ఆర్థిక మంత్రిత్వ శాఖ

బీమా నియంత్ర‌ణ రంగం లో భార‌త‌దేశానికి, యుఎస్ఎ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రానికి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 29 AUG 2018 1:40PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వహించిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ఇన్సూరెన్స్‌ రెగ్యులేట‌రీ అండ్ డివెల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ)కి, యుఎస్ఎ కు చెందిన ఫెడ‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ ఆఫీస్ కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) పైన సంత‌కాల‌కు  ఆమోదం తెలిపింది.

ప్ర‌భావం:

ప్ర‌తి ఒక్క ప్రాధికార సంస్థ యొక్క స్థూల దృష్టి తో పాటు ఇత‌ర చ‌ట్టప‌ర‌మైన బాధ్య‌త‌ల‌ను కూడా స‌మాద‌రించుకొంటూ, ఇరు ప‌క్షాల మ‌ధ్య స‌మాచారం ఆదాన ప్ర‌దానం, ప‌రిశోధ‌న సంబంధిత స‌హాయం స‌హా స‌మ‌న్వ‌యం, ఇంకా స‌హ‌కారాలకై ఒక స్వ‌రూపాన్ని ఈ ఎంఒయు స‌మ‌కూరుస్తుంది.  ఈ ఒప్పందం లో భాగంగా ఇరు దేశాలు నియంత్ర‌ణ ప‌ర‌మైన వివిధ విధుల‌ లో వాటి అనుభ‌వాన్ని ఒక‌దానితో మ‌రొక‌టి పంచుకోవాల‌ని త‌ల‌పోస్తున్నాయి.  అంతేకాకుండా శిక్ష‌ణ కార్య‌క‌లాపాల‌తో పాటు, ప‌ర‌స్ప‌ర స‌హాయాన్ని అంద‌జేసుకోవాల‌ని కూడా సంక‌ల్పిస్తున్నాయి.  బీమా రంగం లో ప‌టిష్ట‌మైన, వివేక‌వంత‌మైన‌ నియంత్ర‌ణ ద్వారా వినియోగ‌దారు హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, ఆర్థిక స్థిర‌త్వం, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల నిర్దేశం వంటి విష‌యాల‌ లో స‌హ‌కారానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలని కూడా భార‌త‌దేశం, యుఎస్ఎ లు  అంగీకరించాయి.

పూర్వ‌రంగం:

ఐఆర్‌డిఎఐ ని 1999 నాటి ఇన్‌సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డివెల‌ప్‌మెంట్ అథారిటీ యాక్ట్ పరిధి లో ఏర్పాటు చేయ‌డ‌మైంది.  భార‌త‌దేశం లో బీమా మ‌రియు రీ-ఇన్సూరెన్స్‌ వ్యాపారం ఒక క్ర‌మ ప‌ద్ధ‌తి లో వృద్ధి చెందేట‌ట్లుగా చూడ‌డం మరియు ఆ వ్యాపారాల‌ను ప్రోత్స‌హించ‌డం, క్ర‌మ‌బ‌ద్ధం చేయ‌డం కోసం ఐఆర్‌డిఎఐ ని స్థాపించారు.  ఇదే విధంగా యుఎస్ఎ లో బీమా రంగానికి చెందిన అన్ని అంశాల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారాన్ని ఫెడ‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ ఆఫీస్ (ఎఫ్ఐఒ)కు ద‌ఖ‌లు ప‌రిచారు.  అలాగే అంత‌ర్జాతీయ బీమా కు సంబంధించిన అంశాల‌లో యుఎస్ఎ కు ఎఫ్ఐఒ ప్రాతినిధ్యం వ‌హిస్తుంది.

భార‌త‌దేశం, యుఎస్ఎ లు ఒక‌దానితో మ‌రొక‌టి బ‌ల‌మైన వ్యాపార సంబంధాల‌ను క‌లిగివున్నాయి.  అంతేకాకుండా, ఈ రెండు దేశాలు వివిధ రాజ‌కీయ స్థాయిలో, ఇంకా ఆధికారిక స్థాయిలో క్ర‌మం త‌ప్ప‌క చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌స్తున్నాయి.  రెండు దేశాల‌కు మ‌ధ్య బహుళ రంగాల‌కు సంబంధించిన అంశాల‌లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని విస్తృత శ్రేణిలో బ‌లోపేతం చేసుకొనేందుకు వేరు వేరు సంస్థ‌లు సైతం ప‌ని చేస్తున్నాయి.

భార‌త‌దేశం లో విదేశీ ప్ర‌త్యక్ష పెట్టుబ‌డి ని స‌మ‌కూర్చుతున్న ప్ర‌ధాన దేశాల లో యుఎస్ఎ ఒక దేశం.  అనేక బీమా కంపెనీలు యుఎస్ఎ కేంద్రం గా ప‌ని చేస్తున్న బీమా కంపెనీల తో సంయుక్త సంస్థ‌ (జాయింట్ వెంచర్)ల‌ను నెల‌కొల్పాయి.  విదేశీ పెట్టుబ‌డి ప‌రిమితి ని 49 శాతానికి పెంచ‌డం తో భార‌త‌దేశ బీమా రంగం లో విదేశీ పెట్టుబ‌డులకు, మ‌రీ ముఖ్యంగా యుఎస్ఎ కేంద్రం గా ప‌ని చేస్తున్న కంపెనీలకు, మ‌రింత అవ‌కాశం ఏర్ప‌డింది.  ఈ కారణంగా, ఐఆర్‌డిఎఐ కి, యుఎస్ ఎ కు చెందిన ఎఫ్ఐఒ కు మ‌ధ్య కుదిరిన ద్వైపాక్షిక ఎంఒయు ఈ రెండు దేశాల లో విస్తృత ప్ర‌భావాన్ని చూప‌గ‌లుగుతుంది.

***



(Release ID: 1544599) Visitor Counter : 163


Read this release in: English , Tamil , Kannada