PIB Headquarters
ఔత్సాహిక పారిశ్రామికులు మరియు సంస్థల అభివృద్ధి అంశం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ను ప్రారంభించనున్న ఎన్ఐఎమ్ఎస్ఎమ్ఇ
Posted On:
18 MAY 2018 11:05AM by PIB Hyderabad
ఔత్సాహిక పారిశ్రామికులు మరియు సంస్థల అభివృద్ధి అంశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ( పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆంత్రప్రెన్యోర్ షిప్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్.. పిజి-డిఇఇడి) ని 2018 ఆగస్టు నెల నుండి సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల జాతీయ సంస్థ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) ప్రారంభించనుంది. సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల ( ఎమ్ఎస్ఎమ్ఇ ) మంత్రిత్వ శాఖ పరిధి లో ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ పనిచేస్తోంది. నవ పారిశ్రామికులు కాగోరే వారు, స్టార్ట్-అప్ ల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సిఇఒ లు), ఇంకా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకొనే ఔత్సాహికుల కోసం ఉద్దేశించినటువంటి ఈ డిప్లొమా 11 నెలల అవధి తో కూడిన పూర్తి కాలపు పిజి డిప్లొమా అని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ చతుర్వేది ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భారత ప్రభుత్వం శిక్షణ మరియు నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థలను ప్రోత్సహించేందుకు కొన్ని కార్యక్రమాలను చేపడుతోందని ఆయన అన్నారు. అటువంటి నవ పారిశ్రామికులకు తగిన ఉపాయాలను అందజేయడం తో పాటు వారి వారి స్టార్ట్- అప్ లను మొదలుపెట్టే టట్లుగా తగిన మార్గదర్శకత్వాన్ని, సలహాలను అందించడం ఈ కోర్సు యొక్క ఉద్దేశం అని ఆయన వివరించారు.
నవ పారిశ్రామిక సంస్కృతి ని వ్యాప్తి చేయడం కోసం అనువైన వాతావరణంతెలంగాణ రాష్ట్రం లో నెలకొందని డాక్టర్ చతుర్వేది అన్నారు. ప్రాక్టికల్ శిక్షణ ను ఇవ్వడం ద్వారా విజయవంతమైన సంస్థలను మొదలు పెట్టే సత్తాను ఈ కోర్సు అందించి నవ పారిశ్రామికులను తీర్చిదిద్దగలదని ఆయన చెప్పారు. వ్యాపార నమూనా లు, ఆర్థికపరమైనటువంటి అంచనాల తో పాటు వినియోగదారుల అవసరాలను అంచనా వేయడంలో, మార్కెట్ ను విశ్లేషించుకోవడంలో మరియు పరిష్కార మార్గాలకు రూపు రేఖలు దిద్దడంలో ఈ కోర్సు తోడ్పడగలదని కూడా ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు వారి యొక్క కోర్సును ముగించిన తరువాతి నుండి 3 సంవత్సరాల వరకుఅభ్యర్థులకు కావలసిన ప్రావీణ్యాన్ని ఇన్‌స్టిట్యూట్ సమకూర్చుతుందని ఆయన వివరించారు.
2018 జూన్ 11వ తేదీ నుండి 22వ తేదీ మధ్య కాలంలో బృందాల వారి చర్చ మరియు ఇంటర్‌వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తులను http://www.nimsme.org/ ను సందర్శించడం ద్వారా కేవలం ఆన్‌లైన్ లో పంపుకోవలసి ఉంటుంది.
***
(Release ID: 1532701)