PIB Headquarters

హైదరాబాద్ లో ఫిబ్రవరి 26, 27 తేదీలలో ఇ-పరిపాలన పై 21వ జాతీయ సమావేశం

Posted On: 24 FEB 2018 5:44PM by PIB Hyderabad
Press Release photo

భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి).. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖతోను, తెలంగాణ ప్రభుత్వం తోను కలిసి ఇ-పరిపాలన పై 21వ జాతీయ సమావేశాన్ని 2018 ఫిబ్రవరి 26వ మరియు 27వ తేదీలలో తెలంగాణ లోని హైదరాబాద్ లో నిర్వహించనుంది.

ఈ సమావేశం ప్రారంభ సదస్సు కు తెలంగాణ ప్రభుత్వ ఐటి, పురపాలన పట్టణాభివృద్ధి, పరిశ్రమలు వాణిజ్యం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, చక్కెర, గనులు భూగర్భ శాస్త్రం, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామా రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. శాస్త్ర విజ్ఞానం సాంకేతిక విజ్ఞానం మరియు భూ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి శ్రీ వై.ఎస్. చౌదరి ప్రారంభ సదస్సుకు సభాధ్యక్షత వహించనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ శైలేంద్ర కుమార్ జోషి ప్రారంభ సదస్సులో ప్రసంగిస్తారు. వినియోగదారు వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సి.ఆర్. చౌదరి కూడా సభికులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.

  • సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి) కార్యదర్శి శ్రీ కె.వి. ఇయాపెన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. యుఐడిఎఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ అజయ్ భూషణ్ పాండే కీలకోపన్యాసం చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ ప్రకాశ్ సాహ్ నీ ఈ సదస్సులో మరొక ముఖ్య వక్తగా ఉంటారు.

అభివృద్ధి ని వేగవంతం చేయడంలో సాంకేతిక విజ్ఞానంఈ సంవత్సర సమావేశంలో ప్రధాన ఇతివృత్తంగా ఉంది. ప్రారంభ సదస్సు కు తరువాయిగా సమావేశం ఒకటో రోజున మరో 3 సర్వ సభ్య సదస్సులు కూడా నిర్వహించనున్నారు. వీటిలో భాగంగా ఇ-పరిపాలన ను అజమాయిషీ చేయడం, ఇ-పరిపాలన సార్వత్రీకరణ, ఇ-పరిపాలన తాలూకు మంచి పద్ధతులు/ ఉత్తమ పద్ధతులు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ల వంటి అంశాలపైన చర్చలు జరగనున్నాయి. సినర్జైసింగ్ రోల్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనే అంశం ముగింపు సదస్సు యొక్క ఇతివృత్తంగా ఉంటుంది.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా) సహాయ మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు శక్తి విభాగం, అంతరిక్ష విభాగం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఫిబ్రవరి 27వ తేదీన 2018 సంవత్సర జాతీయ ఇ- పరిపాలన పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులు మొత్తం 8 కేటగిరీలలో ఇ- పరిపాలన తాలూకు అనేక అంశాలకు సంబంధించి .. ప్రతి ఒక్క కేటగిరీ లోనూ స్వర్ణ పురస్కారం మరియు రజత పురస్కారాలతో కూడినవి అయి ఉంటాయి.

ఈ అవార్డులను గవర్నమెంట్ ప్రాసెస్ రి- ఇంజినీరింగ్ లోను, పౌర ప్రధానమైన సేవల అందజేత లోను, ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులలో నూతన ఆవిష్కారాల లోను శ్రేష్ఠతకుగాను ప్రదానం చేస్తారు. ఇంకా.. ఐసిటి ఆధారితంగా జిల్లా స్థాయి ఉత్తమ కార్యక్రమాలకు, ఇ- పరిపాలన లో అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం మరియు జిఐఎస్ ల వినియోగానికి, కేంద్ర ప్రభుత్వ పిఎస్ యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ పిఎస్ యులలో ఐసిటి ని వినూత్నమైన రీతిలో వినియోగించినందుకు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సహకార సంస్థలు/ సమాఖ్యలు/ సంఘాలలో అసాధారణమైన రీతిలో ఇ- పరిపాలన సంబంధిత చొరవల అమలుకు గాను ఇస్తారు.

పరిపాలన సంస్కరణల సంబంధ కార్యదర్శులు, మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్కరణల సంబంధ కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ ఐటి మేనేజర్లు, సాఫ్ట్ వేర్ సొల్యూషన్ ప్రొవైడర్లు, తదితర వర్గాలకు ఒక వేదికగా ఈ సమావేశం ఉపయోగపడనుంది. వారంతా ఈ సమావేశంలో పాలుపంచుకొని పరస్పరం చర్చలలో పాల్గొంటారు; తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు; సమస్యలపై చర్చోపచర్చలు చేస్తారు; సమస్యలకు తగిన పరిష్కార మార్గాలపై విశ్లేషిస్తారు.

ఉత్తమమైన పద్ధతులను, నూతన ఆవిష్కరణలను, ఐసిటి సొల్యూషన్ లను వెల్లడించేందుకు ఈ సమావేశం ఒక వేదికగా కూడా ఉంటుంది. వివిధ ప్రభుత్వ విభాగాలు ఇ- పరిపాలన ను అమలు చేయడంలో కనబరచిన ప్రావీణ్యాన్ని ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంకా ప్రభుత్వేతర సంస్థలు చేపట్టిన కార్యక్రమాలను సైతం ప్రోత్సహించేందుకు జాతీయ ఇ- పరిపాలన అవార్డులను ప్రదానం చేయనున్నారు.

***

 



(Release ID: 1521613) Visitor Counter : 93


Read this release in: English