PIB Headquarters
ఎంఎస్‌ఎంఇ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక: జి.కిషన్ రెడ్డి నైపుణ్యాలు విద్యలో ప్రాథమిక భాగంగా ఉండాలి ఎన్ ఐ -ఎంఎస్‌ఎంఇ లో అంతర్జాతీయ కార్యనిర్వాహక అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి
Posted On:
14 NOV 2019 6:14PM by PIB Hyderabad
"ఎంఎస్ఎంఇ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక" అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు, స్కిల్ ఇండియా కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కారణమని, ఎంఎస్ఎంఇ రంగానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ రోజు జరిగిన 2019-20 సంవత్సర అంతర్జాతీయ కార్యనిర్వాహక అభివృద్ధి కార్యక్రమం మొదటి దశ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 28 దేశాల నుండి 70 మంది అంతర్జాతీయ ప్రతినిధులు గత 6 వారాల ఇంటెన్సివ్ శిక్షణలో భారతీయ ఎంఎస్ఎంఇ అనుభవం యొక్క ప్రయోజనాన్ని పొందారు. శిక్షణ పూర్తి చేసిన వారందరు స్వావలంబన పొందేలా శిక్షణ ఇచ్చిన ఎంఎస్ఎంఇ అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
ఎంఎస్ఎంఇ: సంస్థల ద్వారా మహిళల సాధికారత, సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం, అభివృద్ధి, సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించడం వంటి కోర్సులు ప్రస్తుత సమయం, అవసరానికి అనుగుణంగా ఉన్నాయని మంత్రి కితాబిచ్చారు.
గడచిన ఐదున్నర సంవత్సరాల కాలం నుండి అభివృద్ధి వేగంగా జరుగుతోందని, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నైపుణ్యాభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, నైపుణ్యాభివృద్ధి కై ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఎంఎస్ఎంఇ వంటి సంస్థలు నైపుణ్యాలను, మార్కెట్ల అవగాహనను మెరుగుపర్చడానికి నిశ్శబ్దంగా నిరంతరం పని చేస్తూ, ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు. శక్తివంతమైన మరియు క్రియాశీలకమైన ఎంఎస్ఎంఇ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రధానంగా దోహదపడే వ్యవస్థాపకత ప్రోత్సాహానికి మంచి ప్రగతి సాధిస్తోంది.
ఎంఎస్ఎంఇ రంగం తగినంత ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషించడమే కాక, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు సహాయపడింది, తద్వారా ప్రాంతీయ అసమతుల్యతలను తగ్గించి జాతీయ ఆదాయం, సంపదలను సమానమైన పంపిణీకి హామీ ఇస్తుంది.
నైపుణ్యాలు విద్యలో ప్రాథమిక భాగంగా ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు; ప్రతి విద్యార్థి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంగాలలో నైపుణ్యాన్ని పొంది ఉండాలన్నారు. భారతదేశంలో కొత్త విద్యా విధానం ఈ సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుందని, విద్య సమగ్రంగా రూపాంతరం చెందాలంటే సాంకేతిక మార్పుల ద్వారా నడిచే నైపుణ్యాలతో మెరుగైన అనుసంధానం ఉండాలన్నారు. ప్రపంచం వేగంగా పురోగతి సాధిస్తోందని, ఇక్కడ సమస్య ఉపాధి కాదు, ఉపాధి సాధించడానికి దోహదపడే నైపుణ్యం, విజ్ఞానం పై ఈ అంశాలు ఆధారపడి ఉంటాయని మంత్రి అన్నారు.
భారతదేశంలో 63.4 మిలియన్ల ఎంఎస్ఎంఇలు ఉన్నాయి, ఇవి భారతదేశ జిడిపిలో 29%, ఎగుమతుల్లో 49%, ఎంఎస్ఎంఇ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించబడుతుందని, ఎందుకంటే ఈ రంగం ద్వారా 111 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తోందని శ్రీ రెడ్డి అన్నారు.
ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించి చేపట్టిన కొన్ని చర్యలను మంత్రి ప్రశంసించారు: సాంకేతికత సహాయం అందించడానికి అటల్ ఇన్నోవేషన్ సెంటర్, నిధుల సహాయాన్ని అందించడానికి ముద్రా బ్యాంక్, గ్రామీణ భారతదేశంలో సామాజిక, ఆర్థిక జీవితాన్ని మెరుగుపర్చాలని ఆకాంక్షించడం, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఎంఎస్ఎంఇ 25% సేకరణ, ఇ-మార్కెటింగ్ మద్దతుకై ఈ-బిజ్ పోర్టల్ మరియు 59 నిమిషాల్లో రూ. 1 కోటి వరకు రుణాన్ని మంజూరు చేసే కొత్త పోర్టల్. ఎంఎస్ఎంఇ మరియు గుర్తించబడని రంగాల సామాజిక భద్రతకు, సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు.
ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాకుండా కార్పొరేట్ రంగం కూడా నైపుణ్యాలను పెంపొందించడంలో చురుకైన భాగంగా మారుతున్నాయని, ఉపాధి కల్పనకు అవి కీలకంగా మారాలని మంత్రి అన్నారు. భారతదేశంలో వ్యాపారం చేయడానికి వ్యవస్థాపకులందరికీ ఈ సందర్భంగా స్వాగతం పలుకుతున్నామని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ హేమేంద్ర కె శర్మ, ఎంఎస్ఎంఇ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రశేఖర్, ఎంఎస్ఎంఇ ఇతర అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1591651)
Visitor Counter : 257