ఆర్థిక మంత్రిత్వ శాఖ

అధికారులను ముఖాముఖి కలుసుకోనవసరం లేని ఐటి శాఖ సరికొత్త అసెస్ మెంట్ విధానం

Posted On: 03 AUG 2020 9:30PM by PIB Hyderabad

ఆదాయం పన్ను చెల్లింపుదారులు, అధికారులు ముఖాముఖి కలుసుకోవాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు టెక్నాలజీని వాడుకుంటూ పత్రాల దాఖలును సులభతరం చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించుకుంది. వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ కొన్ని పరిధులలో బృందాలకు కలిపి అసెస్ చేసే విధానాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఆదాయం పన్ను శాఖ అధికారి నీరజ్ కుమార్ ఈ మేరకు హైదరాబాద్ లో ఒక ప్రకటన విడుదల చేశారు.

 

ఆదాయపు పన్నుశాఖ తలపెట్టిన ఈ విధానం వలన పన్ను చెల్లింపుదారులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అనేకమార్లు ఆదాయం పన్ను కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం ఉండదు. అధికారి కోసం వేచి ఉండి సమయం వృధా చేసుకోనక్కర్లేదు. ఈ పథకం కింద పాటించాల్సిన విధానం ప్రామాణికంగా రూపొందటమే కాకుండా నిబంధనలు కూడా ఒకేవిధంగా ఉంటాయి. వేగంగా, న్యాయంగా పన్ను లెక్కింపు, అనవసరమైన భారీ విధింపులు లేకుండా చూడటం ఈ పథకం లక్ష్యం.

 

ఈ పరోక్ష అసెస్ మెంట్ పథకాన్ని 2019 సెప్టెంబర్ 12 న నోటిఫై చేయగా 2019 అక్టోబర్ 7న పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ పరోక్ష అసెస్ మెంట్ కు కేసుల ఎంపిక ఆటోమేటిక్ విధానంలో జరుగుతుంది. అదే విధంగా ఆ కేసులను ఈ-అసెస్ మెంట్ యూనిట్లకు కేటాయించటం కూడా రాండమ్ పద్ధతిలో జరుగుతుంది. సెంట్రల్ సెల్ నుంచి నోటీసులు వెలువడతాయి. అది మాత్రమే పన్ను చెల్లింపుదారులకు, ఐటి విభాగానికి మధ్య ఏకైక అనుసంధానం.

 

దేశవ్యాప్తంగా ఈ పరోక్ష అసెస్ మెంట్ పథకం కింద 58319 కేసులు ఉండగా వీటిలో 8701 కేసులకు ఎలాంటి చేర్పులూ లేకుండానే ఖరారయ్యాయి. 296 కేసుల విషయంలో మాత్రం అదనపు చేర్పులు ప్రతిపాదించగా అవి సమీక్షలో ఉన్నాయి.

 

హైదరాబాద్ లో ప్రస్తుతం ఒక ప్రాంతీయ ఈ-అసెస్ మెంట్ కేంద్రం ఉండగా తమకు పంపిన కేసులను ఇద్దరు ప్రిన్సిపల్ ఇన్ కమ్ టాక్స్ కమిషనర్లు పరిశీలిస్తున్నారు.

----


(Release ID: 1643251) Visitor Counter : 68


Read this release in: English