ఉప రాష్ట్రపతి సచివాలయం
జిఎస్‌టి వల్ల పన్ను చెల్లింపులు పెరుగుతాయి: ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు
Posted On:
23 JAN 2018 8:03PM by PIB Hyderabad
దేశ స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద పన్ను సంస్కరణగా పేర్కొనదగిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల పన్ను చెల్లింపులు పెరుగుతాయని, ఉప రాష్ట్రపతి, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రాలు వేసే అనేక రకాల పన్నులూ, కేంద్ర ప్రభుత్వం వేసే పన్నుల స్థానంలో దేశమంతా ఒకే పన్ను చెల్లించే వ్యవస్థ ఏర్పడిందని, ఆయన అన్నారు.
శ్రీ వెంకయ్య నాయుడు ఈ రోజు ‘ఫైనాన్స్, టాక్సేషన్, మార్కెటింగ్ రంగాలలో సమకాలీన సవాళ్ళు’ అన్న అంశంపై, కేశవ మెమోరియల్ విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ స్థాయి సెమినార్‌ను ప్రారంభించారు. తొంభైయవ దశాబ్దంలో వచ్చిన సరళీకరణ వల్ల మన దేశం త్వరితగతిన ఎదిగే ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిందని, ఉప రాష్ట్రపతి అన్నారు. 1991లో 225 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ ఇప్పుడు రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. శ్రీ పి.వి. నరసింహారావు ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలను శ్రీ వాజ్‌పేయి ప్రభుత్వం, ప్రస్తుతం శ్రీ మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
రానున్న కాలంలో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా భారతదేశ ఆర్థిక రంగాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని, ఉప రాష్ట్రపతి అన్నారు. 65 శాతం జనాభా 35 సంవత్సరాల లోపు వయసున్న వారు కనుక వీరికి ఉపాధి కల్పించవలసి ఉందనీ, అయితే వీరికి మెరుగైన జీవనం అందించే నైపుణ్యాలను అందించవలసి ఉందని అన్నారు.
దేశంలోని ప్రతి పౌరుడూ, పన్ను చెల్లించడం తమ పవిత్ర బాధ్యతని గుర్తెరగాలని శ్రీ నాయుడు అన్నారు. పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరి, మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టే వీలుంటుందని ఉప రాష్ట్రపతి తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలుకు ప్రధాన ఉద్దేశ్యం పన్ను చెల్లింపులు పెంచడమే అని, ఉప రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక రంగం పెరుగుతున్న కొద్దీ, పన్ను చెల్లింపులు పెరిగి, అభివృద్ధికి - రోడ్లూ, పాఠశాలలూ, ఆసుపత్రులూ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేయడానికి ఆస్కారం ఉంటుందని, శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి 2018లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేశాయనీ, రానున్న 10-15 సంవత్సరాలలో ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతున్నదనీ, ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. బ్యాంకుల వద్దకు చేరిన రూ. 2.11 లక్షల కోట్ల వల్ల రుణ లభ్యత పెరిగి, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని, ఆయన తెలిపారు.
ఆర్థిక రంగంలో అభివృద్ధి, సంస్కరణల వల్ల 50-100 మిలియన్ల జనాభా కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందనీ, మరొక 500-600 మిలియన్ల జనాభా, పేదరికం నుంచి బయటపడి, ఆర్థికంగా ఎదుగుతున్నారనీ, ఆయన అన్నారు.
నూతన పన్ను సంస్కరణలూ, పెరుగుతున్న నిత్యావసరాల ధరలూ, ప్రపంచ ఆర్థిక రంగంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులూ, భారత్ ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతాయనీ, ఈ సవాళ్ళను ఎదుర్కొనేలా కళాశాలలు పాఠ్యాంశాలను రూపొందించి, సమకాలీన అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు స్పందించేందుకు వారిని సంసిద్ధులను చేయాలని, శ్రీ వెంకయ్య నాయుడు సూచించారు.
కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ రామచంద్రం, యుజిసి సభ్యులు శ్రీ గోపాల రెడ్డి, కేశవ మెమోరియల్ విద్యా సంస్థల అధ్యక్షుడు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
****
(Release ID: 1517549)
Visitor Counter : 223