సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19ని అదుపులోకి తెచ్చేందుకు అలుపెరుగని పోరాటం సాగిస్తున్న కీలకమైన మానవ వనరుల ఆన్ లైన్ డేటాపూల్ కు ప్రభుత్వం శ్రీకారం
- కోవిడ్ పై పోరాటంలో భాగంగా జరుగుతున్న వివిధ కార్యకలాపాలకు రాష్ట్రస్థాయిలోను, జిల్లాస్థాయిలోను అందుబాటులో ఉన్న భారీ మానవ వనరుల సమాచారం
- మానవ వనరుల లభ్యతపై అందుబాటులో ఉన్న ఈ ఆన్ లైన్ వేదికను ఉపయోగించుకోవాలని రాష్ర్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలకు పిలుపు
- ఐగాట్ ప్లాట్ ఫారం ద్వారా ఆరోగ్య సంరక్షణ వృత్తిలోని వారికి శిక్షణ
Posted On:
19 APR 2020 7:31PM by PIB Hyderabad
కేంద్రప్రభుత్వం https://covidwarriors.gov.in పేరిట ఒక ఆన్ లైన్ డేటాపూల్ ను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగం, రాష్ట్ర, జిల్లా, స్థానిక సంస్థల పాలనా విభాగాలు ఉపయోగించుకునేందుకు ఈ ఆన్ లైన్ పూల్ లో ఆయుష్ వైద్యులు, నర్సులు, ఇతర హెల్త్ కేర్ వృత్తి నిపుణులు, ఎన్ వైకె, ఎన్సిసి ఎన్ఎస్ఎస్, పిఎంజికెవై, మాజీ సైనికోద్యోగులు అందుబాటులో ఉంటారు. కోవిడ్-19ని కట్టడి చేయడానికి, పోరాటానికి అత్యంత కీలకమైన ఈ మానవ వనరులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో నవీకరిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి ఎంఎస్ఎంఇ కార్యదర్శి మరియు మానవ వనరులపై సాధికార బృందం-4 చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ పాండా, డిఓపిటి కార్యదర్శి డాక్టర్ సి.చంద్రమౌళి దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు ఉమ్మడిగా ఒక లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన అత్యంత కీలకమైన మానవ వనరులు, వలంటీర్లతో కూడిన ఈ డాష్ బోర్డు తక్షణం అందుబాటులోకి వస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19పై పోరాటానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో వివిధ బృందాల వద్ద అందుబాటులో ఉన్న ఈ కీలకమైన మానవ వనరుల సమాచారం, నోడల్ అధికారుల వివరాలు కూడా అందులో సిద్ధంగా ఉంటాయని ఆ ప్రకటన తెలియచేశారు.
ప్రతీ ఒక్క బృందానికి చెందిన నోడల్ అధికారుల సమన్వయంతో అందుబాటులో ఉన్న మానవ వనరులను సంక్షోభ నివారణ/ అనుబంధ ప్రణాళిక రూపకల్పనకు ఉపయోగించుకోవచ్చునని రాష్ర్టాలకు పంపిన ఆ సందేశంలో తెలిపారు. అలాగే బ్యాంకులు, రేషన్ దుకాణాలు, మండీలు వంటి ప్రదేశాల్లో సామాజిక దూరం పర్యవేక్షించేందుకు, వృద్ధులు, దివ్యాంగులు, అనాథల సహాయానికి వలంటీర్ల సేవలు కూడా దీని ద్వారా పొందవచ్చునని తెలియచేశారు. అంతేకాదు అందుబాటులో ఉన్న మానవ వనరులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం ద్వారా అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ఇది సహాయకారిగా ఉంటుందని కూడా తెలిపారు.
అంతే కాదు...వైద్యులు, నర్సులు, పారామెడిక్ లు, పారిశుధ్య పనివారు, సాంకేతిక సిబ్బంది, ఆయుష్ వైద్యులు, సిబ్బంది, క్షేత్రస్థాయిలో ముందువరుసలో నిలిచి పని చేసే వారు, వలంటీర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన డిజిటల్ వేదిక ఏకీకృత ప్రభుత్వ ఆన్ లైన్ శిక్షణ (ఐగాట్) పోర్టల్ (https://igot.gov.in)లోని ఆన్ లైన్ శిక్షణ మాడ్యూళ్లను ఉపయోగించుకోవలసిందిగా ఆ లేఖలో సూచించారు.
మొబైల్, లాప్ టాప్, డెస్క్ టాప్ వంటి ఏ డివైస్ పై అయినా, ఏ సమయంలో అయినా ఈ పోర్టల్ ద్వారా శిక్షణ మెటీరియల్, మాడ్యూళ్లు పొందవచ్చు. ఇందులో ఇప్పటికే 12 కోర్సుల్లో 44 మాడ్యూళ్లు, 29 డాక్యుమెంట్లు, 105 వీడియోలు పొందుపరిచారు. వాటిలో కోవిడ్ మౌలికాంశాలు, వ్యాధి నివారణ, నిరోధం, పిపిఇల వినియోగం, క్వారంటైన్, ఐసొలేషన్, కోవిడ్-19 కేసుల నిర్వహణ (సారి, ఎడిఆర్ లు,సెప్టిక్ షాక్), ప్రయోగశాలల నుంచి సేకరించిన శాంపిల్స్, టెస్టింగ్, ఐసియు కేర్, వెంటిలేషన్ మేనేజ్ మెంట్ వివరాలు కూడా ఉన్నాయి. ప్రతీ రోజూ కొత్త మాడ్యూళ్లతో ఈ పోర్టల్ ను నవీకరిస్తూ ఉంటామని, అత్యవసర పరిస్థితిని బట్టి రాష్ట్ర/ జిల్లా యంత్రాంగాలు, స్థానిక సంస్థలు వాటిని ఉపయోగించుకోవాలని ఆ లేఖలో సూచించారు.
కోవిడ్-19 కారణంగా దేశానికి ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికలు రూపొందించి, తగు పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11 సాధికార బృందాలను ఏర్పాటు చేసిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వాటిలో ఎంఎస్ఎంఇ కార్యదర్శి డాక్టర్ పాండా నాయకత్వంలోని సాధికార బృందం-4కు కోవిడ్ సంబంధిత మానవ వనరులను గుర్తించడం, సామర్థ్య నిర్మాణాల బాధ్యత అప్పగించారు.
(Release ID: 1616268)
Visitor Counter : 125