వహిస్తుంది. ఎన్.ఆర్.ఎ లో రైల్వేమంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం, ఎస్.ఎస్.సి, ఆర్.ఆర్‌బి, ఐబిపిఎస్‌ల ప్రతినిధులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం , అత్యుత్తమ పద్ధతులకు ఎన్.ఆర్.ఎ ఒక స్పెషలిస్టు సంస్థగా ఉంటుంది.
అందుబాటులో పరీక్షా కేంద్రాలు:
దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు వల్ల దూర ప్రాంతాలలో నివశించే అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలు బాగా అందుబాటులోకి వస్తాయి. దేశంలోని 117 ఆకాంక్షిత జిల్లాలలో పరీక్షలు నిర్వహించేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టనుండడం వల్ల , అభ్యర్ధులు వారు నివశించే ప్రాంతానికి దగ్గరలోనే పరీక్ష రాయడానికి వీలు కలగనుండడం కీలక మలుపు. దీనివల్ల లభించే ప్రయోజనాలలో ఖర్చు, శ్రమ, భద్రత వంటివి ముఖ్యమైనవి.ఈ ప్రతిపాదన వల్ల పరీక్షా కేంద్రాలు గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు అందుబాటులో ఉండడమే కాక, దూరప్రాంతాలలో ఉన్న విద్యార్ధులు కూడా కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో పాలుపంచుకోవడానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యాన్నిపెంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఉపాధి అవకాశాలను ప్రజల వద్దకు తీసుకుపోవడం అనేది విప్లవాత్మకమైన చర్య. ఇది యువత సులభతర జీవనానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
పేద అభ్యర్ధులకు ఎంతో ఊరట:
ప్రస్తుతం బహుళ ఏజెన్సీలు నిర్వహిస్తున్న పలు పరీక్షలకు అభ్యర్దులు హాజరుకవలసి వస్తోంది. పరీక్షా ఫీజుతోపాటు, అభ్యర్ధులు ప్రయాణ, భోజన, లాడ్జింగ్ లాంటి ఇతర ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఇకనుంచి ఒకే ఒకే ఒకపరీక్షవల్ల అభ్యర్ధులకు చాలా వరకు ఆర్ధిక భారం తగ్గుతుంది.
మహిళా అభ్యర్ధులకు ఎంతో ప్రయోజనం:
మహిళా అభ్యర్దులు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ,వేర్వేరు పరీక్షలకు హాజరు కావాలంటే వారు రవాణాసదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, ఎంతో దూరంలో ఉన్న ప్రాంతంలో ఉండడానికి ఏర్పాట్లు చేసుకోవడం అవసరమయ్యేది. దూరంగా ఉన్న పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి మహిళా అభ్యర్ధులు ఒక్కోసారి తోడు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయనుండడం, గ్రామీణప్రాంత అభ్యర్ధులకు ప్రత్యేకించి మహిళా అభ్యర్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరం:
గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థుల ఆర్ధిక ఇతర పరిమితుల రీత్యా ఇంతకు ముందు, అభ్యర్ధులు తాము ఏ పరీక్షరాయాలో ఎంచుకోవాల్సి ఉండేది. కానీ ప్రస్తుత ఎన్.ఆర్.ఎ కింద అభ్యర్ధులు ఒక పరీక్ష రాసి చాలా పోస్టులకు పోటీ పడవచ్చు. ఎన్.ఆర్.ఎ తొలి దశ, టైర్ -1 పరీక్ష నిర్వహిస్తుంది. ఇది ఎన్నో ఇతర ఎంపికలకు పునాదిగా పనికివస్తుంది.
సిఇటి స్కోరు మూడేళ్లవరకూ పనికివస్తుంది,
ఎన్నిసార్లు అయినా రాయవచ్చు:
అభ్యర్దుల సిఇటి స్కోరు , ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు అయిన స్కోరులో ఉత్తమమైనది అభ్యర్ధి ప్రస్తుత స్కోరుగా పరిగణిస్తారు. అభ్యర్ధి సిఇటి పరీక్ష ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. దీనిపై పరిమితులు లేవు. అయితే గరిష్ఠ వయోపరిమితి నిబంధనలకు లోబడి ఇది ఉంటుంది. ఎస్.సి, ఎస్.టి, ఒబిసి ఇతర కేటగిరీల అభ్యర్ధులకు ప్రభుత్వ విధానం ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో రాయితీ ఉంటుంది. ఇది ఈ పరీక్షలు రాయడానికి ప్రతి సంవత్సరం పెట్టే కృషి, సమయం, డబ్బు వంటి ఇబ్బందులన్నింటినీ తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రమాణీకృత పరీక్షలు:
గ్రాడ్యుయేట్, హయ్యర్ సెకండరీ (12 పాస్), మెట్రిక్యులేట్ (10 పాస్) స్థాయి అభ్యర్దులకు, నాన్ టెక్నికల్ పోస్టులకు ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి), రైల్వే రిక్రూట్ మెంట్ బొర్డులు (ఆర్.ఆర్.బిలు), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబిపిఎస్‌లు) నిర్వహించే రిక్రూట్ మెంట్‌కు మూడు స్థాయిలలో వేరు , వేరుగా ఉమ్మడి అర్హతా పరీక్ష నిర్వహిస్తారు.. సిఇటి స్కోరు స్థాయిలో స్క్రీనింగ్ ఆధారంగా ప్రత్యేక టైర్ -2, టైర్ -3 తదితర ప్రత్యేక స్థాయిలలో సంబంధిత రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు పరీక్షలు నిర్వహిస్తాయి.ఈ పరీక్షకు పాఠ్యాంశాలు ప్రమాణాల ప్రకారం కామన్‌గా ఉంటాయి. ఇది అభ్యర్ధులపై భారాన్ని తగ్గిస్తుంది. ఇప్పటివరకు ప్రతి పరీక్షకు వేరు వేరుగా , వేరు వేరు పాఠ్యాంశాలతో పరీక్షలకు హాజరుకావలసి ఉండేది.
పరీక్షల షెడ్యూలు, కేంద్రాల ఎంపిక:
అభ్యర్ధులు కామన్ పోర్టల్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకునే సదుపాయం , పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పిస్తారు. అందుబాటును బట్టి వారికి పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. అంతిమంగా , అభ్యర్దులు తమ పరీక్షలను తాము ఎంచుకునే పరీక్షా కేంద్రంలో షెడ్యూలు చేసుకునే సదుపాయం కల్పించే స్థాయికి చేరేలా చూడడం దీని లక్ష్యం.
ఎన్.ఆర్.ఎ చే ఔట్ రీచ్ కార్యకలాపాలు:
బహుళభాషలలో పరీక్ష:
ఉమ్మడి అర్హతా పరీక్ష (సిఇటి)ను చాలా భాషలలో నిర్వహిస్తారు. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలవారు పరీక్షలు రాయడానికి వీలు కల్పిస్తుంది. ఎంపిక కావడానికి సమాన అవకాశాలు కల్పిస్తుంది.
స్కోర్‌లు- బహుళ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు అందుబాటు:
ముందుగా ఈ స్కోర్‌లను మూడు ప్రధాన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ఉపయోగించుకుంటాయి.అయితే, కొంత కాలానికి కేంద్ర ప్రభుత్వంలోని ఇతర నియామక సంస్థలు కూడా దీనిని అవలంబిస్తాయని భావిస్తున్నారు. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఇతర ఏజెన్సీలు కూడా వారు ఎంపికచేసుకునేట్టయితే వీటిని వినియోగించుకోవచ్చు. ఆ రకంగా ముందు ముందు సిఇటి స్కోరును కేంద్ర ప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగానికి సంబంధించిన రిక్రూటింగ్ ఏజెన్సీలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇది రిక్రూట్‌మెంట్‌పై సమయం, వృధా కాకుండా ఆయా సంస్థలకు తోడ్పడుతుంది.
రిక్రూట్‌మెంట్ సైకిల్ తగ్గింపు:
ఒకే ఒక అర్హత పరీక్ష వల్ల రిక్రూట్‌మెంట్ సైకిల్ వ్యవధి చెప్పుకోదగిన స్థాయిలో తగ్గుతుంది. కొన్ని విభాగాలు ద్వితీయ స్థాయి పరీక్షను తీసేసే ఆలోచనను సూచనప్రాయంగా తెలిపాయి. సిఇటి స్కోరు , ఫిజికల్ టెస్ట్‌లు, మెడికల్ పరీక్షల ఆధారంగానే రిక్రూట్‌మెంట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నాయి. ఇది రిక్రూట్‌మెంట్ సైకిల్‌ను బాగా తగ్గించడానికి తద్వారా పెద్ద ఎ త్తున యువతకు ప్రయోజనం కలిగించడానికి ఉపకరిస్తుంది.
ఆర్ధిక వ్యయం:
నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రభుత్వం రూ 1517. 57 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని మూడేళ్ల వ్యవధిలో వినియోగిస్తారు. ఎన్.ఆర్.ఎ ఏర్పాటుతోపాటు, 117 ఆకాంక్షిత జిల్లాలలో పరీక్షా మౌలికసదుపాయాల ఏర్పాటుకు వినియోగిస్తారు.
***
(Release ID: 1647049)
Visitor Counter : 276