గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్రామీణ ప్రాంతాలలో సామాన్య ప్రజలకు ఆహారం, వస్త్రాలు, గృహ వసతి కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది: గ్రామీణాభివృద్ధి , భూ వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్
Posted On:
12 FEB 2018 6:16PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తదితర ప్రభుత్వ పథకాల ద్వారా స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహారం, వస్త్రాలు మరియు గృహ వసతిని అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రామీణాభివృద్ధి, భూ వనరుల శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ అన్నారు. ఇక్కడి జాతీయ గ్రామీణాభివృద్ధి & పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్‌డి & పిఆర్), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘‘గ్రామీణాభివృద్ధి కోసం చిన్న వ్యాపార సంస్థలకు ఆర్థిక సహాయం’’ అంశం పై శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పుణే లోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ (సిఐసిటిఎబి) కూడా సహకరిస్తోంది. ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనున్న ఈ శిక్షణ కార్యక్రమంలో శ్రీ లంక, నేపాల్, బంగ్లాదేశ్ లతో పాటు భారతదేశం నుండి 35 మంది పాల్గొంటున్నారు. వీరే కాకుండా, నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ సోషల్ ఆడిట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కు, వాటర్ రిసోర్సెస్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ కు చెందిన శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్న 100 మంది కూడా ఎన్ఐఆర్‌డి & పిఆర్ లోని వికాస్ ఆడిటోరియమ్ లో జరిగిన మంత్రి ఉపన్యాస కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ ప్రసంగిస్తూ, 2022 కల్లా ‘న్యూ ఇండియా’ ను సాకారం చేసే కృషిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆ సంవత్సరానికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం వ్యవసాయం పైనా, నిరుద్యోగులైన గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం, గ్రామీణ అభివృద్ధి పైన నాణ్యమైన మౌలిక సదుపాయలను అందించడం కోసం విద్య మరియు ఆరోగ్య సంరక్షణల పైన శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్‌డి & పిఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు.ఆర్. రెడ్డి, ఇంకా అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు మరియు శిక్షణలో ఉన్నవారు సుమారు 300 మంది దాకా పాలుపంచుకొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనంతరం మంత్రి ఎన్ఐఆర్‌డి & పిఆర్ ప్రాంగణంలో ఉన్న రూరల్ టెక్నాలజీ పార్క్ (ఆర్‌టిపి) ని సందర్శించారు. ఒక ఆధునిక మినీ ట్రైనింగ్-కం-కాన్ఫరెన్స్ హాల్ ను, హైడ్రోపానిక్స్ యూనిట్ ను, ఇంకా సౌర శక్తితో పని చేసే మూడు కిలో వాట్ల విద్యుత్ ఉత్పాదక యూనిట్ ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. ‘సూర్య మిత్ర’ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న వారితో మంత్రి భేటీ అయ్యారు. కోర్సు పాఠ్యాంశాలను గురించి వారిని మంత్రి అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం సోలార్ టెక్నీషియన్ల కొరత చాలా ఉందని, ఈ నేపథ్యంలో జియుటిఎస్ సహకారంతో ఎన్ఐఆర్‌డి & పిఆర్ కార్యక్రమాలను చేపట్టడం మరియు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమైన ప్రయత్నమంటూ మంత్రి ప్రశంసించారు.
మంత్రి శ్రీ రామ్ కృపాల్ యాదవ్ తన పర్యటనలో భాగంగా సాంకేతిక విజ్ఞాన సంబంధ విభాగాలను కూడా సందర్శించారు. వాటిలో.. సోలార్ డీ-హైడ్రేషన్ అండ్ కూలింగ్ టెక్నాలజీ యూనిట్, పుట్టగొడుగుల సేద్య విభాగం, చేతులతో తయారుచేసే కాగితం విభాగం, తేనె శుద్ధి విభాగం, ఆదివాసీ ఆభరాణల విభాగం, వేప నూనె సంగ్రహణ విభాగం, కేక్ తయారీ విభాగం, ఎత్నిక్ బ్యాగ్స్ యూనిట్, లీఫ్ ప్లేట్- మేకింగ్ యూనిట్ తదితర విభాగాలు ఉన్నాయి. ఆయా యూనిట్ల భాగస్వాములతో మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువజనులకు ఉపాధి అవకాశాలను పెంపొందింపజేయడంలో రూరల్ టెక్నాలజీ పార్క్ (ఆర్ టిపి) చేస్తున్న కృషిని మంత్రి మెచ్చుకొన్నారు. పర్యావరణ స్నేహ పూర్వకమైన గృహ నిర్మాణ సంబంధిత సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనను తిలకించి ఈ పరిజ్ఞానాన్ని వ్యాప్తిలోకి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ రామ్ కృపాల్ యాదవ్ పేర్కొన్నారు. అలా చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం పెట్టుకొన్న ‘అందరికీ గృహ వసతి’ లక్ష్యాలను సాధించడంలో తోడ్పాటు లభించగలదని మంత్రి అన్నారు. ఈ కేంద్రం వృద్ధి పథంలో సాగాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక్కడ చేపడుతున్న కార్యకలాపాలను దేశంలోని వేరు వేరు ప్రాంతాలకు కూడా విస్తరింప చేసేందుకు గాను తాను గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రితోను, కార్యదర్శితోను చర్చిస్తానని చెప్పారు. మంత్రి వెంట వివిధ విభాగాలను సందర్శించిన వారిలో ఎన్ఐఆర్‌డి & పిఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హెడ్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ రమేశ్ శక్తివేల్, సీనియర్ కన్సల్టెంట్ శ్రీ మొహమ్మద్ ఖాన్, ప్రాజెక్టు ఇంజినీర్ శ్రీ బి.ఎన్ మణి లు ఉన్నారు.
***
(Release ID: 1520357)
Visitor Counter : 235