ప్రధాన మంత్రి కార్యాలయం

ఓఖీ తుఫాను బాధిత ప్ర‌జ‌ల‌తో ప్ర‌ధాన మంత్రి భేటీ; ల‌క్ష‌ద్వీప్‌, త‌మిళ‌ నాడు మరియు కేర‌ళ లలో తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌లలో పురోగ‌తిపై స‌మీక్ష‌

తుఫాను బాధిత రాష్ట్రాల‌కు స‌హాయ‌క చ‌ర్య‌ల ప్యాకేజీని ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 19 DEC 2017 6:51PM by PIB Hyderabad

ల‌క్ష‌ద్వీప్, త‌మిళ‌ నాడు మ‌రియు కేర‌ళ ల‌లో తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సంద‌ర్శించారు.  ఓఖీ తుఫాను వ‌ల్ల బాధితులైన మ‌త్స్య‌కారులతో, రైతుల‌తో మరియు ఇత‌ర ప్ర‌జలతో ఆయ‌న భేటీ అయ్యి వారితో సంభాషించారు.  ప్ర‌ధాన మంత్రి కవరత్తి మరియు క‌న్యాకుమారి ల‌లో ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు.  తుఫాను బారిన ప‌డ్డ గ్రామాల‌లో ఒక‌టైన తిరువ‌నంత‌పురం స‌మీపంలోని పుంథురా గ్రామాన్ని కూడా ఆయ‌న సందర్శించారు.  ప్ర‌జ‌లు తుఫాను వ‌ల్ల వారు ఎదుర్కొన్న ఇక్క‌ట్ల‌ను గురించి ఆయ‌న‌కు వివ‌రించారు.  వారికి అన్ని ర‌కాలుగా స‌హాయాన్ని అందిస్తామ‌ని, ఈ సంక్షోభ ఘ‌డియ‌ లో వారితో కేంద్ర ప్ర‌భుత్వం భుజం భుజం క‌లిపి నిల‌బ‌డుతుంద‌ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి హామీని ఇచ్చారు.

క‌వ‌ర‌త్తి, క‌న్యాకుమారి మ‌రియు తిరువ‌నంత‌పురం ల‌లో చేపట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌తో పాటు అక్కడి వర్తమాన ప‌రిస్థితి పైన ప్ర‌ధాన మంత్రి విడి విడిగా కూలంక‌ష స‌మీక్షా స‌మావేశాలను నిర్వ‌హించారు.  ఆయా స‌మావేశాల‌లో కేర‌ళ‌, త‌మిళ‌ నాడు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ లు, ముఖ్య‌మంత్రులు, త‌మిళ‌ నాడు ఉప ముఖ్య‌మంత్రి, లోక్ స‌భ ఉప స‌భాప‌తి, ల‌క్ష‌ద్వీప్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని స‌హాయ‌క చ‌ర్య‌ల ద్వారా తుఫాను బాధిత రాష్ట్రాల‌కు  అండ‌గా నిల‌బ‌డుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

•         కేర‌ళ‌, త‌మిళ‌ నాడు మ‌రియు ల‌క్ష‌ద్వీప్ ల అవ‌స‌రాల‌ను తీర్చ‌డం కోసం 325 కోట్ల రూపాయ‌ల స‌త్వ‌ర ఆర్థిక స‌హాయాన్ని కేంద్రం స‌మ‌కూర్చనుంది.

•         ఈ నెల మొద‌ట్లో ఓఖీ తుఫాను రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను దెబ్బ‌తీసిన త‌రువాత త‌మిళ‌ నాడుకు ప్ర‌క‌టించిన 280 కోట్ల రూపాయల, కేర‌ళ కు ప్ర‌క‌టించిన 76 కోట్ల రూపాయ‌ల ఆర్థిక స‌హాయానికి ప్ర‌ధాన మంత్రి ఈ రోజు ప్ర‌క‌టించిన ఆర్థిక స‌హాయం అద‌నం.

•         ఓఖీ తుఫానులో పూర్తిగా ధ్వంస‌మైన సుమారు 1400 గృహాల పున‌ర్ నిర్మాణానికి ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న (పిఎమ్ఎవై)లో భాగంగా భార‌త ప్ర‌భుత్వం ప్రాధాన్య ప్రాతిప‌దిక‌న మ‌ద్ద‌తిస్తుంది.  ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా కొత్త ఇల్లు క‌ట్టుకోవ‌డానికి ప్ర‌తి ల‌బ్దిదారు 1.5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు సహాయాన్ని పొందుతారు.

•         ఓఖీ తుఫాను బాధిత ప్ర‌జ‌ల బీమా క్ల‌ెయిము ల‌ను త్వరిత గ‌తిన చెల్లించవలసిందిగా బీమా కంపెనీల‌కు సూచించ‌డం జ‌రిగింది.

•         తుఫాను కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన‌ వారి కుటుంబ స‌భ్యుల‌కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున‌, తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి 50,000 రూపాయ‌ల చొప్పున అనుగ్ర‌హ పూర్వ‌క సహాయాన్ని ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్‌) నుండి మంజూరు చేయ‌డం జ‌రిగింది.

అంతక్రితం, ఓఖీ తుఫాను ప‌ర్య‌వ‌సానాల‌ను గురించి స‌మీక్ష స‌మావేశాల‌లో ప్ర‌ధాన మంత్రి దృష్టికి  అధికారులు తీసుకురావడం జ‌రిగింది.  గ‌డ‌చిన 125 సంవ‌త్స‌రాల‌ కాలంలో ఈ ప్రాంతాన్ని తాకిన ఇటువంటి పెను తుఫానులలో ఓఖీ తుఫాను మూడోదని వారు ఈ సందర్భంగా వివరించారు.  2017 న‌వంబ‌ర్ 30వ తేదీ నాడు ఈ తుఫాను వ‌చ్చింది.  అదే రోజున అన్వేష‌ణ మ‌రియు ర‌క్ష‌ణ కార్య‌క‌లాపాలను మొద‌లు పెట్ట‌డం జ‌రిగింది.  ఇంత‌వ‌ర‌కు అన్వేష‌ణ మ‌రియు ర‌క్ష‌ణ కార్య‌క‌లాపాల కోసం భార‌తీయ తీర ర‌క్ష‌క ద‌ళం 20 సర్ఫేస్ ప్లాట్ ఫార్మ్ స్ తో సహా మొత్తం 197 శిప్ డేస్ ను వెచ్చించడ‌మే కాకుండా, 186 ఫ్లయింగ్ అవర్స్ ను కూడా వెచ్చించింది.  దీనికి తోడు, భార‌త నౌకాద‌ళానికి చెందిన 10 నౌక‌ల‌తో పాటు 7 ర‌కాల విమానాలు మొత్తం 156 శిప్ డేస్ ను, ఇంకా 399 ఫ్లయింగ్ అవర్స్ ను వెచ్చించాయి.  ర‌క్ష‌ణ కార్య‌క‌లాపాల‌లో తోడుగా నిల‌వ‌డానికి ఈ నౌక‌ల‌లో మ‌త్స్య‌కారులు, పౌర పాల‌నా సిబ్బంది కలుపుకొని మొత్తం 183 మంది యొక్క సేవ‌ల‌ను వినియోగించుకోవడం జరిగింది.  ఈ రోజు వ‌ర‌కు మొత్తం 845 మంది మ‌త్స్య‌కారుల‌ను ర‌క్షించ‌డ‌మో లేదా ఆదుకోవ‌డ‌మో జ‌రిగింది.

తీరం నుండి 700 నాటిక‌ల్ మైళ్ళ‌కు ఆవ‌ల సైతం నిఘా నేత్రం దృష్టిని సారించిన‌ట్లు అధికారులు ప్ర‌ధాన మంత్రి కి తెలియజేశారు.


***


(Release ID: 1513508) Visitor Counter : 159


Read this release in: English , Kannada