ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రగతి ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ

Posted On: 23 NOV 2017 2:45PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ఈ రోజు జరిగిన 23వ ముఖాముఖి సంభాషణ సమావేశానికి అధ్యక్షత వహించారు.

మొదటి ఇరవై రెండు ‘ప్రగతి’ సమావేశాలలో మొత్తం 9.31 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన 200 ప్రాజెక్టులను సమీక్షించడమైంది. 17 రంగాలలో ప్రజా ఫిర్యాదుల యొక్క పరిష్కారాన్ని కూడా సమీక్షించారు. ఇవాళ జరిగిన ఇరవై మూడో సమావేశంలో, వినియోగదారులకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకారం మరియు పరిష్కారంలో పురోగతిపై ప్రధాన మంత్రి సమీక్షను చేపట్టారు. వినియోగదారు ఫిర్యాదులను సత్వరంగా, సమర్థమైన రీతిలో పరిష్కరించేందుకు తీసుకొన్న చర్యలను గురించి అధికారులు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంపై ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూరే విధంగా, పాలనపరమైన సర్దుబాట్లలో మెరుగుదల చోటు చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

రైల్వేలు, రోడ్లు, విద్యుత్తు మరియు నవీకరణయోగ్య శక్తి రంగాలలో తొమ్మిది అవస్థాపన ప్రాజెక్టులలో పురోగతి ప్రధాన మంత్రి సమీక్షలో చోటు చేసుకొంది. ఈ ప్రాజెక్టులు ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, అసమ్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లతో సహా పలు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటి విలువ 30,000 కోట్ల రూపాయలకు పైనే. ‘ప్రధాన మంత్రి ఖనిజ క్షేత్ర కల్యాణ్ యోజన’ (పిఎమ్ కెకెకెవై) యొక్క అమలు తీరును ప్రధాన మంత్రి సమీక్షించారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ (డిఎమ్ఎఫ్ లు) కు అందుతున్నటువంటి నిధులను వ్యూహాత్మక శ్రద్ధతో వినియోగించాలని, ఈ జిల్లాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధానమైన అభివృద్ధి సంబంధ సమస్యలను లేదా లోటుపాట్లను నివారించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ పనిని- దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలయ్యే 2022 కల్లా అత్యంత ఘనమైనటువంటి ఫలితాలు, ప్రత్యక్షంగా కనపడే ఫలితాలను సాధించే తరహాలో- చేయాలని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 

*****


(Release ID: 1510601) Visitor Counter : 68


Read this release in: English