జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది శుద్ధి మంత్రిత్వ శాఖ
నదీ జలాల వివాద పరిష్కారానికి జాతీయ స్థాయి ట్రిబ్యునల్
Posted On:
20 FEB 2018 6:20PM by PIB Hyderabad
రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో ఆమోదం లభించగలదన్న విశ్వాసాన్ని కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ వ్యక్తం చేశారు. దక్షిణ రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రుల, అధికారుల సమావేశం అనంతరం పత్రికా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల మధ్య నదీ జలాలపై వివాదాలు తలెత్తిన సమయంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరుగుతోందనీ, ట్రిబ్యునల్ తీర్పు నచ్చని రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయనీ, ఈ క్రమంలో ఎంతో కాలం, డబ్బు వృథా అవుతున్నాయనీ మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ వివిధ ట్రిబ్యునళ్ళ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న వివాదాలన్నీ ఇకపై కొత్తగా ఏర్పాటయ్యే ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయని, ఆయన వివరించారు.
ఇకపై నదీ జలాల వివాదాలను పరీవాహక ప్రాంత స్థాయిలో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని, ఆయన పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేయడాన్ని, రాష్ట్రాలు స్వాగతించాయని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ హరీశ్‌రావు, కేరళ జలవనరుల శాఖ మంత్రి శ్రీ మేథ్యూ, పాండిచ్చేరి మంత్రి శ్రీ కృష్ణారావు, జలవనరుల సంఘం ఛైర్మన్, శ్రీ ఎస్.ఎమ్. హుస్సేన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1521182)