ఉప రాష్ట్రపతి సచివాలయం
శ్రీ చుక్కా రామయ్య రచించిన ‘మొదటి పాఠం’ ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి
Posted On:
20 NOV 2017 6:20PM by PIB Hyderabad
ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు సోమవారం హైదరాబాద్ లో ప్రముఖ విద్యావేత్త శ్రీ చుక్కా రామయ్య రచించిన ‘మొదటి పాఠం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో జరిగిన గ్రంథావిష్కరణ కార్యక్రమంలో శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ధనికులకే పరిమితమైన ఐఐటి విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి, శ్రీ రామయ్య కృషి చేశారంటూ కొనియాడారు. శ్రీ రామయ్య విద్యా సంస్థల్లో చదువుకొని ఐఐటి లలో ప్రవేశం పొందిన ఎందరో విద్యార్థులు ఈనాడు ఎంతో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని ఉప రాష్ట్రపతి అన్నారు. శ్రీ రామయ్య రాసిన ‘మొదటి పాఠం’ పుస్తకం ఉపాధ్యాయులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. విద్యారంగంలో ఆరేడు దశాబ్దాలపాటు ఉన్నతమైన సేవలు అందించిన శ్రీ రామయ్యను సామాజిక స్పృహ కలిగిన మేథావిగా శ్రీ వెంకయ్య నాయుడు అభివర్ణించారు.
శ్రీ రామయ్య తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారనీ, ఎమ్ఎల్ సి గా రాష్ట్రానికి సేవలందిస్తున్నారనీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెంది, అందుబాటులోకి వచ్చినా గూగల్ ఎన్నటికీ గురువు స్థానాన్ని ఆక్రమించలేదంటూ శ్రీ వెంకయ్య నాయుడు చమత్కరించారు. శ్రీ రామయ్య తన ఉన్నతమైన బోధనా విధానాల ద్వారా, మన దేశ భాషా, సంస్కృతులను కాపాడుతున్నారని ఉప రాష్ట్రపతి కొనియాడారు.
విద్యార్థులందరూ ముందుగా మాతృభాష నేర్చుకొని, అనంతరం ఇతర భాషలను నేర్చుకోవాలని ఈ సందర్భంగా శ్రీ వెంకయ్య నాయుడు సూచించారు. ‘‘మాతృమూర్తినీ, మాతృభాషనూ, మాతృదేశాన్నీ’’ ఎన్నడూ మరువరాదని ఉప రాష్ట్రపతి ఉద్బోధించారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఐఐటి విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి శ్రీ చుక్కా రామయ్య ఎంతో సేవ చేశారని ప్రశంసించారు. శ్రీ రామయ్య వ్రాసిన ‘మొదటి పాఠం’ పుస్తకాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ద్వారా కొనుగోలు చేసి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పూర్వ ఛైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీ అల్లం నారాయణ, టిఎస్పిఎస్సి ఛైర్మన్ శ్రీ జి. చక్రపాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1510258)
Visitor Counter : 115