PIB Headquarters
మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శన ను ప్రారంభించనున్న మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్
Posted On:
24 JAN 2019 6:08PM by PIB Hyderabad
మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్బంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని గాంధీ దర్శన్ హాల్ లో మెగా డిజిటల్, ఛాయా చిత్ర ప్రదర్శన ను ఏర్పాటు చేస్తున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ ఛాయా చిత్ర ప్రదర్శన ను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ ప్రారంభిస్తారు.
ఈ చిత్ర ప్రదర్శనలో మహాత్మా గాంధీ బాల్యం నుండి చివరి దశ వరకు జరిగిన ఘటనల అరుదైన చిత్రాలు ఉంటాయి. చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం వంటి చారిత్రక ఘట్టాలూ, వాటి గురించిన అరుదైన చిత్రాలూ, మన స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన అనేక ఘటనలకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి.
గాంధీజీ బాల్యంలో చదివిన ఆల్ఫ్రెడ్ హై స్కూల్, బ్రిటీష్ వారు ఉప్పు పై విధించిన పన్నుకు వ్యతిరేకంగా చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం, గాంధీజీ జైలు జీవితం గడిపిన ఎరవాడ జైలు, దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వస్తున్న గాంధీజీ, కస్తూర్బా ల లాంటి అనేక అపురూప చిత్రాలు ప్రదర్శనలో కలవు.
ఈ చిత్ర ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ కంటెంట్ పొందుపరిచారు. మహాత్మా గాంధీ పర్యటించిన ప్రదేశాల తో కూడిన గాంధీ బయోగ్రఫీ మ్యాప్, పిక్చర్ పజిల్, చుక్కలను కలుపుతూ గాంధీజీ చిత్రాన్ని తయారు చేయడం, గాంధీజీ కి సంబంధించిన పదాలలో పదకేళి రూపొందించారు. అలానే మరో ప్రత్యేకత ఈ చిత్ర పదర్శన లో రాట్నం తో నూలు తయారు చేయడం ప్రదర్శిస్తూ, ఔత్సహికులకు రాట్నం తిప్పడం కూడా నేర్పుతారు.
ఈ చిత్ర ప్రదర్శన సందర్బంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన గేయ నాటక విభాగం సాంస్కృతిక కార్యక్రమాలు రోజూ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగనున్నాయి.
***
(Release ID: 1561365)
Visitor Counter : 414