మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

రాజ‌స్థాన్ లోని ఝుంఝునూ లో ‘జాతీయ పోష‌ణ మిషన్’ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ‘బేటీ బచావో- బేటీ పఢావో’ ప‌థ‌కం విస్త‌ర‌ణ‌

Posted On: 08 MAR 2018 5:03PM by PIB Hyderabad

నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ పోషణ మిష‌న్ ను రాజ‌స్థాన్ లోని ఝుంఝునూ లో ప్రారంభించారు.  అంతేకాకుండా, బేటీ బచావో బేటీ పఢావో కార్య‌క్ర‌మ పరిధిని విస్త‌రిస్తున్నట్లు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.
 
మ‌హ‌త్వాకాంక్ష‌లు క‌లిగిన జిల్లాల‌కు చెందిన జిల్లా మేజిస్ట్రేటు ల‌తో ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు.  బేటీ బచావో బేటీ పఢావో కార్య‌క్ర‌మం ల‌బ్దిదారులైన మాతృమూర్తుల‌తో మ‌రియు బాలిక‌లతో కూడా ఆయన మాట్లాడారు.
 
బేటీ బచావో బేటీ పఢావో కార్య‌క్ర‌మంలో చ‌క్క‌ని ప‌ని తీరును క‌న‌బ‌రుస్తున్న జిల్లాల‌కు ధ్రువప‌త్రాల‌ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌దానం చేశారు.
 
ఈ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీమ‌తి వ‌సుంధ‌ర రాజె ప్ర‌సంగిస్తూ, ఒక కీల‌క‌మైన ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డానికి మ‌రియు మ‌రొక కార్య‌క్ర‌మాన్ని విస్త‌రించ‌డానికి ప్ర‌ధాన మంత్రి రాజ‌స్థాన్ ను ఎంచుకోవడంతో తాను సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.  మ‌హిళ‌ల సాధికారిత దిశ‌గా ప్ర‌ధాన మంత్రి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు రాజ‌స్థాన్ ఎల్ల‌ప్పుడూ మ‌ద్ధ‌తిస్తుంద‌ని ఆమె అన్నారు.  

పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చిన స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, సాంకేతిక విజ్ఞానం యొక్క శ‌క్తి అండదండలతో యావ‌త్తు దేశ ప్ర‌జ‌లు ఝుంఝునూ తో జోడింపబడ్డారని చెప్పారు.  బేటీ బ‌చావో బేటీ ప‌ఢావో ఉద్య‌మాన్ని ముందుకు తీసుకు పోతున్నందుకు ఝుంఝునూ జిల్లా ను ఆయ‌న మెచ్చుకొన్నారు.  ఆడ‌, మ‌గ అనే భేదం ప్రాతిప‌దిక‌న ఎలాంటి విచ‌క్ష‌ణనైనా ప్రదర్శించే ప్ర‌స‌క్తే ఉండద‌ంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

బాలుర మాదిరిగానే బాలిక‌లు కూడా నాణ్య‌మైన విద్యను అభ్య‌సించ‌డానికి ఉన్న‌ ప్రాముఖ్య‌ాన్ని ప్ర‌ధాన మంత్రి ఉద్బోధించారు.
 
కుమార్తె ఒక భారం కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తూ,  బాలిక‌లు అనేక రంగాల‌లో రాణిస్తూ మ‌న దేశానికి హోదాను మ‌రియు కీర్తి ని సంపాదించి పెడుతున్నార‌ని పేర్కొన్నారు. 
 
బాల‌ల‌కు స‌రైన పోష‌ణ‌ను అందించ‌డానికి ప్రాముఖ్య‌మివ్వాలని కూడా ఆయ‌న వివరించారు.  మ‌హిళ‌లు మ‌రియు బాల‌ల జీవితాల‌లో మిష‌న్ ఇంద్ర‌ధ‌నుష్ ఒక అత్యంత స‌కారాత్మ‌క‌మైన ప‌రివ‌ర్త‌న‌ను తీసుకు వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు.
 

***


(Release ID: 1523336)
Read this release in: English , Tamil