సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రైతుల సంక్షేమ పథకాల పై ప్రాంతీయ వర్క్ షాప్ నిర్వహణ, వ్యవసాయదారుల సంక్షేమ పథకాలపై రైతాంగాన్ని చైతన్య పరచడంలో కీలక పాత్రను పోషించాల్సింది క్షేత్ర సిబ్బందే: ఎంపి శ్రీ బండారు దత్తాత్రేయ
Posted On:
17 NOV 2017 6:56PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల పట్ల రైతాంగాన్ని జాగృతం చేయడంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఒక భాగంగా ఉన్న డైరక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ కి చెందిన క్షేత్ర స్థాయి సిబ్బంది ఒక ముఖ్యమైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని సికిందరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ అన్నారు. వ్యవసాయదారుల సంక్షేమ పథకాలపై హైదరాబాద్ డైరక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ వర్క్ షాప్ లో శ్రీ బండారు దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను, కొత్త విధానాలను రూపొందించడానికి సమాచార ప్రసార శాఖకు చెందిన సిబ్బంది కళ్ళు మరియు చెవుల వలె వ్యవహరించాలని శ్రీ దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును గురించి ఆయన వివరిస్తూ, ఆధునిక, సాంకేతిక విభాగాలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రతి ఒక్క పథకంలోను పారదర్శకత్వాన్ని సాధించవచ్చని చెప్పారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భూమి స్వస్థత కార్డులు, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం, ఇ-ఎన్ఎఎమ్ తదితర పథకాలు కర్షకుల సంక్షేమానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయని శ్రీ దత్తాత్రేయ వివరించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ శాసనసభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వేరు వేరు పథకాల అమలుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందిస్తోందన్నారు. రైతు లోకానికి సంబంధించిన సంక్షేమ పథకాలకు ప్రాచుర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. కీలక సమయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రైతు లోకానికి ఇతోథిక మార్గదర్శకత్వాన్ని తప్పక అందజేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అంత క్రితం భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) డైరెక్టర్ జనరల్ శ్రీ ఎం.వి.వి.ఎస్. మూర్తి ఈ ప్రాంతీయ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి వర్క్ షాప్ ను ప్రారంభించారు. వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడంలోను, వివిధ పథకాలను అమలు చేయడంలోను కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ సిబ్బంది కీలక పాత్రను పోషించాలని ఆయన సూచించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ డిజిఎమ్ శ్రీ కె. శ్రీనివాస్ బ్యాంకింగ్ పథకాలను గురించి వర్క్ షాప్ లో వివరించారు. తెలంగాణ వ్యవసాయ విభాగంలో ఒఎస్‌డి గా ఉన్న శ్రీమతి జి. అనిత రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలను తెలిపారు. ఆకాశవాణి వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నట్లు ఎఐఆర్ డిప్యూటీ డైరక్టర్ శ్రీ రాహుల్ గౌలీకర్ చెప్పారు. సభికులకు హైదరాబాద్ డైక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ (డిఎఫ్‌పి) జాయింట్ డైరక్టర్ శ్రీ ఎం. దేవేంద్ర స్వాగతం పలికారు. వర్క్ షాప్ కు డిఎఫ్‌పి ఎఫ్‌పిఒ శ్రీమతి పి. భారత లక్ష్మి అధ్యక్షత వహించారు. హైదరాబాద్ పిఐబి డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి. రత్నాకర్ తో పాటు డిఎఫ్‌పి కి చెందిన ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1510069)